ఎన్టీఆర్‌తో చేద్దామన్నారు కల్యాణ్‌రామ్!
‘‘ఈ కథ విని, ‘ఎవరైనా పెద్ద హీరోతో చేద్దాం.. నేను నిర్మిస్తా’ అని కల్యాణ్‌రామ్ అన్నారు.కానీ, చివరికి కన్విన్స్ అయ్యి, ‘నన్నీ పాత్రలో నువ్వు నమ్ముతున్నావా?’ అనడిగారు.. ‘పూర్తిగా నమ్ముతున్నా’ అని చెప్పాను. అలా ‘పటాస్’ ప్రారంభమైంది’’ అని అనిల్ రావిపూడి చెప్పారు. సహాయ దర్శకునిగా పలు చిత్రాలకు చేయడంతో పాటు ‘శౌర్యం’, ‘కందిరీగ’, ‘ఆగడు’ వంటి పలు హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరించిన అనిల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పటాస్’. ఈ రోజు ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ -‘‘మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్. ఎంతో కష్టపడి నన్ను బీటెక్ వరకూ చదివించారు. నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. ప్రయత్నిస్తానంటే ‘మూడేళ్లు మాత్రమే. ఈలోపు సక్సెస్ కాకపోతే వెనక్కి వచ్చేయాలి’ అన్నారు. నాన్నగారి నిబంధన మేరకు మూడేళ్లల్లో రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాను. దాంతో నాపై నమ్మకం కుదిరింది. వాస్తవానికి ‘పటాస్’ని ఎన్టీఆర్‌తో చేయాలన్నది కల్యాణ్‌రామ్ ఆలోచన. చివరికి కన్విన్స్ అయ్యి, ఆయనే చేశారు. ఓ అవినీతి పోలీసాధికారి నిజాయతీగా మారి, అన్యాయాలను ఎలా అరికట్టాడు? అనేది ‘పటాస్’ చిత్రకథ.
ఇప్పటివరకు వచ్చిన పోలీస్ కథల్లో లేని వినూత్న ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ‘అరె ఓ సాంబ..’ పాటను రీమిక్స్ చేయాలన్నది మా ఆలోచనే. పోలీస్ కథ నేపథ్యంలో సాగే బాలయ్య ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’లోని ‘అరె ఓ సాంబా..’ ఎవర్ గ్రీన్ హిట్. అందుకే, ఈ సినిమా కోసం రీమిక్స్ చేశాం. నందమూరి అభిమానులకు ఈ చిత్రం పండగే’’ అని చెప్పారు.