శ్రీమతి కంటే శ్రీ బెటర్: పీసీ
'పద్మశ్రీ' ప్రియాంకా చోప్రా.. నన్ను నేను ఇలా చెప్పుకోవటానికి కాస్త సిగ్గనిపిస్తుంది.. కానీ గర్వంగా ఉంటుంది. ఎందుకంటే.. పారితోషికం, పాపులారిటీల కంటే ప్రభుత్వం ఇచ్చే అవార్డులనే గౌరవంగా భావిస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్' అంటూ సంతోషం వ్యక్తంచేస్తోంది పీసీ. అవార్డు తీసుకుని నాలుగు రోజులవుతోన్నా ఇంకా ఆ హడావిడి నుంచి బయటికిరాని ఈ జార్ఖండ్ ముద్దుగుమ్మ.. షూటింగ్స్ అన్నింటికి కామాపెట్టి, అవార్డును ఎంజాయ్ చేస్తోంది.
'మా నాన్నతోపాటు కుటుంబంలో చాలా మంది ఆర్మీలో పనిచేశారు. అందుకే ప్రభుత్వ పురస్కారాలను గొప్పగాఫీలవుతాం'అని చెబుతోంది. ఇప్పటికే 33 ఏళ్లు నిండిన పీసీని పెళ్లి గురించి అడిగితే.. .. 'ఇప్పుడు నేను పద్మశ్రీ ప్రియాంక చోప్రా. శ్రీమతి ప్రియాంక కంటే 'శ్రీ' ప్రియాంకే ఎంతో బెటర్ అని నా ఉద్దేశం' అంటూ తెలివిగా సమాధానం చెప్పింది.
'క్వాంటికో'లో తన సహచరులకు 'పద్మశ్రీ' అంటే ఏంటో తెలియదని, వాళ్లకు దాని విలువ తెలియజెప్పేప్రయత్నం చేస్తానని అంటోంది. నాలుగురోజుల కిందట రాష్ట్రపతి నుంచి 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న ప్రియాంక.. తన చీరకు గుచ్చిన మెడల్ ను సాయంత్రందాకా తీయకపోవటానికి కారణమేమిటా? అని అడిగినవాళ్లకు ఇంటర్వ్యూల ద్వారా బదులిస్తోంది.