నా గురించి గాసిప్స్ ఎందుకు వస్తాయి అంటోంది నటి నిక్కీగల్రాణి. ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో బిజీ కథానాయకి. త్వరలో తమిళనాడు కోడలు అయినా అవుతానంటున్న నిక్కీగల్రాణికి ఇక్కడ చేతినిండా చిత్రాలున్నాయి. దీంతో ఇతర భాషల్లో నటించాల్సిన అవసరం కూడా లేదంటోంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న తన మనోభావాలను, తాజా చిత్రాల వివరాలను పంచుకున్నారు. అవేమిటో చూసేద్దామా.
ప్ర: ఈ ఏడాది మీ టైం బాగున్నట్టుందే?
జ: అవునండి. ఏడాది ప్రారంభంలో మొట్టశివ కెట్టశివ విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత మరగత నాణియం, నెరుప్పుడా వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. ఈ మూడు చిత్రాల్లోనూ నా పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. షూటింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మహిళాభిమానులు ఎంతో ప్రేమతో హగ్ చేసుకుని అభినందిస్తున్నారు.
ప్ర: సరే ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల వివరాలను చెప్పండి?
జ: మళ్లీ నెరుప్పుడా చిత్ర హీరో విక్రమ్‌ప్రభుకు జంటగా పక్కా చిత్రంలో నటిస్తున్నాను. అదే విధంగా జీవాకు జంటగా కీ చిత్రం లో నటిస్తున్నాను. గౌతమ్ కార్తీక్ సరసన నటించిన హరహర మహాదేవకీ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.
ప్ర: అడల్ట్ చిత్రంగా చెప్పుకుంటున్న హరహర మహాదేవకి చిత్రంలో నటించడానికి ఎందుకు అంగీకరించారనే ప్రశ్న ఎదురవుతోందే?
జ: మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర బాగుందనిపించడంతో నటించడానికి సమ్మతించాను. హరహర మహాదేవకీ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే నాకు సంబంధించిన సన్నివేశాల్లో కూడా అడల్ట్ కామెడీ ఉంటుంది. అయితే అవి చాలా నాగరికంగా జాలీగా నవ్వుకునేలా ఉంటాయి.
ప్ర: తమిళ చిత్రాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇతర భాషల్లో అవకాశాలు రావడం లేదా?
జ: నేను ఇప్పటికే కన్నడం, తెలుగు అంటూ అన్ని భాషల్లోనూ ఒక రౌండ్ కొట్టేశాను. ప్రస్తుతం నా దృష్టి అంతా తమిళ చిత్రాలపైనే పెడుతున్నాను.
ప్ర: సమీప కాలంలో మీ గురించి ఎలాంటి గాసిప్స్ రావడం లేదు. ఏం మాయ చేస్తున్నారు?
జ: నా గురించి గాసిప్స్ రాకపోవడం మంచి విషయమేగా. అందుకు నేనేం మాయా మంత్రాలు చేస్తాను. షూటింగ్ ముగియగానే నేరుగా ఇంటికి వెళ్లి పోతాను. ఇంకొకరి గురించి అనవసరంగా కామెంట్స్ కూడా చేయను. ఎలాంటి గొడవలకూ వెళ్లను. అలాంటిది నా గురించి ఎందుకు గాసిప్స్ ప్రచారం అవుతాయి?
ప్ర: చెన్నైలో సెటిల్ అయ్యి తమిళ ప్రేక్షకుల డార్లింగ్ అయ్యిపోయారు. భవిష్యత్‌లో తమి ళింటి కోడలయ్యే అవకాశం ఉందా?
జ: నా పెళ్లి గురించి అడుగుతున్నారన్న విషయం అర్థమైంది. అయితే సినిమాల్లో నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. భవిష్యత్తులో నేను తమిళింటి కోడలిని అవ్వనూవచ్చు. ఆ విషయాన్ని జరిగినప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం సినిమా గురించే చెప్పుకుందాం.
ప్ర: ఇటీవల సినిమా రంగంలో నటీమణులకు రక్షణ కరువైందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏమిటి?
జ: ఈ విషయంలో సినిమా రంగం అని విడదీసి చెప్పకూడదు. మన దేశంలోనే మహిళలకు సరైన రక్షణ లేదు. సడన్‌గా నలుగురు మగవారు నన్ను అడ్డగిస్తే వారి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నేను సినిమాల్లోనే ఫైట్స్ చేసేదాన్ని అమ్మాయిని కాను. నిజజీవితంలోనూ నా తడాఖా చూపిస్తాను.