Sangamitra
-
మూడు నెలల్లో కదన రంగంలోకి
కదన రంగంలోకి కాలు పెట్టనున్నారు దిశా పాట్నీ. జులై నుంచి ఈ గ్లామర్ గాళ్ గుర్రపు స్వారీ చేస్తూ, కత్తి తిప్పనున్నారట. ఇదంతా ఎందుకంటే ‘సంఘమిత్ర’ సినిమా కోసం. ఇందులో వారియర్ క్వీన్‌గా కనిపించటం కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు దిశా పాట్నీ. సుందర్.సి దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రం ‘సంఘ మిత్ర’. శ్రీ తేనాండాళ్ ఫిల్మ్ బ్యానర్‌పై మురళీ రామస్వామి, ఎన్. రామస్వామి నిర్మించనున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. హైదరాబాద్‌లో రూపొందించే భారీ సెట్లో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ని స్టార్ట్ చేయనున్నారట. ఈ పీరియాడిక్ డ్రామాలో ముందు హీరోయిన్గా శ్రుతీహాసన్‌ని అనుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలోకి దిశా పాట్నీ వచ్చారు. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి నుంచే మొదలు కావాల్సిన ఈ షూట్ దిశా పాట్నీ ‘భాగీ 2’లో బిజీగా ఉండటంతో జులైకి పోస్ట్‌పోన్ అయిందని భోగట్టా. ఫస్ట్ పార్ట్‌ని వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట దర్శకుడు సుందర్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. కెమెరా: అశీమ్ మిశ్రా. -
సంఘమిత్రలో దిశాపఠాని?
నటి దిశాపఠాని ఇంకా నిర్ణయం జరగలేదు అంటోంది. ఏమిటా నిర్ణయం అన్నది తెలుసుకోవాలనుందా? ఎంఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరి చిత్రంతో బాలీవుడ్లో రంగప్రవేశం చేసిన ఈ ఉత్తరాది దిశాపఠాని. అయితే బీటెక్ చదివిన ఈ అమ్మాయి చాలా మంది బ్యూటీస్ లాగానే మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. క్యాడ్బరీ వాణిజ్య ప్రకటన ద్వారా ప్రాచుర్యం పొందిన దిశాపఠానిపై మొట్టమొదట దృష్టి పడింది టాలీవుడ్ దర్శకుడు పూరిజగన్నాథ్‌దే. అంతే లోఫర్ చిత్రంలో హీరోయిన్ అయ్యిపోయింది. ఆ తరువాతే హిందీలో ఎంఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరి చిత్రంతో బాలీవుడ్ తెరపై మెరిసింది. తాజాగా కోలీవుడ్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్‌లో బాహుబలి చిత్రం తరహాలో సంఘమిత్ర చిత్రం తెరరూపానికి చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మెర్శల్ వంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ ఈ చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందించనుంది. సుందర్.సీ దర్శకత్వం వహించనున్న ఇందులో జయం రవి, ఆర్య కథానాయకులుగా సెట్ అయ్యారు. కథానాయకిగా శ్రుతిహాసన్ ముందు ఓకే అన్నా, ఆ తరువాత అనూహ్యంగా వైదొలగి పెద్ద వివాదానికే కారణమైన విషయం తెలిసిందే. దీంతో ఆమె పాత్రలో నటించడానికి నయనతార, హన్సికల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వారూ సెట్ కాలేదు. చివరికి బాలీవుడ్ చిన్నది దిశాపఠాని ఎంపికైనట్లు ప్రచారం హోరెత్తింది. ఈ సంచలన చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. దర్శకుడు సుందర్.సీ సంఘమిత్ర చిత్రం అనుకున్న తరువాత కలగలప్పు 2 చిత్రాన్ని పూర్తి చేసేశారు. ఆ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక జయం రవి ‘టిక్ టిక్ టిక్’ చిత్రాన్ని పూర్తి చేసి అదంగమణు చిత్రానికి రెడీ అయిపోయారు. ఆర్య కూడా గజనికాంత్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి దిశాపఠాని కూడా షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంఘమిత్ర చిత్రంలో నటించే విషయం గురించి ఆ చిత్ర యూనిట్ వర్గాలు చర్చించారు కానీ ఇంకా అందులో నటించే విషయంలో తుది నిర్ణయం జరగలేదని పేర్కొంది. అంటే సంఘమిత్రలో దిశాపఠాని నటించే విషయంలో కూడా క్లారిటీ లేదన్నమాట. -
శ్రుతి బాటలో హన్సిక
తమిళసినిమా: సంచలన హీరోయిన్లలో నటి శ్రుతీహాసన్ ఒకరు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించినా సరైన విజయం తన ఖాతాలో ఇప్పటికీ పడలేదనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో తన తండ్రితో నటిస్తున్న చిత్రం మినహా వేరే చిత్రం కూడా లేదు. మంచి అవకాశం శ్రుతీహాసన్కిప్పుడు చాలా అవసరం అని చెప్పకతప్పదు. అదే విధంగా నటి హన్సిక పరిస్థితి దాదాపు అలానే ఉంది. చేతిలో పెద్దగా చిత్రాలు లేవు. మలయాళంలో మోహన్‌లాల్‌తో విలన్ అనే చిత్రంలో నటిస్తోంది. విషయం ఏమిటంటే శ్రుతీహాసన్ దర్శకుడు సుందర్.సీ తెరకెక్కించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో నటించడానికి ఎంపికై, గత మేలో ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేదికపై జరిగిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు. ఆ విషయం పెద్ద వివాదానికి దారి తీసిందన్నది వేరే విషయం. తరువాత సంఘమిత్ర చిత్రంలో శ్రుతీహాసన్ ప్లేస్‌ను నటి హన్సిక భర్తీ చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. సుందర్.సీ. ఫేవరేట్ నటిగా ముద్రపడిన హన్సికతో ఫొటో సెషన్ కూడా చేశారనే ప్రచారం జరిగింది. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ భాణీలు కడుతున్నారు. ఇక షూటింగే తరువాయి అనుకుంటున్న తరుణంలో చిత్రం నుంచి హన్సిక కూడా నటించడం లేదనే ప్రచారం తాజాగా సామాజక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో మళ్లీ కథ మొదటి కొచ్చిందనిపిస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
ఒక్క అడుగు దూరంలో...
ఇంకొక్క అడుగు పడితే వెండితెరపై మరోసారి యువరాణిగా కనిపించే అవకాశం హన్సికనే వరిస్తుందని చెన్నై సినిమా జనాలు అంటున్నారు. ఆల్రెడీ ‘పులి’లో హన్సిక యువరాణిగా నటించారు. తాజాగా తమిళ దర్శకుడు సుందర్ సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ ఫిల్మ్ ‘సంఘమిత్ర’లో హన్సిక టైటిల్ రోల్ చేసే ఛాన్సుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దర్శక–నిర్మాతలు ‘సంఘమిత్ర’గా ఎవర్నీ ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. తాజా ఖబర్ ఏంటంటే... ఇటీవల హన్సికకు లుక్ టెస్ట్ జరిగిందట! ‘సంఘమిత్ర’గా ఆమె ఎలా ఉంటుందోనని చెన్నైలోని బిన్నీ మిల్స్‌లో ఫొటోషూట్ చేశారట. దర్శక, నిర్మాతలు హన్సిక లుక్ పట్ల హ్యాపీ అయితే... ఆమె నెక్స్›్ట స్టెప్ సినిమాకు సైన్ చేయడమే. దర్శకుడు సుందర్. సీకి హన్సిక లక్కీ మస్కట్. వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. సో, ‘సంఘమిత్ర’లో హాన్సిక ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినట్లేనని చెన్నై టాక్!! -
నయన్ కోరికతో బెంబేలు
తమిళసినిమా : తేనాండాల్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్ర. ఇందులో జయంరవి–ఆర్య హీరోలుగా నటిస్తుండగా సంఘమిత్ర అనే టైటిల్ రోల్‌ను శృతిహాసన్ నటించాల్సి ఉంది. అందుకోసం అమ్మడుకి అలనాటి కత్తిసాము వంటి కళల్లో శిక్షణలు కూడా ఇప్పించారు. అయితే, చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతుందన్న పరిస్థితుల్లో ఆ చిత్రం నుంచి శృతి తప్పుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఆ పాత్ర కోసం తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషా నటి కోసం గాలించాల్సిన పరిస్థితి సంఘమిత్ర బృందానికి ఏర్పడింది. అప్పుడే దక్షిణాదిలో అగ్ర తారలుగా వెలుగుతున్న నయనతార, అనుష్కలతో రెండు సంవత్సరాలకు కాల్ షీట్లకు బేరసారాలు జరిపారు. అయితే, ఇద్దరూ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో కమిట్ అయ్యి నటిస్తుండడం వల్ల ఇప్పటికి సంఘమిత్రలో నటించడం కుదరదని తెలిపారట. అయినప్పటికీ నయనతార నటిస్తే బాగుంటుందని తలచిన చిత్ర బృందం ఆమెతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చారు. సంగమిత్రతో కమిట్ అయితే కనీసం ఒకటిన్నర సంవత్సరం కాలం వేరే చిత్రాల్లో నటించడానికి కుదరదు. దీంతో జాగ్రత్తగా ఆలోచించిన నయన్ తాను సంఘమిత్రలో నటించడానికి సిద్ధమేనని తెలిపిందట. అయితే అందుకు అమ్మడు కోరిన రెమ్యూనరేషన్ మొత్తం విని బెంబేలెత్తిన చిత్ర బృందం ఆ తర్వాత నుంచి ఆమెతో చర్చలు జరపడం నిలిపివేసినట్లు కోలీవుడ్ టాక్. -
యువరాణి పట్టం హన్సికకేనా?
తమిళసినిమా: సంఘమిత్ర చిత్రం గురించి వార్తల్లో అధికంగా నానుతోంది. మొదట ఇలయదళపతి విజయ్, టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబులను కథానాయకులుగా నటింపజేసే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అందులో నటించడానికి వారిద్దరూ ధైర్యం చేయలేక పోయారు. కారణం కాల్షీట్స్ సమస్యేనని సమాచారం. చివరికి యువ హీరోలు జయంరవి, ఆర్య సుమారు 200 రోజులు ఈ చిత్రం కోసం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. ఇక కథానాయకి విషయంలోనూ అదే పరిస్థితి. ఇందులో హీరోయిన్ కోసం పలువురి పేర్లు ప్రచారమయ్యాయి. శ్రుతీహాసన్ నటించడానికి రెడీ అయ్యారు కూడా. దీంతో కాస్త రిలాక్స్ అయిన చిత్ర యూనిట్‌కు ఆ బ్యూటీ వైదొలగడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సంఘమిత్రలో యువరాణి కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. మధ్యలో హన్సిక పేరు వినిపించింది. అయితే మార్కెట్ డౌన్ అయిన హన్సికపై నిర్మాతల వర్గం ఆసక్తిని చూపలేదనే ప్రచారం హల్చల్ చేసింది. ఆ తరువాత నయనతారతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ లీకైంది. అయితే చేతి నిండా చిత్రాలున్న నయనతార సంఘమిత్ర చిత్రం కోసం రెండేళ్లు కాల్షీట్స్ కేటాయించడానికి సిద్ధంగా లేరనే ప్రచారంలో జరుగుతోంది. తాజాగా మళ్లీ హన్సికనే సంఘమిత్రలో యువరాణిని చేసే పనిలో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలిస్తోంది. ఈ ముద్దుగుమ్మతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా తేనాండాళ్ ఫిలింస్ బాహుబలి తరహాలో బ్రహ్మండంగా రూపొం దించడానికి సన్నాహాలు చేస్తున్న సంఘమిత్ర చిత్రానికి సుందర్.సీ దర్శకత్వాన్ని, ఏఆర్.రెహ్మన్ సంగీతాన్ని. సబుసిరిల్ కళాదర్శకత్వాన్ని అందిస్తున్నారు. చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
యువరాణి కోసం మళ్లీ అన్వేషణ ?
సంఘమిత్ర చిత్రం గురించి ఏ ముహూర్తన ప్రకటించారో అప్పటి నుంచి వార్తల్లోనే నానుతోంది. మొదట ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబులను కథానాయకులుగా నటింపజేసే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. కథ బాగుందన్న సర్టిఫికెట్ ఇచ్చినా అందులో నటించడానికి వారిద్దరూ ధైర్యం చేయలేదు. కారణం కాల్షీట్స్ సమస్యేనని సమాచారం. చివరికి యువ హీరోలు జయంరవి, ఆర్యలు సుమారు 200 రోజులు ఈ చిత్రం కోసం త్యాగం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇక కథానాయకి విషయంలోనూ అదే పరిస్థితి. హీరోయిన్ కోసం పలువురు ప్రముఖ నటీమణుల పేర్లు ప్రచారం అయ్యాయి. శ్రుతీహాసన్ నటించడానికి రెడీ అయ్యారు. దీంతో కాస్త రిలాక్స్ అయిన చిత్ర యూనిట్ కు ఆ బ్యూటీ వైదొలగడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.సంఘమిత్రలో యువరాణి కోసం మళ్లీ అన్వేషణ మొదలయ్యింది. మధ్యలో నటి హన్సిక పేరు వినిపించింది. అయితే మార్కెట్ డౌన్ అయిన నటిపై నిర్మాతల వర్గం ఆసక్తిని చూపలేదనే ప్రచారం హల్చల్ చేసింది. ఆ తరువాత హీరోయిన్ నయనతారతో చర్యలు జరుపుతున్నట్లు టాక్ లీక్ అయ్యింది. చేతి నిండా చిత్రాలున్న నయనతార సంఘమిత్ర చిత్రం కోసం కాల్షీట్స్ కేటాయించడానికి సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. తాజాగా వద్దు బాబోయ్ అన్న హన్సికనే యువరాణిని చేసే పనిలో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మతో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. తేనాండాళ్ ఫిలింస్ బాహుబలి తరహాలో బ్రహ్మండంగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సీ. సుందర్, సంగీతాన్ని ఏఆర్.రెహమాన్ అందిస్తున్నారు. చిత్రం త్వరలోనే సెట్ పైకి వెళ్లనుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
శ్రుతీని మేమే వద్దనుకున్నాం!
‘‘కాల్షీట్స్లో క్లారిటీ లేదు. బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వలేదు... అందుకే ‘సంఘమిత్ర’ ప్రాజెక్ట్ నుంచి తప్పకుంటున్నా’’ అని శ్రుతీహాసన్ స్టెట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుందర్. సి. దర్శకత్వంలో తేనాండాళ్ ఫిల్మ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని శ్రుతి వ్యాఖ్యలు చేసి, దాదాపు నెల అయ్యింది. ఆ వార్తలపై ఇప్పుడు సంస్థ సీఈఓ హేమా రుక్మిణి స్పందించారు. ‘‘శ్రుతీహాసన్ తనంతట తను తప్పుకోలేదు. ఆమెతో కలిసి పని చేయలేం అని మేమే డిసైడ్ అయ్యాం. ఇది వృత్తిపరమైన నిర్ణయం. శ్రుతీహాసన్ స్థానంలో ఎవర్ని తీసుకోబోతున్నాం అన్నది త్వరలో తెలియజేస్తాం’’ అని హేమా రుక్మిణి అన్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ అందజేయని కారణంగానే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు శ్రుతి ఆరోపించారు. కానీ, హేమ మాత్రం స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయ్యిందంటున్నారు. ‘‘కథ రెడీ అయ్యింది. స్క్రిప్ట్‌ను ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం వస్తే, షూటింగ్ టైమ్‌లో అది ఆటోమెటిక్‌గా జరుగుతుంది’’ అని స్పష్టం చేశారామె.శ్రుతీహాసన్ స్థానంలో నయనతార యాక్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘నయనతార అమేజింగ్ ఆర్టిస్ట్. ఇది వరకు నయనతో వర్క్ చేశాం. ‘సంఘమిత్ర’ లుక్ ఎలా ఉండాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాం. సంఘమిత్ర ఎవరన్నది త్వరలోనే చెబుతాం’’ అన్నారామె. మరి.. హేమా రుక్మిణి వ్యాఖ్యలకు శ్రుతి స్పందిస్తారా? వెయిట్ అండ్ సీ. -
భారీగా ఇస్తాం నటించవా ప్లీజ్!
కావాలంటే పారితోషికాన్ని భారీగానే ముట్టజెబుతాం.అని నయనతారను దర్శక నిర్మాతలు బ్రతిమలాడుతున్నారట. ఇది నిజమేనా? సంగతేమిటంటే సంఘమిత్ర చిత్రానికింకా నాయకి దొరకలేదట. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించితలపెట్టిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్.సీ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకులను ఎంపిక చేయడానికి చాలానే తర్జన భర్జనలు పడాల్సి వచ్చింది. విజయ్, అజిత్, టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు వరకూ చర్చలు జరిగాయి. వారందరూ కథ బ్రహ్మాండం అన్నారే కానీ, అందులో నటించడానికి సాహసించలేదు. అందుకు వారు చెప్పిన కారణం రెండేళ్ల పాటు సంఘమిత్ర కోసం కాల్షీట్స్ను కేటాయించలేమన్నదే. ఎట్టకేలకు జయంరవి, ఆర్య కథానాయకులుగా సెట్ అయ్యారు. ఇక కథానాయకి ఎంపికకు అదే పరిస్థితి. నటి శ్రుతీహాసన్ నటించడానికి సమ్మతించి చివరి క్షణంలో వైదొలిగారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సద్దుమణిగినా నాయకి ఎవరన్నది ప్రశ్నగానే మారింది. బాహుబలి ఫేమ్ అనుష్కను నటింపజేసే ప్రయత్నం జరిగింది. తను ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. మళ్లీ అన్ని కాల్షీట్స్తో తానీ చిత్రం చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో దర్శకుడు సుందర్.సీ.తన ఆస్థాన కథానాయకి హన్సిక పేరును సిఫారసు చేసినా, నిర్మాత అందుకు సమ్మతించలేదనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఒక దశలో బాలీవుడ్ భామను నటింపజేసే ఆలోచన జరిగిందట. అదీ వర్కౌట్ కాకపోవడంతో నటి నయనతారపై దృష్టిసారించినట్లు తాజా సమాచారం.అయితే ఈ టాప్ హీరోయిన్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా భారీ పారితోషికం ముట్టజెబుతాం సంఘమిత్రలో రాణి కావాలంటూ బ్రతిమలాడే ధోరణికి దిగారని సోషల్ మీడియాలో తాజాప్రచారం. కాగా తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కాలషీట్స్ కోరితే సంఘమిత్రలో నటించడానికి రెడీ అని నయనతార అన్నట్లు లేటెస్ట్ న్యూస్. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావడానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పవచ్చు. -
సంఘమిత్ర కోసం రెండేళ్లు
‘బాహుబలి’ కోసం ప్రభాస్ ఐదేళ్లు రాసిచ్చారు. ఈ టైమ్‌లో మరో సినిమా చేయలేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... ‘బాహుబలి’ స్థాయిలో ‘సంఘమిత్ర’ సినిమాను తీయాలని తమిళ దర్శకుడు సుందర్ .సి సంకల్పించిన సంగతి తెలిసిందే. ‘సంఘమిత్ర’లో ఓ హీరోగా నటించనున్న ‘జయం’ రవి తన రెండేళ్ల కాల్షీట్స్ను ఈ సినిమాకు రాసిచ్చారట! ‘బాహుబలి’ చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఐదేళ్లు పడుతుందని ఎవరూ అనుకోలేదు. ‘సంఘమిత్ర’కు ‘జయం’ రవి రెండేళ్లు కేటాయించారు. సినిమా పూర్తయ్యే సరికి ఎన్ని రోజులు పడుతుందో! ఇందులో ఆర్య మరో హీరోగా నటించనున్నారు. -
నయనతారను బతిమలాడుతున్నారట
‘సంఘమిత్ర’ చిత్రంలో నటించాలని, కావాలంటే పారితోషికాన్ని భారీగానే ముట్టజెబుతాం అని దర్శక,నిర్మాతలు హీరోయిన్ నయనతారను బతిమలాడుతున్నారట. ఇంతకీ సంగతేమిటంటే సంఘమిత్ర సినిమాకు ఇంకా కథానాయకి దొరకలేదట. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించితలపెట్టిన భారీ చరిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్.సీ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకులను ఎంపిక చేయడానికి చాలా తర్జనభర్జనలు పడాల్సి వచ్చింది. విజయ్, అజిత్, టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు వరకూ చర్చలు జరిగాయి. వారందరూ కథ బ్రహ్మాండం అన్నారే కానీ, అందులో నటించడానికి సాహసించలేదు. అందుకు వారు చెప్పిన కారణం రెండేళ్లపాటు సంఘమిత్ర కోసం కాల్షీట్స్ను కేటాయించలేమన్నదే. దీంతో ఎట్టకేలకు జయం రవి, ఆర్యలు కథానాయకులుగా సెట్ అయ్యారు. కథానాయకి ఎంపికకూ అదే పరిస్థితి. నటి శ్రుతిహాసన్ నటించడానికి సమ్మతించి చివరి క్షణంలో వైదొలగారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సద్దుమణిగినా నాయికి ఎవరన్నది ప్రశ్నగానే మారింది. బాహుబలి ఫేమ్ అనుష్కను అడిగితే ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన తాను మళ్లీ అన్ని కాల్షీట్స్తో ఈ చిత్రం చేయలేనని ఆమె చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో దర్శకుడు సుందర్.సి తన ఆస్థాన కథానాయకి హన్సిక పేరును సిపారసు చేసినా నిర్మాత అందుకు సమ్మతించలేదని ప్రచారం. ఒక దశలో బాలీవుడ్ భామను నటింపజేసే ఆలోచన జరిగిందట. అదీ వర్కవుట్ కాకపోవడంతో చివరకు నయనతారపై దృష్టి సారించినట్లు తాజా సమాచారం. అయితే ఆమె చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా భారీ పారితోషికం ముట్టజెబుతామని సంఘమిత్రలో రాణి పాత్రను పోషించాలంటూ బతిమలాడే ధోరణికి దిగారని సోషల్ మీడియాలో ప్రచారం. కాగా, తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కాల్‌ష్‌ట్స్ ఇవ్వడానికి రెడీ అని నయనతార అన్నట్లు లేటెస్ట్ న్యూస్. -
ఆమె వద్దే వద్దు!
హన్సిక అస్సలొద్దు అన్నారట ఆ నిర్మాత. దీంతో దర్శకుడు కూడా సైలెంట్ అయిపోయారట. ఇంతకీ ఎవరా దర్శక నిర్మాతలనేగా మీ ఉత్సుకత. అక్కడికే వస్తున్నాం. నటి హన్సికకు ఈ మధ్య టైమ్ ఏమీ బాగోలేదు. కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేదంటే నమ్మండి. లోపం ఎక్కడుండి? చిత్రాల ఎంపికలోనా? ఏదేమైనా హన్సికను కోలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసిందన్నది నిజం. టాలీవుడ్లోనే అమ్మడికి ఇదే పరిస్థితి. కాగా మాలీవుడ్‌లో మాత్రం ఒక చిత్రంలో నటిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో దర్శకుడు సుందర్.సీ మంచి అవకాశం ఇవ్వాలని భావించారు. ఆయన దర్శకత్వంలో హన్సిక ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించింది. అందుకే ఆమె అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. దీంతో తన తాజా చిత్రం సంఘమిత్రకు కథానాయకి సెట్ కావడంలేదు. చాలా కాలంగానే ఈ చిత్రంలో నాయకి కోసం అన్వేషణ జరిగింది. చివరికి క్రేజీ నటి శ్రుతీహాసన్ నటించడానికి అంగీకరించి, ఆ తరువాత వైదొలిగి షాక్ ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇలాంటి పరిస్థితిలో దర్శకుడు సుందర్.సీ తన ఆస్థాన నటి హన్సికను సంఘమిత్రలో యువరాణిని చేయాలని ఆశించారట. అయితే వ్యాపారంలో మెలికలు తిరిగిన సంఘమిత్ర చిత్ర నిర్మాత, శ్రీతేనాండాళ్ ఫిలింస్ అధినేత మురళి నటి హన్సికకు తమిళంలోనే కాదు తెలుగులోనూ మార్కెట్‌లేదని, అలాంటి నటిని సంఘమిత్రలో నాయకిగా ఎంపిక చేస్తే చిత్ర వ్యాపారం మొత్తం దెబ్బతింటుందని అన్నారట. దీంతో దర్శకుడు సుందర్.సీ సైలెంట్ అయ్యిపోయారట. కాగా సంఘమిత్రలో నటి నయనతార పేరు పరిశీలనకు వచ్చిందట. ఈ అగ్రనాయకిపైనా నిర్మాత మొగ్గు చూపలేదట. నయనతార నటించిన తిరునాళ్, డోరా వంటి చిత్రాలు అపజయం చెందడమే ఇందుకు కారణం అట.కాగా ఏతా వాతా సంఘమిత్ర నాయకి బాలీవుడ్‌కు చెందిన బ్యూటీనే అయ్యే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
చెత్తే కదా అని వదిలేస్తే ఊరుకోం!
బెంగళూరు, న్యూస్‌లైన్ : చెత్తను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని బెంగళూరు ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. అంతటితో ఆగకుండా చెత్త తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సంగమిత్రను తాను ఉన్న ప్రదేశం నుంచే సస్పెండ్‌కు గురిచేశారు. అలాగే పాలికె సీనియర్ ఇంజనీర్ నరసింహరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ లింగన్న, ఇంజనీర్ మోహన్ కుమార్‌ను వారివారి మాతృసంస్థలకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం ఉదయం మంత్రి రామలింగారెడ్డి నగరంలోని మెయోహాల్ వద్ద బీబీఎంపీ అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం నేరుగా ఆస్టిన్‌టౌన్ చేరుకుని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ప్రభుత్వ పాఠశాల పక్కనే కుప్పలుతెప్పలుగా పడి ఉన్న చెత్తను చూసి అధికారులపై మండిపడ్డారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న స్థానికులు మాట్లాడుతూ... ఆ ప్రాంతంలో పోగవుతున్న చెత్త వల్ల అనారోగ్యాల పాలవుతున్నట్లు వాపోయారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికక్కడే ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సంగమిత్రను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు ఇంజనీర్లను వారి మాతృసంస్థలకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ప్రధాన డ్రెయినేజీ వద్దకు చేరుకోగానే అక్కడ వెలువడుతున్న దుర్గంధాన్ని భరించలేక మంత్రితో సహ అధికారులూ ముక్కులు మూసుకున్నారు. ‘ఒక్క నిమిషానికే ఇలా ముక్కులు మూసుకుంటున్నారే... మరీ స్థానికులు ఎలా ఉండగలుగుతున్నారు? మీరే కనుక ఇక్కడ నివాసముండగలరా?’ అంటూ అదికారులను నిలదీశారు. తక్షణమే అక్కడ దుర్గంధం రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెత్త తొలగింపులో నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ, ఎమ్మెల్యే హ్యరీష్, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ, కార్పొరేటర్లు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది ఉన్నారు.