విజ్ఞానం పంచే కాన్వెంట్
కొత్త సినిమా గురూ!
టీనేజ్ లవ్‌స్టోరీలు, స్కూలు, కాలేజీ వయసు ప్రేమకథలు తెలుగు సినిమాకు కొత్త కాదు. ఆ ప్రేమకు పిల్లలు పెంచుకోవాల్సిన విజ్ఞానాన్నీ, దానితో వచ్చే విజయాన్నీ ముడిపెడితే? అలవాటైన స్కూల్ ఏజ్ లవ్‌స్టోరీలోనే పిల్లలకు పాఠం కూడా నేర్పే అలాంటి ప్రయత్నం - ‘నిర్మలా కాన్వెంట్’. పారిశ్రామిక వేత్త ‘మ్యాట్రిక్స్’ నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలసి హీరో నాగార్జున నిర్మించిన ఈ లేటెస్ట్ సినిమా కథ సింపుల్.
అనగనగా భూపతిపురం గ్రామం. రాజా గారి 99 ఎకరాలకు నీళ్ళు దళితుడు వీరిగాడి (ఎల్బీ శ్రీరామ్) ఒక ఎకరం చేను మీద నుంచి రావాల్సిందే! రాజా గారిని ధిక్కరించి, వీరిగాడు హతమారి పోతాడు. చచ్చినా ఆ ఎకరం అమ్మవద్దని కొడుకు (సూర్య) దగ్గర మాట తీసుకొని మరీ కన్నుమూస్తాడు. ఆ ఫ్లాష్‌బ్యాక్ కథ ఇప్పటి మూడో తరానికి వచ్చేసరికి, రాజా గారి మనవ రాలు శాంతి (శ్రేయాశర్మ), వీరి గాడి మనుమడూ, బ్రిలియంట్ స్టూడెంట్ శామ్యూల్ (హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్) ప్రేమలో పడతారు. సహజంగానే హీరోయిన్ తండ్రి అడ్డం పడతాడు. కొడుకు ప్రేమ కోసం ఎకరం భూమీ రాసిచ్చేస్తానంటాడు హీరో తండ్రి. అందరూ చెప్పుకొనేంత గొప్పవాడూ, కోటీశ్వరుడూ అయితే అప్పుడు పెళ్ళి సంగతి చూస్తానంటాడు హీరోయిన్ తండ్రి. తల్లితండ్రుల్ని వదిలి, హైదరాబాద్ వచ్చిన హీరో అక్కడ నటుడు నాగార్జునను కలుస్తాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో టాప్ 10 విజేతల్ని తలదన్నే నాలెడ్జ్ తనదనీ, తనకొక్క ఛాన్స్ ఇమ్మంటాడు. ఆ పై హీరో ప్రేమనెలా గెలిచాడన్నది మిగతా సినిమా.
రెండున్నర గంటల సినిమాలో ఫస్టాఫ్ అంతా హీరో, అతని నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కాన్వెంట్ పిల్లల అల్లరి, ప్రేమ. అన్నీ ఊహించదగినట్లే నడిచిపోతుంటాయి. నాగార్జున ఎంటరయ్యే సెకండాఫ్ నుంచి ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘకాలంగా సినీరంగ అనుభవమున్న జి. నాగ కోటేశ్వరరావుకు కూడా దర్శకుడిగా ఇదే తొలి సినిమా. ఆయన కుమారుడూ, చిరంజీవి, నాగార్జున సహా పలువురు అగ్రతారల సినీ ప్రచార వ్యూహ నిపు ణుడూ అయిన జి.కె. మోహన్ తెర వెనుక ఉండి ఈ సినిమాను నడిపించి, ‘నాన్నకు ప్రేమతో’ ఇచ్చిన ఈ గిఫ్ట్ గౌరవం పెంచే సెంటిమెంటల్ అంశం.
వంద చిత్రాల మైలురాయి దాటేసిన హీరో శ్రీకాంత్ తన కుమారుడు రోషన్‌ను పూర్తిస్థాయి హీరోగా పరిచయం చేసిన తొలి సినిమా ఇది.
అందంగా కనిపించే రోషన్ డైలాగ్ డెలివరీ, నటనలోని ఈజ్ చూస్తే, ఎక్కడా ఫస్ట్ ఫిల్మ్ హీరోలా అనిపించడు. నటన, డ్యాన్సుల లాంటివి ఇంకా ఎంత సాధన చేస్తే, భవిష్యత్తులో అంత మంచి హీరోగా, లవ్‌స్టోరీలకు కొత్త కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు. అతనితో పాటు, యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల (ఎలక్ట్రీషియన్ కొడుకు పాత్ర), సంగీతం రోషన్ సాలూరి (సంగీత దర్శకుడు కోటి కుమారుడు)తో కలిపి మొత్తం ముగ్గురు రోషన్‌లు ఈ సినిమాలో ఉన్నారు. కెమేరా విశ్వేశ్వర్, గాయ కుడు ఏ.ఆర్. అమీన్ (రహ్మాన్ కుమారుడు) లాంటి కొత్తవాళ్ళు, ప్రముఖుల వారసులూ ఉన్నారు. నట, సాంకేతిక నైపుణ్యానికి నిర్మాణ విలువలు కలిసి దృశ్యాలు తెరపై రిచ్‌గా కనిపిస్తాయి.
నాగార్జున ఈ చిత్రంలో తన నిజజీవిత పాత్రలో కనిపించడమే కాక, చివరలో రోలింగ్ టైటిల్స్‌లో ‘కొత్త కొత్త భాష...’ పాటకి నర్తించారు, ప్రచార చిత్రాల కోసం పాడారు! చాలా ఏళ్ళ క్రితమే ‘సీతారామరాజు’లో సిగరెట్ పాట పాడిన నాగార్జునను సింగర్‌గా ఇదే ‘తొలి పరిచయం’ అని టైటిల్స్ ప్రస్తావిస్తాయి. కథాగమనం ఎలా ఉంటుందో ముందో పసిగట్టేలా ఉన్నా, ఈ సినిమాలో చాలా సన్నివేశాల్లో రివాల్వర్ ఎవరు కనిపెట్టారు, ‘హలో’ పదం పుట్టుక - ఇలా ప్రపంచ విజ్ఞాన గుళికలు చాలా వస్తాయి.
ఆ రకంగా ఇది పేరులో ఉన్నట్లే, ప్రతి ఒక్కరికీ పాఠాలు నేర్పే ‘కాన్వెంట్’. బలమైన పాత్రలు, సెంటిమెంట్లు, సందర్భాలు అల్లుకొంటే బాగుండేదనిపించినా, కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు, కొత్త సాంకేతిక నిపుణులతో ఇంత ‘రిచ్’ ప్రయత్నం చేసినందుకు అభినందించాలి. క్లైమాక్స్ ఘట్టాల్లో పోలికలు చూశాక, ‘అబ్బ....ఛ’ అనుకోకపోతే, తెలుగు తెర ‘స్లమ్ డాగ్ మిలియనీర్’. వెండితెరపై... రెండున్నర గంటల బుల్లితెర ‘మీలో ఎవరు కోటీశ్వరుడు!’ - రెంటాల జయదేవ