ఆ బాధ్యతను చిత్ర పరిశ్రమే తీసుకోవాలి
‘‘సెన్సార్ బోర్డ్ పనితీరు సరిగ్గా ఉండాలి. అలా ఉండాలంటే అర్హులైనవారే సెన్సార్ బోర్డ్‌లో ఉండాలి’’ అన్నారు కమల్‌హాసన్. ప్రస్తుతం చెన్నయ్‌లో జరుగుతున్న చెన్నయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియావారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారాయన. సెన్సార్ బోర్డ్‌కి సంబంధించిన ఓ ప్రశ్నకు కమల్‌హాసన్ స్పందిస్తూ - ‘‘సినిమాలను ఇష్డపడేవాళ్లే దాదాపు సెన్సార్ బోర్డ్‌లో ఉంటారు. వాళ్లు ఎన్నో సినిమాలు చూస్తారు. అంత మాత్రాన మంచి అనుభవజ్ఞులై ఉంటారని చెప్పలేం. అర్హులైనవాళ్లు సభ్యులుగా ఉంటేనే సినిమాకి న్యాయం జరుగుతుందన్నది నా బలమైన నమ్మకం. ప్రస్తుతం మన సెన్సార్ బోర్డ్‌లో ఉన్న సభ్యుల్లో అర్హులైనవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రతి రాజకీయ పార్టీ తమకు సంబంధించిన ఓ సభ్యుడు సెన్సార్ బోర్డ్‌లో ఉండాలని కోరుకుంటోంది. అది తప్పు. సెన్సార్‌షిప్ బాధ్యతను సినిమా పరిశ్రమే తీసుకోవాలి’’ అన్నారు.