ప్రేమ పాట పాడిన నాగ్
‘కొత్త కొత్త భాష.. కొత్త ప్రేమభాష...’ అంటూ పన్నెండేళ్ల పిల్లాడు అమీన్ పాడిన పాట అక్కినేని నాగార్జునకు విపరీతంగా నచ్చేసింది. ఈ అమీన్ ఎవరో కాదు.. ఎ.ఆర్. రహమాన్ తనయుడు. ‘నిర్మల కాన్వెంట్’ కోసం అమీన్ పాడిన ఈ ప్రేమ పాటను ఆ చిత్రనిర్మాత నాగార్జున విన్నారు. ప్రేమను వర్ణిస్తూ సాగే ఈ పాటను మళ్లీ మళ్లీ విన్నారు. వినడం మాత్రమే కాదు.. వెంటనే ఈ పాట పాడాలని నిర్ణయించుకున్నారు.
‘సీతారామరాజు’లో ‘చీపుగా చూడకు పొరపాటు.. చిరాకు పడదా సిగరెట్టు..’ అనే పాట పాడిన నాగర్జున, పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ పాటతో ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. తాజా పాటను శనివారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘‘హృదయానికి హత్తుకునే ఈ అందమైన ప్రేమ పాట ప్రేక్షకులకూ, ఫ్యాన్స్‌కూ నచ్చుతుందని ఆశిస్తున్నా.
నేను చాలా ఇష్టపడి పాడాను’’ అని నాగార్జున పేరొన్నారు. ఈ పాటను ప్రముఖ సంగీతదర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరిచారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రేయా శర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. నాగర్జున సమర్పణలో మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు చిత్రాన్ని నిర్మించాయి.