నా సంగీతానికి పూర్తి గుర్తింపు లభించలేదు: ఇళయరాజా
తమిళసినిమా (చెన్నై): నా సంగీతానికి పూర్తిగా గుర్తింపు లభించలేదని, అందుకే జాతీయ అవార్డును తిరస్కరించానంటున్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. సహస్ర చిత్రాల సంగీత దర్శకుడైన ఈయన 1000వ చిత్రం తారైతప్పట్టై నేపథ్య సంగీతానికిగాను కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఇళయరాజా మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదగా అందుకోవలసి ఉంది. బిగ్ బీ అమితాబ్, నటి రుతిక, సముద్రకని జాతీయ వార్డులను అందుకోగా ఇళయరాజా మాత్రం హాజరుకాలేదు. గురువారం తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిన ఇళయరాజా అక్కడ విలేకరులతో జాతీయ అవార్డును తిరస్కరించడం గురించి వివరణ ఇచ్చారు.
తన సంగీతానికి పూర్తి గుర్తింపు లభించకపోవడం వల్లే తాను అవార్డును తిరస్కరించినట్లు వెల్లడించారు. సంగీతానికి ఇచ్చే అవార్డును రెండుగా విభజించడం తనకు సరి అనిపించలేదన్నారు. 2010 నుంచి ఆరేళ్లుగా ఒకే ఒక్క జాతీయ అవార్డు లభించిందన్నారు.అంతకు ముందు సాగర సంగమం, సింధుభైరవి, రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డును అందుకున్నానని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు సంగీతానికి ఇచ్చే అవార్డును రెండు భాగాలు చేసి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును ఎం.జయచంద్రన్‌కు అందించి తనకు నేపాథ్య సంగీతానికి అవార్డును ప్రకటించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. సంగీతాన్ని ఒకే విభాగంగా భావించాలన్నారు.