
బాహుబలి వంటి సినిమాలు చేసేముందు..
బెంగళూరు: బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రాలను చేయాలంటే నటుడిగా తాను పరిణతి సాధించాల్సి ఉందని మెగా హీరో అల్లు శిరీష్ అన్నాడు. ఎస్ఎస్ రాజమౌళి వంటి దర్శకులు తనకు మాస్ చిత్రాల్లో నటించే అవకాశం ఇస్తే చాలా సంతోషిస్తానని చెప్పాడు. అల్లు శిరీష్ నటించిన తాజా సినిమా శ్రీరస్తు శుభమస్తుకు పాజిటీవ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్లిన అల్లు శిరీష్ పీటీఐతో మాట్లాడుతూ.. తన ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాడు.
'రాజమౌళి వంటి దర్శకులు నాకు మాస్ హీరోగా నటించే అవకాశమిస్తే సంతోషిస్తా. అయితే మొదటి నటుడిగా నేను పరిణతి చెందాలి. బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రాలు చేసేముందు నేను నాలుగైదు సినిమాల్లో నటించాలి. యాక్షన్ సినిమాల కంటే కాలేజీ రోమాన్స్ తరహా చిత్రాలకే ప్రస్తుతం నేను ప్రాధాన్యం ఇస్తా. అలాగని నేను యాక్షన్ సినిమాల్లో నటించడానికి వ్యతిరేకం కాదు. యావరేజ్ సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. యువ నటుడిగా కాలేజీ లవ్ స్టోరీ తరహా సినిమాలు చేయాలనుకుంటున్నా' అని అల్లు శిరీష్ చెప్పాడు. సోదరుడు అల్లు అర్జున్తో కలసి నటిస్తారా అన్న ప్రశ్నకు.. తామిద్దరూ అన్నాదమ్ములుగా నటించే అవకాశం వస్తే అంగీకరిస్తానని చెప్పాడు.