టైటిల్: బడ్డీ
నటీనటులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ తదితరులు
దర్శకత్వం: శామ్ ఆంటోన్
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా
సంగీతం : హిప్ హాప్ తమిళ
విడుదల తేది: 02-08-2024
టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. 2022లో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో పలకరించిన శిరీష్ సుమారు రెండేళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అయితే, ఈసారి రీమేక్ సినిమాతో వచ్చాడు. తమిళ్‌లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. థియేటర్‌లో సందడి చేస్తున్న ఈ బడ్డీ సక్సెస్ అయ్యాడా..? అల్లు శిరీష్ సినీ ప్రియుల్ని ఏ మేరకు అలరించాడో తెలుసుకుందాం.
కథ...
ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్‌కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? పల్లవి కిడ్నాప్‌కి.. హాంగ్ కాంగ్‌లో ఉన్న డాక్టర్ అర్జున్ (అజ్మల్ అమీర్)కి ఉన్న సంబంధం ఏంటి? టెడ్డీబేర్‌లో ఆత్మ ఉందని తెలిసిన తర్వాత ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరకు పల్లవిని ఎలా రక్షించాడా..? లేదా..? అనేదే మిగతా కథ
ఎలా ఉందంటే..?
అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంతో టాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి. బడ్డీ సినిమా నేపథ్యం కూడా అదే. అయితే ఓ బొమ్మకు ప్రాణం రావడం అనే పాయింట్ కొత్తగా త్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన టెడ్డీకి తెలుగు రీమేక్. అయితే బొమ్మలోకి ఆత్మ రావడం అనే ఒక పాయింట్ మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకొని మిగతాదంతా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి తెరకెక్కించాడు. దర్శకుడు మార్చిన అంశాలు బాగున్నప్పటికీ వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో తడబడ్డాడు.
అవయవాల అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ అర్జున్ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు. ఆపై వెంటనే పల్లవి (గాయత్రి భరద్వాజ్) కోమాలోకి వెళ్లడం.. అనంతరం ఆమె జీవితంలోకి టెడ్డీబేర్ రావడం వంటి సీన్లు మెప్పిస్తాయి. అయితే, టెడ్డీ బేర్‌కు ప్రాణం వచ్చి రోడ్ మీద తిరుగుతుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు లేదా భయపడుతారు. కానీ, ఇందులో అలాంటివి ఏవీ జరగవు. పైగా సెల్పీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. అయితే చిన్ని పిల్లలకు కాస్త ఆసక్తిని కలిగించవచ్చు.
సెకండాఫ్‌లో కథ అంతా హాంకాంగ్‌కు షిఫ్ట్ అయిపోతుంది. పల్లవి కోసం వెతుక్కుంటూ అల్లు శిరీష్ అక్కడికి చేరుకుంటాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వచ్చే యాక్షన్ సీన్ పర్వాలేదనిపిస్తుంది. మిషన్ గన్ తో టెడ్డీబేర్ చేసే యాక్షన్ సీన్ నవ్వులు పూస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథ సాగదీతిగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
పైలట్ ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశారు. పల్లవిగా గాయత్రి భరద్వాజ్ చక్కగా నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. విలన్‌గా అజ్మల్ ఎంట్రీ పవర్ ఫుల్‌గా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సింపుల్‌గా అనిపిస్తుంది. ప్రిషా సింగ్ అలీ, ముకేష్ రిషితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. హిప్ హాప్ తమిళ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment