
వసంత్ దర్శకత్వంలో నిత్యామీనన్
దర్శకుడు వసంత్ అనగానే కేళడీకణ్మణీ, ఆశై, పూవెల్లాకేట్టుప్పార్ లాంటి విభిన్న కథాచిత్రాలు గుర్తుకొస్తాయి.
దర్శకుడు వసంత్ అనగానే కేళడీకణ్మణీ, ఆశై, పూవెల్లాకేట్టుప్పార్ లాంటి విభిన్న కథాచిత్రాలు గుర్తుకొస్తాయి. అంతేకాదు ఆయన చిత్రాల్లో కథానాయికలకు ప్రాధాన్యం కచ్చితంగా ఉంటుంది. అదే విధంగా తను తయారు చేసుకున్న కథల విషయంలోగానీ, దాన్ని చిత్రీకరించే విషయంలో గానీ రాజీపడే మనస్తత్వం కాని దర్శకుడు వసంత్. దివంగత ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ స్కూల్ నుంచి వచ్చిన వసంత్ తాజాగా స్త్రీల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం శివరంజనియుమ్ సిల పెంగళుమ్. ఇందులో నటి నిత్యామీనన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు.
నటుడు కరుణాకరన్, పార్వతి, కాళేశ్వరి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే జరుగుతోంది. నటి నిత్యామీనన్ ముడింజా ఇవనై పిడి తదితర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను పక్కన పెట్టి ఇతర సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారట. నిత్యామీనన్‌తో తీయవలసిన సన్నివేశాలను మే నుంచి చిత్రీకరించనున్నారని సమాచారం. చిత్రంలో మహిళలకు అవగాహన కలిగించే అంశాలు చోటు చేసుకుంటాయట. ఈ అమ్మడు మణిరత్నం చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు మీడియా. మరి ఏమై ఉంటుందో.