చిత్ర పరిశ్రమలో కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు నాగార్జున. పలు రంగాల్లో కొత్తవారిని ప్రోత్సహిస్తున్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్. ఇద్దరూ మంచి స్నేహితులు. వ్యాపారాల్లో భాగస్వాములు. వీరిద్దరూ కలసి నిర్మించిన సినిమా ‘నిర్మలా కాన్వెంట్’. ఈ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్, దర్శకుడిగా జి.నాగకోటేశ్వరరావు, సంగీత దర్శకుడిగా కోటి తనయుడు రోషన్ సాలూరి సహా పలువురు పరిచయమవుతున్నారు. నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్ పంచుకున్న విశేషాలు...
అమల మెచ్చుకుంది - నాగార్జున
ఏడాది క్రితం కాన్సెప్ట్ ఫిల్మ్స్ వాళ్లు ఈ కథను నాకూ, ప్రసాద్‌గారికి వినిపించారు. ఎప్పట్నుంచో ప్రసాద్ గారికి సినిమా నిర్మాణం మీద ఆసక్తి. ‘నాగ్.. మనం కలసి ఓ సినిమా తీద్దాం’ అనేవారు. ఆయన వ్యాపారంలోకి నేను ఎంటరయ్యా. ఇప్పుడు నా వ్యాపారంలోకి ఆయన్ను తీసుకొచ్చాను.
వినూత్న ఆలోచనలతో ఏదైనా చేయడమంటే ప్రసాద్‌గారికి ఇష్టం. నాకూ కొత్తదనం అంటే ఇష్టం. ఇద్దరి మనస్తత్వాలు బాగా కలిశాయి. ఆ విధంగా మా స్నేహంలో ఈ కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ప్రసాద్‌గారు బాగా సినిమాలు చూస్తారు. మాకు అందమైన కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇది.
ప్రసాద్‌గారి దగ్గర డబ్బులకు సమస్య లేదు. నాతో కలవాల్సిన అవసరం లేదు. మాది డబ్బుతో ముడిపడిన బంధం కాదు. ఇద్దరం కలసి ఐడియాలు డిస్కస్ చేసుకోవడం, కలసి ప్రయాణించడం చక్కటి అనుభూతి.
ఆడియో వేడుకలో హీరో రోషన్ మాట్లాడిన తీరు చూసి ముచ్చటేసింది. చిన్న వయసు లోనే అంత ఎమోషనల్‌గా, మెచ్యూర్డ్‌గా మాట్లాడడం మామూలు కాదు. శ్రీకాంత్, ఊహ కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చేశాయి. సినిమాలో బాగా చేశాడు.
ఇప్పటివరకూ ఆల్మోస్ట్ హీరోగానే చేశాను. ఈ సినిమాలో మాత్రం నేను హీరో కాదు. వెరీ ఇంపార్టెంట్ సపోర్టింగ్ రోల్ చేశా. (నవ్వుతూ..) ఈ ఏడాది బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను. ఇతర సినిమాల్లో మంచి కథలు, పాత్రలు వస్తే తప్పకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తా. నేను పాడిన పాట సినిమాలో ఉండదు. ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్ పాడిన పాట ఉంటుంది. ‘ఇంత బాగా పాడతావ్ అనుకోలేదు’ అని అమల మెచ్చుకుంది.
నాకు ప్రేమకథలంటే ఇష్టం. నా సినిమాల్లో ఎక్కువ ప్రేమకథలే. ఏ మనిషైనా ఎప్పు డైనా ప్రేమ అనేది టచ్ చేయక పోతే అతను మనిషే కాదు. ఇది కూడా మంచి ప్రేమకథ.
ఈ సినిమాలో కైలాష్ ఖేర్ ‘ముందు నుయ్యి’ అనే పాట పాడారు. కథ విన్నాక ‘పాతాళ భైరవి’లో లాంటి పాట ఉంటే బాగుంటుం దని ప్రసాద్‌గారే సలహా ఇచ్చారు.
మరిన్ని సిన్మాలు తీస్తా - నిమ్మగడ్డ ప్రసాద్
నేనూ, నాగార్జున ముందు స్నేహితులం. ఆ తర్వాత వ్యాపారంలో భాగస్యాములయ్యాం. కొత్తవాళ్లతో సినిమా తీయాలని ఇద్దరికీ ఆసక్తి ఉంది. అక్కినేని కుటుంబం, అన్నపూర్ణ స్టూడియోస్‌తో నాకు వ్యక్తిగతంగా చాలా అటాచ్‌మెంట్. నాకు ఏయన్నార్‌గారితో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ అటాచ్‌మెంట్‌తో నాగ్, నేనూ ఎప్పుడూ సినిమా ప్రొడక్షన్ గురించి అనుకునేవాళ్లం. నిర్మాతగా మారడానికి అంతకు మించి ప్రత్యేక కారణాలేమీ లేవు. నాగ్ చెప్పినట్లు మా స్నేహంలో కొత్త ప్రయాణం ఇది.
ఎవరో మనకు తెలియని హీరోలను మనం చూడాల్సిన అవసరం లేదు. స్నేహితుల్లో, సమాజంలోనో ఎక్కడో మన ముందే హీరోలు ఉంటారు. మ్యాట్రిక్స్ కంపెనీ టేకోవర్ చేసినప్పుడు ఓ ‘ఆర్ అండ్ డీ’ సీనియర్‌ని ఇంటర్వ్యూ చేశాను. ఐదేళ్ల జీతం డిపాజిట్ చేయమని అడిగాడు. అంత డబ్బులుంటే ఎందుకు సిక్ కంపెనీ కొంటాను. ‘యంగ్‌స్టర్స్‌కి ఎందుకు చాన్స్ ఇవ్వకూడదు’ అని ఆ రోజు అనిపించింది. హెచ్‌ఆర్‌ని పిలిచి ఈ వయసులో సైంటిస్ట్‌లు కావాలని చెప్పా. ఓ బిలియన్‌కి మ్యాట్రిక్స్ అమ్మినప్పుడు ఎంప్లాయిస్ ఏవరేజ్ ఏజ్ 28 ఏళ్లు మాత్రమే. యంగ్‌స్టర్స్‌కి చాన్స్ ఇవ్వడం మొదట్నుంచీ ఉంది. సింగర్‌గా నాగ్ సహా 10 మంది కొత్తవాళ్లు దీంతో పరిచయమవు తున్నారు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ.
నాకు సంగీతమంటే ప్రాణం. ఈ పాటలు నా మనసుకు హత్తుకున్నాయి. నాగార్జున ఇంత బాగా పాడతారని అనుకోలేదు. రాజీవ్ కనకాల, సుమల కుమారుడు రోషన్ కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.
హీరో రోషన్ ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడిన తీరు న్యాచురల్‌గా అనిపించింది. మా అబ్బాయి మాట్లాడుతున్నట్టు అనిపించింది.
చిన్నప్పుడు ఓ మొక్క నాటేటప్పుడు.. ‘నేను మరణించినా చెట్టు నీడలో చాలామంది బతుకుతారు’ అని తాతయ్య చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద హైదరాబాద్‌లో 3 లక్షల మంది బతుకుతున్నారు. కొత్తవాళ్లకి ఛాన్స్‌లిస్తే ఎంతోమంది పైకి వస్తారు. ఫ్యూచర్‌లో తప్పకుండా సినిమాలు నిర్మిస్తాను.
ఇది మా స్నేహంలో కొత్త అడుగు
Published Sat, Sep 10 2016 11:21 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement
Advertisement