‘‘కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా చెయ్యొచ్చు. అటువంటి సినిమాలు సుమారు 90 చేశా. కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక, భక్తిరస సినిమాల్లో నటించే ఛాన్సులు అందరికీ దక్కవు. నాకు ఈ ఛాన్సులు రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు అక్కినేని నాగార్జున. వేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్ బాబాగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది.
ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘దేవుణ్ణి చూడాలనుకున్న ఓ వ్యక్తి తిరుమల చేరుకున్న తర్వాత ఎలాంటి ఆధ్యాత్మిక భావనకు లోనయ్యా డనేది ఈ సినిమా. ఎంత వసూలు చేస్తుంది? ఎప్పుడు విడుదలవుతుంది? వంటి టెన్షన్లు లేకుండా హ్యాపీగా నటించాను. అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అనేది పక్కన పెడితే... ఇటువంటి సినిమాలు చేయడం వల్ల ఓ క్రమశిక్షణ వస్తుంది. రాఘవేంద్రరావుగారి దర్శకత్వం, కీరవాణి సంగీతం, జేకే భారవి రచన, సాహిత్యం... అన్నీ నన్నో భక్తిభావంలోకి తీసుకువెళ్లాయి. రిలీజ్ తర్వాత వీళ్లందరికీ థ్యాంక్స్ చెప్పడం కుదరదు. అందుకే, ఇప్పుడు చెబుతున్నా. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ సంతోషంతో ఓ కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు.
కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నాగార్జున కళ్లతోనే నటించాడు. ‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక..’ పాటలో అయితే నాగ్ నటన అద్భుతం. కృష్ణమ్మగా నటించిన అనుష్కతో పాటు చిత్ర బృందమంతా భక్తి భావంతో పనిచేశారు. సినిమా చూస్తుంటే.. రెండున్నర గంటలు ఆధ్యాత్మిక ప్రయాణం చేసినట్టే ఉంటుంది. విడుదల తర్వాత థియేటర్లన్నీ దైవక్షేత్రాలుగా మారతాయి’’ అన్నారు.
నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో నా జన్మ ధన్యమైంది. మేమంతా ఓ కుటుంబంలా కలసి పనిచేశాం. శ్రీనివాసుడే మా అందర్నీ కలిపాడనుకుంటున్నా. భగవంతుడు, భక్తుడు కలసి ఆడే ఆటే ఈ సినిమా. చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా నాగార్జున గడ్డం తీయలేదు. ఒకవేళ ఏవైనా సన్నివేశాలు మళ్లీ చిత్రీకరించాలంటే ఇబ్బంది అవుతుందని అలాగే ఉన్నారు. రాఘవేంద్రరావుగారు ఈ వయసులోనూ రోజుకి 14 గంటలు పనిచేశారు. శ్రీనివాసుడి భక్తులకు, నాగార్జున అభిమానులకు ఈ సినిమా ఓ అద్భుతమైన బహుమతిగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు విమలా రామన్, అస్మిత, సౌరభ్ జైన్, రచయిత జేకే భారవి, పాటల రచయితలు వేదవ్యాస, అనంత శ్రీరామ్, కళా దర్శకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ ఇది : నాగార్జున
Published Wed, Feb 8 2017 11:31 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement
Advertisement