ఆయన అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవాళ్లమో.. | Nirmala Convent Audio Release Launch | Sakshi
Sakshi News home page

ఆయన అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవాళ్లమో..

Published Thu, Sep 8 2016 11:00 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nirmala Convent Audio Release Launch

‘‘డెబ్భై ఐదేళ్ల క్రితం ఘంటసాల బలరామయ్యగారు మా నాన్నగారిని (అక్కినేని నాగేశ్వరరావు) చూసి, ‘కుర్రాడు బాగున్నాడే చలాకీగా..’ అనుకుని యాక్టర్‌ని చేశారు. ఆయన నాన్నగారికి అవకాశం ఇచ్చి ఉండకపోతే మేం ఎక్కడుండేవాళ్లమో? ఏం చేసేవాళ్లమో? ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనీ, కొత్తవారిని ప్రోత్సహించాలని నాన్నగారు చెప్పేవారు. ఆయన స్ఫూర్తితో ముందుకెళుతున్నాం’’ అన్నారు నాగార్జున.. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, జి. నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్ టీమ్ వర్క్స్ పతాకాలపై నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’.

 
  సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల చేసి, నిర్మాత అల్లు అరవింద్‌కు ఇచ్చారు. హీరో గోపీచంద్ ట్రైలర్ లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ- ‘‘రోషన్ డైలాగ్ డెలివరీ, మెమొరీ పవర్ గుడ్’’ అన్నారు. నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఈ వయసులో నిర్మాత ఎందుకయ్యారని కొందరు అడిగారు. నిర్మాతకు వయసుతో పనేముంది? రాబోయే తరం గురించి నాకు మా తాత చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండటం, నా మిత్రుడు నాగార్జున యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేద్దామని చెప్పడం ఈ చిత్రం నిర్మించడానికి ఓ కారణం’’ అన్నారు.
 
  దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇందులో ఇద్దరు హీరోలు. ఒకరు రోషన్, మరొకరు నాగార్జునగారు. నాగార్జునగారి ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుందీ సినిమా. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’తో హిట్ సాధించిన ఆయన ‘నిర్మలా కాన్వెంట్’తో హ్యాట్రిక్ సాధించబోతున్నారు’’ అన్నారు. ‘‘సెట్స్‌కి వెళ్లి, రోషన్ హార్డ్‌వర్క్ స్వయంగా చూశా. చాలా గర్వంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. ‘‘పెద్ద సంస్థల ద్వారా లాంచ్ అవడం రోషన్ లక్’’ అని తనయుణ్ణి మురిపెంగా చూస్తూ, ఊహ అన్నారు.
 
  ‘‘ఏయన్నార్‌గారు, మా నాన్న రాజేశ్వరరావుగారి కాంబినేషన్‌లో ఎన్నో హిట్ చిత్రాలొచ్చాయి. నేను నాగార్జునగారి చిత్రాలకు సంగీతం అందించా. ఇప్పుడు నా కుమారుడు రోషన్ సంగీత దర్శకుడు కావడం హ్యాపీ’’ అని కోటి అన్నారు. రోషన్ మాట్లాడుతూ - ‘‘నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నా తల్లిదండ్రులే కారణం. యాక్టర్ అవుతానన్నప్పుడు, కళ్లు పైకే చూస్తుండాలి.. కాళ్లు కిందే ఉండాలన్నారు. అమ్మానాన్న తలెత్తుకునేలా ఉంటాను’’ అన్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు ధవళ సత్యం, ఆయన సోదరుడు ధవళ మల్లిక్, దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, హీరోయిన్ శ్రేయాశర్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement