ఆనందంతో కన్నీళ్లొచ్చాయి : ఊహాశ్రీకాంత్
‘‘రోషన్‌ను క్రికెటర్ చేద్దామనుకుని ఐదో తరగతి నుంచే శిక్షణ ఇప్పించా. బాగా ఆడేవాడు. రాష్ట్రస్థాయికి ఎంపికయ్యే టైమ్‌లో ‘రుద్రమదేవి’ చిత్రానికి అవకాశం వచ్చింది. ఆ చిత్రం తర్వాత నటనపై తనకు పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు వచ్చిన అవకాశమే ‘నిర్మలా కాన్వెంట్’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఆయన తనయుడు రోషన్ హీరోగా జి.నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ పతాకాలపై నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ ఈ శుక్రవారం విడుదలవుతోంది.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ- ‘‘నా మొదటి చిత్రం ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’ టైమ్‌లో నాకు ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందుకే ఏ పాత్ర వస్తే అది చేశాను. కానీ, రోషన్‌కు మా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎదిగే కొద్ది ఒదిగి ఉండమని నేను, ఊహా రోషన్‌కు చెప్పాం. తను అది పాటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆడియో వేడుకలో రోషన్ స్టేజ్‌పై మాట్లాడిన మాటలకు నా కళ్లల్లో ఆనందభాష్పాలొచ్చాయి.
ఈ చిత్రం విడుదలయ్యాక రెండేళ్లు గ్యాప్ తీసుకుని, డ్యాన్స్, ఫైట్స్, నటనలో రోషన్‌కి ఇంకా ట్రైనింగ్ ఇప్పించి, రీ-లాంచ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘రోషన్ ఎలా నటిస్తున్నాడో చూడ్డానికి సెట్స్‌కి వెళ్లలేదు. నాగార్జునగారితో సీన్స్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్‌గా ఉందని రోషన్ చెబితే సలహాలు ఇచ్చా. తనని తొలిసారి తెరపై చూసినప్పుడు ఓ తల్లిగా నా కళ్లల్లో నీళ్లొచ్చాయి’’ అని ఊహా చెప్పారు.
రోషన్ మాట్లాడుతూ- ‘‘ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ‘రుద్రమదేవి’లో నటించే అవకాశం వచ్చింది. టీవీలో, సినిమాలో కనిపించొచ్చు కదా అని ఓకే చెప్పేశా. ఆ తర్వాత క్రికెట్‌పై ఇష్టం పోయి సినిమాలపై పెరిగింది. నటనలో అమ్మ, నాన్నలే నా ఇన్‌స్పిరేషన్. వారి సలహాలతో ‘నిర్మలా కాన్వెంట్’చిత్రంలో ఎమోషన్ సీన్స్‌లో బాగా నటించా’’ అని చెప్పారు.