రచ్చ రచ్చ చేసింది... చివరకు నష్టపోయింది
రచ్చ రచ్చ చేసింది... చివరకు నష్టపోయింది
Published Tue, Oct 22 2013 1:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
కొంతమంది హీరోయిన్లు చిటికెడంత విషయాన్ని చేటంత చేస్తుంటారు. చివరకు అది చాపంత అవుతుంది. పర్యవసానం... దర్శక, నిర్మాతలకు లేనిపోని తిప్పలు. తమిళ హీరోయిన్ నజ్రియా నజీమ్ అలాంటి పనే చేసింది. ఈ నెల 11న ధనుష్‌తో ఆమె జతకట్టిన ‘నైయాండి’ సినిమా విడుదలైంది. నిజానికి ఆ సినిమా ఓ పదిరోజులు ముందే విడుదలవ్వాలి. కానీ ఆలస్యమైంది. కారణం ఈ ముద్దుగుమ్మే. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు ధనుష్, నజ్రియాలపై దర్శకుడు ఎ.సర్కునమ్ ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని ప్లాన్ చేశారు. హీరోయిన్ ‘నాభి’ని హీరో తాకే చేసే సన్నివేశం అది.
అయితే... ఆ సన్నివేశంలో నటించడానికి నజ్రియా ససేమిరా అన్నారు. దాంతో... మరొకరితో ఆ సన్నివేశాన్ని చేయించి, నజ్రియానే చేసినట్లు చూపించారట దర్శకుడు సర్కునమ్. సినిమా పూర్తయింది. చిత్రం యూనిట్‌కి ప్రివ్యూ వేశారు. నజ్రిమ్ కూడా ఆ షోకి హాజరయ్యారు. ఆ సీన్ రానే వచ్చింది. నజ్రిన్ కోపం నషాళానికి అంటింది. ‘నా అనుమతి లేకుండా నన్ను అసభ్యంగా చూపిస్తారా?’ అంటూ అక్కడే రచ్చ రచ్చ చేసేసింది. చివరకు ఈ విషయం పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. దాంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది.
దర్శక, నిర్మాతలు ఎలాగోలా తిప్పలు పడి, ఎట్టకేలకు ఈ నెల 11న సినిమాను విడుదల చేశారు. ఇంత జరిగాక తమిళ నిర్మాతలు ఊరుకుంటారా! పైగా హీరోయిన్లపై నిషేధం విధించడంలో వాళ్లు ముందుంటారు కదా! ఇక ఆలోచించకుండా... ఇంతటి ఆందోళనకు కారకురాలైన నజ్రియాపై నిషేధం విధించేశారు. ఇక ఏ సినిమాలోనూ ఈ మలయాళీ ముద్దుగుమ్మని తీసుకోకూడదని ఆర్డర్ పాస్ చేసేశారు. ఇప్పుడిప్పుడే తమిళనాట మంచి పేరు తెచ్చుకుంటున్న నజ్రియాకు ఇది నిజంగా గట్టి దెబ్బే. మరి ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ ఆదుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ‘రభస’ చిత్రంలో ఈ అమ్మాయి ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement