ద బ్లాక్‌ అండ్‌ వైట్‌ షో! | Oscar Nominations 2017: 14 for 'La La Land,' and 6 for Black Actors | Sakshi
Sakshi News home page

ద బ్లాక్‌ అండ్‌ వైట్‌ షో!

Published Thu, Jan 26 2017 12:38 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

ద బ్లాక్‌ అండ్‌ వైట్‌ షో! - Sakshi

ద బ్లాక్‌ అండ్‌ వైట్‌ షో!


ఆస్కార్స్‌ 2017
యుద్ధం...  రంగు రాజేసిన మాటల యుద్ధం...
ఎరుపెక్కిన కళ్లతో నల్లగొంతు సంధించిన బాణం! ఆ బాణం...
గతేడాది తెలుపెక్కిన ఆస్కార్స్‌ షోకి సూటిగా తగిలిందా?!


89వ ఆస్కార్‌ అవార్డుల (ఈ ఏడాది) నామినేషన్లను పరిశీలిస్తే ఆ అంశం స్పష్టమవుతోంది. కులమతాలు, ప్రాంతాలకు అతీతమైనది కళ. ముఖానికి రంగేసుకునే కళాకారులకు కుల, మత, ప్రాంతీయ రంగులు అద్దకూడదని అందరూ చెప్పేమాట! కానీ, దురదృష్టవశాత్తూ గతేడాది ఆస్కార్‌ అవార్డులకు జాతి రంగు అంటుకుంది. 88వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్లలో నల్ల జాతీయుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడంతో నల్ల జాతీయులపై వివక్ష చూపించారనే అంశం తెరపైకి వచ్చింది. ‘ఆస్కార్స్‌ ఆర్‌ సో వైట్‌’ అనే విమర్శలు వినిపించాయి. అయితే ఈసారి నామినేషన్లను పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ ‘ఆస్కార్స్‌ 2017... ద బ్లాక్‌ అండ్‌ వైట్‌ షో’ అంటారు.

ఆస్కార్‌ ల్యాండ్‌లో లా..లా...
ఆస్కార్‌ చరిత్రలో అత్యధిక నామినేషన్‌లు దక్కించుకున్న చిత్రాలుగా ‘ఆల్‌ అబౌట్‌ ఈవ్‌’ (1950), ‘టైటానిక్‌’ (1997) చిత్రాలు నిలిచాయి. ఇవి 14 నామినేషన్‌లు దక్కించుకున్నాయి. ఈ ఏడాది 14 నామినేషన్లతో ‘లా లా ల్యాండ్‌’ వాటి సరసన నిలిచింది. ఇప్పటికే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను తన ఖాతాలో వేసుకుందీ మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా.

ఇరవైలో ఏడుగురు నలుపే!
గతేడాది చెలరేగిన నలుపు–తెలుపు జాతి వివక్ష కంచెను తెంచి ఆస్కార్‌ నామినేషన్లలో చోటు దక్కించుకున్న మూడు చిత్రాలు... ‘ఫెన్సెస్‌’, ‘హిడెన్‌ ఫిగర్స్‌’, ‘మూన్‌లైట్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మూడు చిత్రాలూ అమెరికాలో నల్లజాతీయుల జీవితాల గురించి చర్చించినవే. మూడింటికీ ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేషన్‌ దక్కింది. మరో విశేషం ఏంటంటే... మూడు చిత్రాల్లోని మహిళా తారలు వయోలా డేవిస్, నోమీ హ్యారీస్, ఆక్టివా స్పెన్సర్‌లకు ఉత్తమ సహాయనటి కేటగిరీలో నామినేషన్‌లు దక్కాయి. ‘ఫెన్సెస్‌’లో హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించిన డెంజెల్‌ వాషింగ్టన్‌కి ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌ ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ చిత్రానికి నాలుగు నామినేషన్‌లు దక్కాయి. ముఖ్యంగా ఉత్తమ నటుడిగానూ ఆయన పోటీలో నిలిచారు.

‘మూన్‌లైట్‌’లో నటుడు మహర్షాలా అలీకి ఉత్తమ సహాయ నటుడిగా నామినేషన్‌ దక్కింది. దేవ్‌ పటేల్‌ (ఉత్తమ సహాయ నటుడు – లయన్‌), రూత్‌ నెగ్గా (ఉత్తమ నటి –లవింగ్‌)... మొత్తం మీద ఉత్తమ నటీనటుల కేటగిరీ ఇరవైమందిలో ఏడుగురు నల్ల జాతీయులున్నారు. ఇక, నలుపు–తెలుపు వివక్షను పక్కనపెట్టి సినిమాల పరంగా చూసుకుంటే... ‘అరైవల్‌’, ‘మూన్‌లైట్‌’ చిత్రాలకు ఎనిమిదేసి, ‘హక్సారిడ్జ్‌’, ‘లయన్‌’, ‘మాంచెస్టర్స్‌ బై ద సీ’ చిత్రాలకు ఆరేసి, ‘హెల్‌ ఆర్‌ హై వాటర్‌’ చిత్రానికి 4 నామినేషన్‌లు దక్కాయి.

మెరిల్‌ 20వ సారి... డెంజెల్‌ 7వ సారి..
‘ఫ్లోరెన్సీ ఫోస్టర్‌ జెనిక్స్‌’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నామినేట్‌ అయిన మెరిల్‌ స్ట్రీప్, ఆస్కార్‌ అవార్డుల బరిలో నామినేషన్‌ దక్కించు కోవడం ఇది 20వసారి. ఇదీ ఓ రికార్డే. గతంలో ‘క్రెమర్‌ వర్సెస్‌ క్రెమర్‌’ (1980), ‘సోఫీస్‌ చాయిస్‌’ (1983), ‘ద ఐరన్‌ లేడీ’ (2012) చిత్రాల్లో ఆమె నటనకు ఆస్కార్‌ ఫిదా అయింది. మరి, నాలుగోసారి 67 ఏళ్ల ఈ నటికి ఆస్కార్‌ వస్తుందో? లేదో? చూడాలి.

ఆస్కార్స్‌ నామినేషన్స్‌ చరిత్రలో అత్యధికసార్లు నామినేట్‌ అయిన  నల్ల జాతీయుడుగా డెంజెల్‌ వాషింగ్టన్‌ రికార్డు దక్కించుకున్నారు. మొత్తం ఏడుసార్లు నామినేట్‌ కాగా, ‘గ్లోరీ’ (1989)కి ఉత్తమ సహాయ నటుడిగా, ‘ట్రైనింగ్‌ డే’ (2001)కి ఉత్తమ నటుడిగా... రెండుసార్లు ఆస్కార్‌ బొమ్మని ఇంటికి తీసుకువెళ్లారు. మూడోసారి ఆస్కార్‌ అందుకుంటారా? లేదా? వెయిట్‌ అండ్‌ సీ!

రెహమాన్‌ లేడు... దేవ్‌ పటేల్‌ ఉన్నాడు
‘స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌’తో డబుల్‌ ఆస్కార్‌ని ముద్దాడిన ఏఆర్‌ రెహమాన్‌ ఈసారి ‘పీలే: బర్త్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ చిత్రానికిగాను ఆస్కార్‌ రేసులో ‘ఒరిజినల్‌ మ్యూజిక్‌ స్కోర్‌’, ‘ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగాల్లో పోటీపడ్డారు. రెండిటిలోనూ ఆయనకి నామినేషన్‌ దక్కలేదు. అయితే... ‘స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌’లో నటించిన భారత సంతతి నటుడు దేవ్‌ పటేల్‌కి తొలిసారి నామినేషన్‌ లభించింది. ‘లయన్‌’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో పోటీపడుతున్నారు. ఉత్తమ విదేశీ  చిత్రం కేటగిరీలో పోటీపడిన రేఖారాణా ‘యాహా అమీనా బిక్తీ హై’ చిత్రానికీ నామినేషన్‌ దక్కలేదు. ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్‌లు దక్కించుకున్న నల్లజాతి నటీనటులు, సాంకేతిక నిపుణులకు గతేడాది చెలరేగిన వివాదం ఏమాత్రమూ సహాయపడిందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే... గతంలో కొందరు ఆస్కార్‌ బరిలో నిలిచి, అవార్డులు గెలిచినవారే.
ఫిబ్రవరి 26న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement