
నయనతార ‘ఖోఖో’ అది కానే కాదు..
చెన్నై: ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలలో నటించాలంటే కోలీవుడ్‌లో నయనతార, టాలీవుడ్‌లో అనుష్కలే ముందు గుర్తుకొస్తారని చెప్పవచ్చు. అలాంటిది అనుష్క చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క చిత్రం ఉండగా.. నయన మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. ఈమె గురించి పెళ్లి వార్తలు కాదు గానీ, యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తున్న ప్రసారం మాత్రం మీడియాలో హల్ చల్ చేస్తోంది.
చేతినిండా చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు, మలయాళంలోనూ నయన యమ బిజీగా ఉంది. మాయ చిత్రం తరువాత హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు వరుసగా ఆమె తలుపు తడుతున్నాయి. మధ్యలో డోర చిత్రం నిరాశపరిచినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయూర్ కాలం మొదలగు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో పాటు, శివకార్తికేయన్‌కు జంటగా వేలైక్కారన్ వంటి కమర్షియల్ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంతో పాటు, మలయాళంలో నివీన్‌పాల్‌తో ఒక చిత్రం చేస్తోంది. వీటిలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన వైలైక్కారన్ వచ్చే నెల 29న తెరపైకి రానుంది.
తాజాగా నయనతార మరోసారి లేడి ఓరియంటెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. బ్లాక్ కామెడీ కథా చిత్రంగా తెరకెక్కనున్న మూవీలో యోగిబాబు ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రానికి ఖోఖో అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రసారం జరగడంతో ఇదేదో క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమని భావించారు. నిజానికి ఈ చిత్ర టైటిల్ ఖోఖో కాదట. కోకో అట. కోకో అంటే కోలమావు కోకిల అట. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నాడు. మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.