Nirmala Convent
-
రిషికపూర్ గుర్తొచ్చాడు - దాసరి
‘‘శ్రీకాంత్, ఊహల పెళ్లి మొన్నీమధ్య జరిగినట్టుంది. అప్పుడే వాళ్లబ్బాయి హీరోగా పరిచయమయ్యాడు. తల్లితండ్రులిద్దరూ మంచి నటులు. వాళ్ల జీన్స్ ఎక్కడికి పోతాయి. చక్కగా నటించాడు. స్క్రీన్‌పై రోషన్‌ని చూస్తే ముద్దొచ్చాడు’’ అన్నారు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు. రోషన్, శ్రేయా శర్మ జంటగా జి.నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘నిర్మలా కాన్వెంట్’. ఈ నెల 15న సినిమా విడుదలైంది. సోమవారం దాసరి, చిత్ర బృందాన్ని అభినందించారు. ఆయన మాట్లాడుతూ - ‘‘అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఓ యువకుడు విజ్ఙానంతో ఎంత ఎత్తుకు ఎదిగాడనే ప్రేమకథ నాకు నచ్చింది. అందుకే, అభినందించాలనుకున్నాను. రోషన్ నటన హిందీ సినిమా ‘బాబి’లో రిషి కపూర్‌ను గుర్తు చేసింది. సెకండాఫ్‌లో నాగార్జున అద్భుతంగా నటించాడు. నేను దర్శకత్వం వహించిన 15 సినిమాలకు సాలూరి రాజేశ్వరరావుగారు సంగీతమందించారు. కోటితో పని చేశా. కోటి కుమారుడు రోషన్ సాలూరి ఈ సినిమాకి సంగీతమందించాడు. ఈ కుర్రాడితోనూ తప్పకుండా పని చేస్తా. నా సినిమాలో హీరోయిన్గా నటించిన ‘యాంకర్’ సుమ కుమారుడు రోషన్ కనకాల కూడా చక్కగా నటించాడు. దర్శకుడు యువకులతో పోటీపడి మంచి ప్రేమకథ తీశాడు. ఇటువంటి సినిమాలను ముందు మల్టీప్లెక్స్‌లలో విడుదల చేసి, సూపర్‌హిట్ టాక్ వచ్చిన తర్వాత అన్ని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం’’ అన్నారు. ‘‘దాసరిగారిని టీవీల్లో చూడడమే. ఈరోజు ఆయన మమ్మల్ని పిలిచి అభినందించడం చాలా సంతోషంగా ఉంది’’ అని హీరో రోషన్ అన్నారు. హీరో శ్రీకాంత్, దర్శకుడు జి.నాగకోటేశ్వర రావు, యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల పాల్గొన్నారు. -
విజ్ఞానం పంచే కాన్వెంట్
కొత్త సినిమా గురూ! టీనేజ్ లవ్‌స్టోరీలు, స్కూలు, కాలేజీ వయసు ప్రేమకథలు తెలుగు సినిమాకు కొత్త కాదు. ఆ ప్రేమకు పిల్లలు పెంచుకోవాల్సిన విజ్ఞానాన్నీ, దానితో వచ్చే విజయాన్నీ ముడిపెడితే? అలవాటైన స్కూల్ ఏజ్ లవ్‌స్టోరీలోనే పిల్లలకు పాఠం కూడా నేర్పే అలాంటి ప్రయత్నం - ‘నిర్మలా కాన్వెంట్’. పారిశ్రామిక వేత్త ‘మ్యాట్రిక్స్’ నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలసి హీరో నాగార్జున నిర్మించిన ఈ లేటెస్ట్ సినిమా కథ సింపుల్. అనగనగా భూపతిపురం గ్రామం. రాజా గారి 99 ఎకరాలకు నీళ్ళు దళితుడు వీరిగాడి (ఎల్బీ శ్రీరామ్) ఒక ఎకరం చేను మీద నుంచి రావాల్సిందే! రాజా గారిని ధిక్కరించి, వీరిగాడు హతమారి పోతాడు. చచ్చినా ఆ ఎకరం అమ్మవద్దని కొడుకు (సూర్య) దగ్గర మాట తీసుకొని మరీ కన్నుమూస్తాడు. ఆ ఫ్లాష్‌బ్యాక్ కథ ఇప్పటి మూడో తరానికి వచ్చేసరికి, రాజా గారి మనవ రాలు శాంతి (శ్రేయాశర్మ), వీరి గాడి మనుమడూ, బ్రిలియంట్ స్టూడెంట్ శామ్యూల్ (హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్) ప్రేమలో పడతారు. సహజంగానే హీరోయిన్ తండ్రి అడ్డం పడతాడు. కొడుకు ప్రేమ కోసం ఎకరం భూమీ రాసిచ్చేస్తానంటాడు హీరో తండ్రి. అందరూ చెప్పుకొనేంత గొప్పవాడూ, కోటీశ్వరుడూ అయితే అప్పుడు పెళ్ళి సంగతి చూస్తానంటాడు హీరోయిన్ తండ్రి. తల్లితండ్రుల్ని వదిలి, హైదరాబాద్ వచ్చిన హీరో అక్కడ నటుడు నాగార్జునను కలుస్తాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో టాప్ 10 విజేతల్ని తలదన్నే నాలెడ్జ్ తనదనీ, తనకొక్క ఛాన్స్ ఇమ్మంటాడు. ఆ పై హీరో ప్రేమనెలా గెలిచాడన్నది మిగతా సినిమా. రెండున్నర గంటల సినిమాలో ఫస్టాఫ్ అంతా హీరో, అతని నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కాన్వెంట్ పిల్లల అల్లరి, ప్రేమ. అన్నీ ఊహించదగినట్లే నడిచిపోతుంటాయి. నాగార్జున ఎంటరయ్యే సెకండాఫ్ నుంచి ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘకాలంగా సినీరంగ అనుభవమున్న జి. నాగ కోటేశ్వరరావుకు కూడా దర్శకుడిగా ఇదే తొలి సినిమా. ఆయన కుమారుడూ, చిరంజీవి, నాగార్జున సహా పలువురు అగ్రతారల సినీ ప్రచార వ్యూహ నిపు ణుడూ అయిన జి.కె. మోహన్ తెర వెనుక ఉండి ఈ సినిమాను నడిపించి, ‘నాన్నకు ప్రేమతో’ ఇచ్చిన ఈ గిఫ్ట్ గౌరవం పెంచే సెంటిమెంటల్ అంశం. వంద చిత్రాల మైలురాయి దాటేసిన హీరో శ్రీకాంత్ తన కుమారుడు రోషన్‌ను పూర్తిస్థాయి హీరోగా పరిచయం చేసిన తొలి సినిమా ఇది. అందంగా కనిపించే రోషన్ డైలాగ్ డెలివరీ, నటనలోని ఈజ్ చూస్తే, ఎక్కడా ఫస్ట్ ఫిల్మ్ హీరోలా అనిపించడు. నటన, డ్యాన్సుల లాంటివి ఇంకా ఎంత సాధన చేస్తే, భవిష్యత్తులో అంత మంచి హీరోగా, లవ్‌స్టోరీలకు కొత్త కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు. అతనితో పాటు, యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల (ఎలక్ట్రీషియన్ కొడుకు పాత్ర), సంగీతం రోషన్ సాలూరి (సంగీత దర్శకుడు కోటి కుమారుడు)తో కలిపి మొత్తం ముగ్గురు రోషన్లు ఈ సినిమాలో ఉన్నారు. కెమేరా విశ్వేశ్వర్, గాయ కుడు ఏ.ఆర్. అమీన్ (రహ్మాన్ కుమారుడు) లాంటి కొత్తవాళ్ళు, ప్రముఖుల వారసులూ ఉన్నారు. నట, సాంకేతిక నైపుణ్యానికి నిర్మాణ విలువలు కలిసి దృశ్యాలు తెరపై రిచ్‌గా కనిపిస్తాయి. నాగార్జున ఈ చిత్రంలో తన నిజజీవిత పాత్రలో కనిపించడమే కాక, చివరలో రోలింగ్ టైటిల్స్‌లో ‘కొత్త కొత్త భాష...’ పాటకి నర్తించారు, ప్రచార చిత్రాల కోసం పాడారు! చాలా ఏళ్ళ క్రితమే ‘సీతారామరాజు’లో సిగరెట్ పాట పాడిన నాగార్జునను సింగర్‌గా ఇదే ‘తొలి పరిచయం’ అని టైటిల్స్ ప్రస్తావిస్తాయి. కథాగమనం ఎలా ఉంటుందో ముందో పసిగట్టేలా ఉన్నా, ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో రివాల్వర్ ఎవరు కనిపెట్టారు, ‘హలో’ పదం పుట్టుక - ఇలా ప్రపంచ విజ్ఞాన గుళికలు చాలా వస్తాయి. ఆ రకంగా ఇది పేరులో ఉన్నట్లే, ప్రతి ఒక్కరికీ పాఠాలు నేర్పే ‘కాన్వెంట్’. బలమైన పాత్రలు, సెంటిమెంట్లు, సందర్భాలు అల్లుకొంటే బాగుండేదనిపించినా, కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు, కొత్త సాంకేతిక నిపుణులతో ఇంత ‘రిచ్’ ప్రయత్నం చేసినందుకు అభినందించాలి. క్లైమాక్స్ ఘట్టాల్లో పోలికలు చూశాక, ‘అబ్బ....ఛ’ అనుకోకపోతే, తెలుగు తెర ‘స్లమ్ డాగ్ మిలియనీర్’. వెండితెరపై... రెండున్నర గంటల బుల్లితెర ‘మీలో ఎవరు కోటీశ్వరుడు!’ - రెంటాల జయదేవ -
'నిర్మలా కాన్వెంట్' మూవీ రివ్యూ
టైటిల్ : నిర్మలా కాన్వెంట్ జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : నాగార్జున, రోషన్, శ్రియా శర్మ, ఎల్బీ శ్రీరామ్ సంగీతం : రోషన్ సాలూరి దర్శకత్వం : జి. నాగ కోటేశ్వరరావు నిర్మాత : అన్నపూర్ణా స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీం వర్క్స్ విలన్, హీరోగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నిర్మలా కాన్వెంట్. ఇప్పటికే బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రియా శర్మ ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇమేజ్ను పక్కన పెట్టి స్పెషల్ క్యారెక్టర్లకు కూడా రెడీ అయిన కింగ్ నాగార్జున అతిథి పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..? ఈ సినిమాతో రోషన్ హీరోగా సెటిల్ అవుతాడా..? కథ : చదువు, పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియని తెలివైన కుర్రాడు శామ్యూల్ (రోషన్). నిర్మలా కాన్వెంట్లో చదువుకునే శామ్యూల్‌కు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవటం అలవాటు. అదే కాన్వెంట్లో శామ్యూల్‌తో పాటు చదువుకుంటుంది శాంతి( శ్రియా శర్మ). కాన్వెంట్ అబ్బాయిలందరికీ శాంతి డ్రీమ్ గర్ల్. కానీ శాంతి మాత్రం శామ్యూల్ వెంట పడుతుంటుంది. శామ్యూల్ కూడా శాంతిని ఇష్టపడతాడు. అన్ని ప్రేమ కథలలాగానే వీరి కథకు కూడా పేదరికం అడ్డు వస్తుంది. దానికి తోడు పెద్ద వాళ్ల గొడవలు కూడా ఈ చిన్నారి ప్రేమికులను దూరం చేస్తాయి. శాంతిని ప్రేమించాడన్న కోపంతో వాళ్లనాన్న శామ్యూల్‌ను కొట్టి వాళ్ల పొలం లాగేసుకుంటాడు. నా అంతా ఆస్తి, పేరు సంపాదిస్తే.., నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని సవాల్ చేస్తాడు. దీంతో డబ్బు, పేరు సంపాదించటం కోసం హైదరాబాద్ శామ్యూల్ వస్తాడు. మరి శామ్యూల్ అనుకున్నట్టుగా డబ్బు, పేరు సంపాదించాడా..? ఈ ప్రేమికులకు నాగార్జునకు సంబందం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలిసారిగా వెండితెర మీద హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఆకట్టుకున్నాడు. ఎక్కడ ఇది రోషన్ తొలి సినిమా అన్న భావన కలగకుండా అద్భుతంగా నటించాడు. లుక్స్ పరంగా కూడా రోషన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అందంతో అభినయంతో ఆకట్టుకున్నాడు. బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న శ్రియా శర్మ హీరోయిన్గా అలరించింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. అతిథి పాత్రలో నటించిన నాగార్జున తనదైన నటనతో సినిమాకు హైప్ తీసుకువచ్చాడు. తన ఇమేజ్ను పక్కన పెట్టి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన కింగ్, సినిమా స్థాయిని పెంచాడు. ఇతర పాత్రల్లో ఎల్బీ శ్రీరామ్, సూర్య, అనితా చౌదరి, ఆదిత్య మీనన్‌లు తమ పరిది మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : స్టార్ వారసులను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కోసం రొటీన్ ప్రేమ కథను ఎంచుకున్న దర్శకుడు జి. నాగ కోటేశ్వరరావు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సినిమా మీద భారీ హైప్ ఏర్పడినా ఆ స్థాయికి తగ్గ కథా కథనాలను అందించటంలో తడబడ్డాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌ను తెలివైన కుర్రాడిగా చూపించే సన్నివేశాలు కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. కాన్వెంట్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే స్థాయిలో కామెడీ లేకపోవటం కూడా నిరాశపరిచింది. ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చిన నాగ్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. రోషన్ సాలూరి సంగీతం బాగుంది, కొత్త కొత్త భాష పాట విజువల్‌గా కూడా అలరిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీం వర్క్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగార్జున రోషన్, శ్రియా శర్మ మైనస్ పాయింట్స్ : బలమైన కథ లేకపోవటం రొటీన్ టేకింగ్ ఓవరాల్‌గా నిర్మలా కాన్వెంట్, రొటీన్ ప్రేమకథే. -
ఆనందంతో కన్నీళ్లొచ్చాయి : ఊహాశ్రీకాంత్
‘‘రోషన్‌ను క్రికెటర్ చేద్దామనుకుని ఐదో తరగతి నుంచే శిక్షణ ఇప్పించా. బాగా ఆడేవాడు. రాష్ట్రస్థాయికి ఎంపికయ్యే టైమ్‌లో ‘రుద్రమదేవి’ చిత్రానికి అవకాశం వచ్చింది. ఆ చిత్రం తర్వాత నటనపై తనకు పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు వచ్చిన అవకాశమే ‘నిర్మలా కాన్వెంట్’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఆయన తనయుడు రోషన్ హీరోగా జి.నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ పతాకాలపై నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘‘నా మొదటి చిత్రం ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ టైమ్‌లో నాకు ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందుకే ఏ పాత్ర వస్తే అది చేశాను. కానీ, రోషన్‌కు మా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎదిగే కొద్ది ఒదిగి ఉండమని నేను, ఊహా రోషన్‌కు చెప్పాం. తను అది పాటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆడియో వేడుకలో రోషన్ స్టేజ్‌పై మాట్లాడిన మాటలకు నా కళ్లల్లో ఆనందభాష్పాలొచ్చాయి. ఈ చిత్రం విడుదలయ్యాక రెండేళ్లు గ్యాప్ తీసుకుని, డ్యాన్స్, ఫైట్స్, నటనలో రోషన్‌కి ఇంకా ట్రైనింగ్ ఇప్పించి, రీ-లాంచ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘రోషన్ ఎలా నటిస్తున్నాడో చూడ్డానికి సెట్స్‌కి వెళ్లలేదు. నాగార్జునగారితో సీన్స్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్‌గా ఉందని రోషన్ చెబితే సలహాలు ఇచ్చా. తనని తొలిసారి తెరపై చూసినప్పుడు ఓ తల్లిగా నా కళ్లల్లో నీళ్లొచ్చాయి’’ అని ఊహా చెప్పారు. రోషన్ మాట్లాడుతూ- ‘‘ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ‘రుద్రమదేవి’లో నటించే అవకాశం వచ్చింది. టీవీలో, సినిమాలో కనిపించొచ్చు కదా అని ఓకే చెప్పేశా. ఆ తర్వాత క్రికెట్‌పై ఇష్టం పోయి సినిమాలపై పెరిగింది. నటనలో అమ్మ, నాన్నలే నా ఇన్స్పిరేషన్. వారి సలహాలతో ‘నిర్మలా కాన్వెంట్’చిత్రంలో ఎమోషన్ సీన్స్‌లో బాగా నటించా’’ అని చెప్పారు. -
ఇది మా స్నేహంలో కొత్త అడుగు
చిత్ర పరిశ్రమలో కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు నాగార్జున. పలు రంగాల్లో కొత్తవారిని ప్రోత్సహిస్తున్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్. ఇద్దరూ మంచి స్నేహితులు. వ్యాపారాల్లో భాగస్వాములు. వీరిద్దరూ కలసి నిర్మించిన సినిమా ‘నిర్మలా కాన్వెంట్’. ఈ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్, దర్శకుడిగా జి.నాగకోటేశ్వరరావు, సంగీత దర్శకుడిగా కోటి తనయుడు రోషన్ సాలూరి సహా పలువురు పరిచయమవుతున్నారు. నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్ పంచుకున్న విశేషాలు... అమల మెచ్చుకుంది - నాగార్జున ఏడాది క్రితం కాన్సెప్ట్ ఫిల్మ్స్ వాళ్లు ఈ కథను నాకూ, ప్రసాద్‌గారికి వినిపించారు. ఎప్పట్నుంచో ప్రసాద్ గారికి సినిమా నిర్మాణం మీద ఆసక్తి. ‘నాగ్.. మనం కలసి ఓ సినిమా తీద్దాం’ అనేవారు. ఆయన వ్యాపారంలోకి నేను ఎంటరయ్యా. ఇప్పుడు నా వ్యాపారంలోకి ఆయన్ను తీసుకొచ్చాను. వినూత్న ఆలోచనలతో ఏదైనా చేయడమంటే ప్రసాద్‌గారికి ఇష్టం. నాకూ కొత్తదనం అంటే ఇష్టం. ఇద్దరి మనస్తత్వాలు బాగా కలిశాయి. ఆ విధంగా మా స్నేహంలో ఈ కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ప్రసాద్‌గారు బాగా సినిమాలు చూస్తారు. మాకు అందమైన కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ప్రసాద్‌గారి దగ్గర డబ్బులకు సమస్య లేదు. నాతో కలవాల్సిన అవసరం లేదు. మాది డబ్బుతో ముడిపడిన బంధం కాదు. ఇద్దరం కలసి ఐడియాలు డిస్కస్ చేసుకోవడం, కలసి ప్రయాణించడం చక్కటి అనుభూతి. ఆడియో వేడుకలో హీరో రోషన్ మాట్లాడిన తీరు చూసి ముచ్చటేసింది. చిన్న వయసు లోనే అంత ఎమోషనల్‌గా, మెచ్యూర్డ్‌గా మాట్లాడడం మామూలు కాదు. శ్రీకాంత్, ఊహ కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చేశాయి. సినిమాలో బాగా చేశాడు. ఇప్పటివరకూ ఆల్మోస్ట్ హీరోగానే చేశాను. ఈ సినిమాలో మాత్రం నేను హీరో కాదు. వెరీ ఇంపార్టెంట్ సపోర్టింగ్ రోల్ చేశా. (నవ్వుతూ..) ఈ ఏడాది బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను. ఇతర సినిమాల్లో మంచి కథలు, పాత్రలు వస్తే తప్పకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తా. నేను పాడిన పాట సినిమాలో ఉండదు. ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్ పాడిన పాట ఉంటుంది. ‘ఇంత బాగా పాడతావ్ అనుకోలేదు’ అని అమల మెచ్చుకుంది. నాకు ప్రేమకథలంటే ఇష్టం. నా సినిమాల్లో ఎక్కువ ప్రేమకథలే. ఏ మనిషైనా ఎప్పు డైనా ప్రేమ అనేది టచ్ చేయక పోతే అతను మనిషే కాదు. ఇది కూడా మంచి ప్రేమకథ. ఈ సినిమాలో కైలాష్ ఖేర్ ‘ముందు నుయ్యి’ అనే పాట పాడారు. కథ విన్నాక ‘పాతాళ భైరవి’లో లాంటి పాట ఉంటే బాగుంటుం దని ప్రసాద్‌గారే సలహా ఇచ్చారు. మరిన్ని సిన్మాలు తీస్తా - నిమ్మగడ్డ ప్రసాద్ నేనూ, నాగార్జున ముందు స్నేహితులం. ఆ తర్వాత వ్యాపారంలో భాగస్యాములయ్యాం. కొత్తవాళ్లతో సినిమా తీయాలని ఇద్దరికీ ఆసక్తి ఉంది. అక్కినేని కుటుంబం, అన్నపూర్ణ స్టూడియోస్‌తో నాకు వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్. నాకు ఏయన్నార్‌గారితో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ అటాచ్‌మెంట్‌తో నాగ్, నేనూ ఎప్పుడూ సినిమా ప్రొడక్షన్ గురించి అనుకునేవాళ్లం. నిర్మాతగా మారడానికి అంతకు మించి ప్రత్యేక కారణాలేమీ లేవు. నాగ్ చెప్పినట్లు మా స్నేహంలో కొత్త ప్రయాణం ఇది. ఎవరో మనకు తెలియని హీరోలను మనం చూడాల్సిన అవసరం లేదు. స్నేహితుల్లో, సమాజంలోనో ఎక్కడో మన ముందే హీరోలు ఉంటారు. మ్యాట్రిక్స్ కంపెనీ టేకోవర్ చేసినప్పుడు ఓ ‘ఆర్ అండ్ డీ’ సీనియర్ని ఇంటర్వ్యూ చేశాను. ఐదేళ్ల జీతం డిపాజిట్ చేయమని అడిగాడు. అంత డబ్బులుంటే ఎందుకు సిక్ కంపెనీ కొంటాను. ‘యంగ్‌స్టర్స్‌కి ఎందుకు చాన్స్ ఇవ్వకూడదు’ అని ఆ రోజు అనిపించింది. హెచ్ఆర్ని పిలిచి ఈ వయసులో సైంటిస్ట్‌లు కావాలని చెప్పా. ఓ బిలియన్కి మ్యాట్రిక్స్ అమ్మినప్పుడు ఎంప్లాయిస్ ఏవరేజ్ ఏజ్ 28 ఏళ్లు మాత్రమే. యంగ్‌స్టర్స్‌కి చాన్స్ ఇవ్వడం మొదట్నుంచీ ఉంది. సింగర్‌గా నాగ్ సహా 10 మంది కొత్తవాళ్లు దీంతో పరిచయమవు తున్నారు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. నాకు సంగీతమంటే ప్రాణం. ఈ పాటలు నా మనసుకు హత్తుకున్నాయి. నాగార్జున ఇంత బాగా పాడతారని అనుకోలేదు. రాజీవ్ కనకాల, సుమల కుమారుడు రోషన్ కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. హీరో రోషన్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన తీరు న్యాచురల్‌గా అనిపించింది. మా అబ్బాయి మాట్లాడుతున్నట్టు అనిపించింది. చిన్నప్పుడు ఓ మొక్క నాటేటప్పుడు.. ‘నేను మరణించినా చెట్టు నీడలో చాలామంది బతుకుతారు’ అని తాతయ్య చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద హైదరాబాద్‌లో 3 లక్షల మంది బతుకుతున్నారు. కొత్తవాళ్లకి ఛాన్స్‌లిస్తే ఎంతోమంది పైకి వస్తారు. ఫ్యూచర్లో తప్పకుండా సినిమాలు నిర్మిస్తాను. -
ఆయన అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవాళ్లమో..
‘‘డెబ్భై ఐదేళ్ల క్రితం ఘంటసాల బలరామయ్యగారు మా నాన్నగారిని (అక్కినేని నాగేశ్వరరావు) చూసి, ‘కుర్రాడు బాగున్నాడే చలాకీగా..’ అనుకుని యాక్టర్‌ని చేశారు. ఆయన నాన్నగారికి అవకాశం ఇచ్చి ఉండకపోతే మేం ఎక్కడుండేవాళ్లమో? ఏం చేసేవాళ్లమో? ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనీ, కొత్తవారిని ప్రోత్సహించాలని నాన్నగారు చెప్పేవారు. ఆయన స్ఫూర్తితో ముందుకెళుతున్నాం’’ అన్నారు నాగార్జున.. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, జి. నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్ టీమ్ వర్క్స్ పతాకాలపై నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల చేసి, నిర్మాత అల్లు అరవింద్‌కు ఇచ్చారు. హీరో గోపీచంద్ ట్రైలర్ లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ- ‘‘రోషన్ డైలాగ్ డెలివరీ, మెమొరీ పవర్ గుడ్’’ అన్నారు. నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఈ వయసులో నిర్మాత ఎందుకయ్యారని కొందరు అడిగారు. నిర్మాతకు వయసుతో పనేముంది? రాబోయే తరం గురించి నాకు మా తాత చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండటం, నా మిత్రుడు నాగార్జున యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేద్దామని చెప్పడం ఈ చిత్రం నిర్మించడానికి ఓ కారణం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇందులో ఇద్దరు హీరోలు. ఒకరు రోషన్, మరొకరు నాగార్జునగారు. నాగార్జునగారి ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుందీ సినిమా. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’తో హిట్ సాధించిన ఆయన ‘నిర్మలా కాన్వెంట్’తో హ్యాట్రిక్ సాధించబోతున్నారు’’ అన్నారు. ‘‘సెట్స్‌కి వెళ్లి, రోషన్ హార్డ్‌వర్క్ స్వయంగా చూశా. చాలా గర్వంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. ‘‘పెద్ద సంస్థల ద్వారా లాంచ్ అవడం రోషన్ లక్’’ అని తనయుణ్ణి మురిపెంగా చూస్తూ, ఊహ అన్నారు. ‘‘ఏయన్నార్‌గారు, మా నాన్న రాజేశ్వరరావుగారి కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలొచ్చాయి. నేను నాగార్జునగారి చిత్రాలకు సంగీతం అందించా. ఇప్పుడు నా కుమారుడు రోషన్ సంగీత దర్శకుడు కావడం హ్యాపీ’’ అని కోటి అన్నారు. రోషన్ మాట్లాడుతూ - ‘‘నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నా తల్లిదండ్రులే కారణం. యాక్టర్ అవుతానన్నప్పుడు, కళ్లు పైకే చూస్తుండాలి.. కాళ్లు కిందే ఉండాలన్నారు. అమ్మానాన్న తలెత్తుకునేలా ఉంటాను’’ అన్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు ధవళ సత్యం, ఆయన సోదరుడు ధవళ మల్లిక్, దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, హీరోయిన్ శ్రేయాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ పాట పాడిన నాగ్
‘కొత్త కొత్త భాష.. కొత్త ప్రేమభాష...’ అంటూ పన్నెండేళ్ల పిల్లాడు అమీన్ పాడిన పాట అక్కినేని నాగార్జునకు విపరీతంగా నచ్చేసింది. ఈ అమీన్ ఎవరో కాదు.. ఎ.ఆర్. రహమాన్ తనయుడు. ‘నిర్మల కాన్వెంట్’ కోసం అమీన్ పాడిన ఈ ప్రేమ పాటను ఆ చిత్రనిర్మాత నాగార్జున విన్నారు. ప్రేమను వర్ణిస్తూ సాగే ఈ పాటను మళ్లీ మళ్లీ విన్నారు. వినడం మాత్రమే కాదు.. వెంటనే ఈ పాట పాడాలని నిర్ణయించుకున్నారు. ‘సీతారామరాజు’లో ‘చీపుగా చూడకు పొరపాటు.. చిరాకు పడదా సిగరెట్టు..’ అనే పాట పాడిన నాగర్జున, పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ పాటతో ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. తాజా పాటను శనివారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘హృదయానికి హత్తుకునే ఈ అందమైన ప్రేమ పాట ప్రేక్షకులకూ, ఫ్యాన్స్‌కూ నచ్చుతుందని ఆశిస్తున్నా. నేను చాలా ఇష్టపడి పాడాను’’ అని నాగార్జున పేరొన్నారు. ఈ పాటను ప్రముఖ సంగీతదర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరిచారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రేయా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. నాగర్జున సమర్పణలో మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు చిత్రాన్ని నిర్మించాయి. -
నాగ్ ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదే..!
ఇటీవల ట్విట్టర్లో కింగ్ నాగార్జున చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తన ట్విట్టర్ పేజ్ పై ఈ నెల 23న అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇస్తానంటూ ట్వీట్ చేశాడు నాగార్జున. అయితే ఈ ట్వీట్ దర్శనమిచ్చిన దగ్గర నుంచి మీడియా సర్కిల్స్ నాగ్ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటన్న చర్చ జరగింది. కొంత మంది నాగ్ తన తనయుల పెళ్లి విషయం ప్రకటిస్తాడని, మరి కొంత మంది ప్రస్తుతం నాగ్ చేయబోయే సినిమాకు సంబందించిన అప్ డేట్ ఇస్తాడని మాట్లాడుకున్నారు. అయితే రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నాగ్ ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏంటో తెలిసిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నిర్మాలా కాన్వెంట్ సినిమాను నిర్మిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నాగ్, తనలోని మరో టాలెంట్ కూడా చూపించబోతున్నాడు. గతంలో సీతారామరాజు సినిమాలో సిగరెట్ గొప్పదనాన్ని కీర్తిస్తూ ఓ పాట పాడిన నాగ్, నిర్మాలా కాన్వెంట్ కోసం మరోసారి సింగర్ అవతారం ఎత్తాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు సాలూరి రోషన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ తనయుడు ఏఆర్ అమీన్‌తో కలిసి నాగ్ ఓ పాట పాడాడు. ఈ పాటను శనివారం సాయత్రం తన ట్విట్టర్లో రిలీజ్ చేయనున్నాడు నాగ్. సీనియర్ హీరోలలో సూపర్ ఫాంలో ఉన్న నాగ్ సింగర్ కూడా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నాడన్న మాట. Hello my friends!!i have a surprise for you on 23rd evening.https://t.co/Af443dXQSx👍— Nagarjuna Akkineni (@iamnagarjuna) 20 July 2016 -
కొంత బ్రేక్ తర్వాత!
సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి హిట్‌తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా భక్తి రసాత్మక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందనున్న ‘నమో వెంకటేశా’లో వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబాగా నటించనున్నారాయన. ఈ పాత్ర కోసం నాగ్ గడ్డం పెంచుతున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపు నాగ్ ఓ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. అదే ‘నిర్మలా కాన్వెంట్’. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ఒక ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. మంగళవారం ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ‘‘కొంత బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నా. చాలా ఎంజాయ్ చేస్తున్నా’’ అని నాగ్ పేర్కొన్నారు. -
ఏఆర్ రెహ్మాన్ కుమారుడు పాడిన పాట ఇదే..
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు అమీన్ తెలుగు సినిమా కోసం పాట పాడాడన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్' సినిమా కోసం అమీన్ తన స్వరాన్నందించాడు. నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున సోమవారం సాయంత్రం అమీన్ పాడిన పాటను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. రోషన్ సాలూరి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జై చిరంజీవ, దూకుడు తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఈ సినిమాలో కథానాయిక. నాగార్జున కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. Proudly introducing,A R RAHMAN's son, A R AMEEN debut song in Telugu#NIRMALA CONVENT,a fresh pure love story.https://t.co/Wib8gChaji — Nagarjuna Akkineni (@iamnagarjuna) February 15, 2016 -
రెహ్మాన్ కుమారుడు అదరగొట్టేశాడు
చెన్నై: తెలుగు సినిమాకోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు అమీన్ స్వరాన్నందించాడు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్' సినిమా కోసం తొలిసారి తెలుగు గీతాన్ని ఆలపించాడు. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. 'రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం కోసం అమీన్ చాలా బాగా పాడాడు. రికార్డింగ్ చాలా అద్బుతంగా వచ్చింది. మా చిత్ర యూనిట్ అంతా ఇందుకు సంతోషంగా ఉన్నాం' అని చిత్ర వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓ కాదల్ కన్మణి(తెలుగులో ఓకే బంగారం) అనే తమిళ చిత్రం కోసం తొలిసారి అమీన్ పాడటం ప్రారంభించాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాకు సినీ నటుడు నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మాతలుగా ఉన్నారు. దూకుడు తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఇందులో నాయిక. నాగార్జున కూడా ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారు. -
నిర్మలా కాన్వెంట్లో శ్రీకాంత్ వాళ్ళబ్బాయి
హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం సెలైంట్‌గా షూటింగ్ జరుపుకొంటోంది. హీరో నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. జి. నాగకోటేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘దూకుడు’ తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఇందులో నాయిక. నాగార్జున ఇందులో ప్రత్యేక పాత్ర చేయనున్నారు. ఫిబ్రవరిలో ఆయన వెర్షన్ షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, కెమెరా: ఎస్.వి విశ్వేశ్వర్.