సినిమానే కాదు.. మా నిజ జీవిత సంఘటన
ముంబై: ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ జీవితకథ ఆధారంగా నిర్మించిన బాలీవుడ్ సినిమా 'నీర్జా'కు ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. 1986 సెప్టెంబర్ 5న హైజాక్కు గురైన ముంబై-న్యూయార్క్ విమానంలో లిబియా ఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో నీర్జా తన ప్రాణాలను కోల్పోయింది. అప్పట్లో ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న విమాన ప్రయాణికుడు ఖంజన్ దలాల్ 'నీర్జా' సినిమాను చూసి.. అనాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. నీర్జా బానోత్కు నివాళులు అర్పిస్తూ చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపాడు. నీర్జా సినిమా మాత్రమే కాదు మా జీవితాల్లో జరిగిన వాస్తవిక సంఘటన అని ఖంజన్ దలాల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అప్పట్లో ఉగ్రవాదుల దాడిలో ఖంజన్ దలాల్ తల్లి తృప్తి దలాల్ మరణించింది.
'కొందరికిది గొప్ప చిత్రం. థియేటర్లో నీర్జా సినిమా చూసి పాప్ కార్న్ తిని, కూల్ డ్రింక్ తాగి ఆస్వాదిస్తారు. కంటతడి కూడా పెడతారు. ఇంటికి వెళ్లాక సినిమా గురించి ఇతరులకు చెబుతారు. మాకు మాత్రం ఇది కేవలం సినిమా కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటన. జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని భయంకర ఘటన. అద్భుతంగా తెరకెక్కించారు' అని ఖంజన్ దలాల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. సోనమ్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన 'నీర్జా' సినిమాకు రామ్ మధ్వానీ దర్శకత్వం వహించారు. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో 22 కోట్ల రూపాయలను వసూలు చేసింది.