
ముంబై : తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగానే బాలీవుడ్‌ను వీడినట్లు హీరోయిన్ నీరూ బజ్వా పేర్కొన్నారు. 1998లో దేవానంద్ హీరోగా తెరకెక్కిన ‘మై సోలా బరాస్ కీ’ సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. గత కొంతకాలంగా హిందీ చిత్రసీమకు దూరమైన ఆమె ప్రస్తుతం.. పంజాబీ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. హీరో దిల్జిత్ దోసన్‌కు జంటగా నీరూ నటించిన ‘షాదా’ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. ఈ సందర్భంగా నీరూ మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్ల నాటి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
‘బాలీవుడ్‌లో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా. కానీ అక్కడ నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయని కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నాతో ద్వంద్వార్థాలతో మాట్లాడారు. ఒక్కసారిగా భయంతో వణికిపోయా. వారి మాటలే అంత నీచంగా ఉంటే ప్రవర్తన ఇంకెంత దారుణంగా ఉంటుందో ముందే ఊహించగలిగాను. అలా అని అందరూ ఒకేలా ఉంటారని చెప్పను. దురదృష్టవశాత్తూ నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే బాలీవుడ్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. నా నుంచి ఏమీ ఆశించకుండా కేవలం ప్రతిభ ఆధారంగా పంజాబీ సినిమాలో నాకు అవకాశాలు ఇస్తున్నారు. నటిగా నిరూపించుకోవడానికి ఇది చాలు. ఇకపై బాలీవుడ్ వంక చూసేది లేదు’ అని తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కాగా పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన షాదా పంజాబీతో పాటు పలు భాషల్లో విడుదలైంది. ఇక ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా పలువురు నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి గళం విప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment