అలాంటివి బుద్ధిహీనులే చూస్తారు
కోలీవుడ్‌లో ఫైర్‌బాంబుగా పేర్కొనే తారల్లో నటి రాధికా శరత్‌కుమార్ ఒకరని చెప్పవచ్చు. తనకు అనిపించింది నిర్భయంగా వెల్లడించే మనస్తత్వం ఆమెది. ఇటీవల కొన్ని టీవీ చానళ్లల్లో ప్రచారం అవుతున్న కార్యక్రమాల గురించి నటి రాధికా శరత్‌కుమార్, ఆమెకు స్నేహితురాలు నటి శ్రీప్రియ ఎలా విమర్శలు గుప్పించారో చూద్దాం. కొన్ని తమిళం, తెలుగు, మలయాళం చానళ్లలో సంసార జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులకు చానళ్లలో పంచారుుతీ జరుపుతున్న కార్యక్రమాలు అధికం అవుతున్న విషయం తెలిసిందే. తమిళంలో నటి కుష్బు, తెలుగులో నటి రోజా, సుమలత, గీత, మలయాళంలో నటి ఊర్వశి లాంటి తారలు ఈ కార్యక్రమాల్లో పంచారుుతీతో మనస్పర్థలతోనో, ఇతర కారణాలతోనో సరిగ్గా కాపురం చేసుకోని దంపతులను కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి టీవీ కార్యక్రమాలపై నటి శ్రీప్రియ విమర్శలను గుప్పించారు.
వీల్లెవరు?
భార్యాభర్తల మధ్య గొడవలను తీరుస్తామని చెప్పి నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన వారి జీవితాలను బజారుకీడుస్తున్నారని విమర్శించారు. అభిమానులు సోషల్ మీడియాల్లో గగ్గోలు పెడుతున్నా సంబంధిత వ్యక్తుల గురించి చెప్పలేకపోతున్నామని, అలాంటిది సాధారణ వ్యక్తుల కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి వీళ్లెవరని ప్రశ్నించారు. నిజంగా అలాంటి వారి, కష్టాలు, సమస్యలపై అక్కర ఉంటే కెమెరా వెనుక కాకుండా ఏ న్యాయవాది వద్దకో, కౌన్సెలింగ్ ఇప్పించేవారి వద్దకో తీసుకెళ్లాలని నటి శ్రీప్రియ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
చదువులేని అమాయకులే..
శ్రీప్రియ విమర్శలను సమర్థించిన నటి రాధికా శరత్‌కుమార్ చదువులేని అమాయకులే వారికి దొరుకుతారని, అదే విధంగా బుద్ధిహీనులే అలాంటి చానళ్లను చూస్తారని వ్యాఖ్యానించారు.అదే విధంగా నటి రంజిత ఈ కార్యక్రమాలపై స్పందిస్తూ ఇదంతా పెద్ద న్యూసెన్‌స అని వ్యాఖ్యానించారు. గుట్టుగా సాగించే సామాన్యుల సంసారాన్ని బయటకు లాగి వారి సమస్యలపై పంచారుుతీ చేసేది తారలా అంటూ విమర్శించారు. టీవీ చానళ్ల వారు కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్నారని అన్నారు. అలాంటి సమస్యలేమైనా ఉంటే సామాన్యులు అనుభవజ్ఞులైన ఎన్‌జీఓల సలహాలు తీసుకుని కోర్టుల ద్వారా కుటుంబాలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.