
నికీషా కోరిక తీరేనా?
నారదన్ చిత్ర విజయం ఆ చిత్ర కథానాయకుడి కంటే, నాయకికి చాలా అవసరం. ఎందుకంటే ఆమె ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుందట. ఇంతకీ అంతగా ఆశలు పెట్టుకున్న ఆ అమ్మడు ఎవరనుకుంటున్నారు. ఇంకెవరు నటి నికీషా పటేల్. ఈ ఉత్తరాది భామ సినీ ఎంట్రీ గ్రాండ్‌గానే జరిగింది. టాలీవుడ్‌లో పవర్‌స్టార్‌గా వెలుగొందుతున్న పవన్‌కల్యాణ్‌కు జంటగా పులి చిత్రంతో దక్షిణాదికి దిగుమతి అయిన గుజరాతీ బ్యూటీ నికీషా పటేల్. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో నికీషా పటేల్‌ను అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో అమ్మడు కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ ఎన్నమో ఏదో చిత్రంతో రంగప్రవేశం చేసింది.ఆ చిత్రం నికీషా కేరీర్‌కు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు.ఈ సారి కన్నడ చిత్రపరిశ్రమపై కన్నేసింది. అక్కడ కరైయోరం అనే త్రిభాషా చిత్రంలో నటించింది. అందులో గ్లామర్ పరంగా హద్దులు దాటి నటించింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న సంధాన ఆ త్రిభాషా చిత్రం కూడా నికీషాకు విజయానిఅందించలేకపోయింది. అదిరే అందం, అభినయంలోనూ మంచి పాత్ర లభిస్తే నిరూపించుకోవాలని ఉబలాట పడుతున్న నటి నికీషా.
అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నికీషా మూడు భాషల్లోనూ బ్రేక్ కోసం పడిగాపులు పడుతోంది. మరో విషయం ఏమిటంటే ఎన్నమో ఏదో చిత్రంలో ఈ అమ్మడితో పాటు నటించిన నటి రకుల్ ప్రీతిసింగ్‌కు ఇక్కడ అదే పరిస్థితి ఉన్నా, టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దుమ్మురేపుతోంది.అందుకే అంటారు దేనికైనా అదృష్టం ఉండాలని. దానికోసమే నికీషా అర్రులు చాచి ఎదురు చూస్తోంది.
తాజాగా ఈ జాణ నటించిన నారదన్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. నకుల్ కథానాయకుడిగా నటించిన ఇందులో మరో హీరోయిన్ ఉన్నా నికీషా పటేల్ పాత్రకే ప్రాముఖ్యత ఉంటుందట.ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని నికీషా వ్యక్తం చేస్తోంది. మరో రెండు రోజులు ఆగితే గానీ ఈ బ్యూటీ ఆశ ఏ మేరకు నెరవేరిందో తెలుస్తుంది.