సీక్రెట్స్ ఏమి లేవు: అజయ్ దేవగన్
దాంపత్య జీవితం విజయం సాధించడం వెనుక రహస్యమేమి లేదు అని బాలీవుడ్ నటుడు, దర్శకుడు అజయ్ దేవగన్ అన్నారు. సంతోషంగా ఉండి.. ఇతరులను సంతోషంగా ఉంచాలన్నదే తన ఉద్దేశ్యం అని అజయ్ తెలిపారు. బాలీవుడ్ నటి కాజోల్ తో వైవాహిక జీవితం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎదుటి వ్యక్తిని సాధ్యమైనంత మేరకు గౌరవించడం నేర్చుకోవాలని, విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
బాలీవుడ్ లో దాంపత్య జీవితాలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేవనేది అపోహ మాత్రమే అని అన్నారు. కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదని.. ఎక్కడైనా ఏ పరిశ్రమలోనైనా వివాహిక జీవితంలో విభేదాలు సహజమే అని అజయ్ అభిప్రాయపడ్డారు. దాంపత్య జీవిత మనుగడ వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది అని అన్నారు. 1999లో కాజోల్ ను పెళ్లాడిన అజయ్ దేవగన్ కు కూతరు నైసా, కుమారుడు యోగాలు ఉన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ జాక్సన్, రోహిత్ శెట్టి సింగం-2 చిత్రాల్లో అజయ్ దేవగన్ ప్రస్తుతం నటిస్తున్నారు.