రిషికపూర్ గుర్తొచ్చాడు - దాసరి
రిషికపూర్ గుర్తొచ్చాడు - దాసరి
Published Mon, Sep 26 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
‘‘శ్రీకాంత్, ఊహల పెళ్లి మొన్నీమధ్య జరిగినట్టుంది. అప్పుడే వాళ్లబ్బాయి హీరోగా పరిచయమయ్యాడు. తల్లితండ్రులిద్దరూ మంచి నటులు. వాళ్ల జీన్స్ ఎక్కడికి పోతాయి. చక్కగా నటించాడు. స్క్రీన్‌పై రోషన్‌ని చూస్తే ముద్దొచ్చాడు’’ అన్నారు ‘దర్శకరత్న’
దాసరి నారాయణరావు. రోషన్, శ్రేయా శర్మ జంటగా జి.నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘నిర్మలా కాన్వెంట్’. ఈ నెల 15న సినిమా విడుదలైంది. సోమవారం దాసరి, చిత్ర బృందాన్ని అభినందించారు. ఆయన మాట్లాడుతూ - ‘‘అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఓ యువకుడు విజ్ఙానంతో ఎంత ఎత్తుకు ఎదిగాడనే ప్రేమకథ నాకు నచ్చింది. అందుకే, అభినందించాలనుకున్నాను.
రోషన్ నటన హిందీ సినిమా ‘బాబి’లో రిషి కపూర్‌ను గుర్తు చేసింది. సెకండాఫ్‌లో నాగార్జున అద్భుతంగా నటించాడు. నేను దర్శకత్వం వహించిన 15 సినిమాలకు సాలూరి రాజేశ్వరరావుగారు సంగీతమందించారు. కోటితో పని చేశా. కోటి కుమారుడు రోషన్ సాలూరి ఈ సినిమాకి సంగీతమందించాడు. ఈ కుర్రాడితోనూ తప్పకుండా పని చేస్తా. నా సినిమాలో హీరోయిన్‌గా నటించిన ‘యాంకర్’ సుమ కుమారుడు రోషన్ కనకాల కూడా చక్కగా నటించాడు. దర్శకుడు యువకులతో పోటీపడి మంచి ప్రేమకథ తీశాడు.
ఇటువంటి సినిమాలను ముందు మల్టీప్లెక్స్‌లలో విడుదల చేసి, సూపర్‌హిట్ టాక్ వచ్చిన తర్వాత అన్ని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం’’ అన్నారు. ‘‘దాసరిగారిని టీవీల్లో చూడడమే. ఈరోజు ఆయన మమ్మల్ని పిలిచి అభినందించడం చాలా సంతోషంగా ఉంది’’ అని హీరో రోషన్ అన్నారు. హీరో శ్రీకాంత్, దర్శకుడు జి.నాగకోటేశ్వర రావు, యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల పాల్గొన్నారు.
Advertisement