ఆమె వద్దే వద్దు!
హన్సిక అస్సలొద్దు అన్నారట ఆ నిర్మాత. దీంతో దర్శకుడు కూడా సైలెంట్ అయిపోయారట. ఇంతకీ ఎవరా దర్శక నిర్మాతలనేగా మీ ఉత్సుకత. అక్కడికే వస్తున్నాం. నటి హన్సికకు ఈ మధ్య టైమ్ ఏమీ బాగోలేదు. కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేదంటే నమ్మండి. లోపం ఎక్కడుండి? చిత్రాల ఎంపికలోనా? ఏదేమైనా హన్సికను కోలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసిందన్నది నిజం. టాలీవుడ్‌లోనే అమ్మడికి ఇదే పరిస్థితి. కాగా మాలీవుడ్‌లో మాత్రం ఒక చిత్రంలో నటిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో దర్శకుడు సుందర్.సీ మంచి అవకాశం ఇవ్వాలని భావించారు. ఆయన దర్శకత్వంలో హన్సిక ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించింది.
అందుకే ఆమె అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. దీంతో తన తాజా చిత్రం సంఘమిత్రకు కథానాయకి సెట్ కావడంలేదు. చాలా కాలంగానే ఈ చిత్రంలో నాయకి కోసం అన్వేషణ జరిగింది. చివరికి క్రేజీ నటి శ్రుతీహాసన్ నటించడానికి అంగీకరించి, ఆ తరువాత వైదొలిగి షాక్ ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి పరిస్థితిలో దర్శకుడు సుందర్.సీ తన ఆస్థాన నటి హన్సికను సంఘమిత్రలో యువరాణిని చేయాలని ఆశించారట.
అయితే వ్యాపారంలో మెలికలు తిరిగిన సంఘమిత్ర చిత్ర నిర్మాత, శ్రీతేనాండాళ్ ఫిలింస్ అధినేత మురళి నటి హన్సికకు తమిళంలోనే కాదు తెలుగులోనూ మార్కెట్‌లేదని, అలాంటి నటిని సంఘమిత్రలో నాయకిగా ఎంపిక చేస్తే చిత్ర వ్యాపారం మొత్తం దెబ్బతింటుందని అన్నారట. దీంతో దర్శకుడు సుందర్.సీ సైలెంట్ అయ్యిపోయారట. కాగా సంఘమిత్రలో నటి నయనతార పేరు పరిశీలనకు వచ్చిందట. ఈ అగ్రనాయకిపైనా నిర్మాత మొగ్గు చూపలేదట. నయనతార నటించిన తిరునాళ్, డోరా వంటి చిత్రాలు అపజయం చెందడమే ఇందుకు కారణం అట.కాగా ఏతా వాతా సంఘమిత్ర నాయకి బాలీవుడ్‌కు చెందిన బ్యూటీనే అయ్యే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.