మాది పెద్దలు అనుమతించిన ప్రేమ వివాహం!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో బోల్డన్ని పాత్రలుంటాయి. వాటిల్లో బాగా గుర్తుండిపోయిన పాత్ర... నాగరాజు. ఈ పాత్ర పోషించిన సుధాకర్ కోమాకులను చాలామంది నాగరాజు అనే పిలుస్తారు. అంత పేరొచ్చింది కాబట్టే, తదుపరి చిత్రంలోని పాత్ర కూడా బాగుండాలనే ఆకాంక్షతో ఎన్నో కథలు విని, చివరికి ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’కి సుధాకర్ పచ్చజెండా ఊపారు. అరుణ్ దాస్యం దర్శకత్వంలో రవి రాష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుధాకర్ మనోభావాలు ఈ విధంగా...
ఈ చిత్రంలో నా పాత్ర పేరు జాజ్‌రాజ్. పెద్ద రాక్‌స్టార్ కావాలనేది ఆశయం. పగలంతా ఆటో నడిపి, సాయంత్రం నుంచి ఈవెంట్స్‌లో పాల్గొంటాను. మా అమ్మ ఈవెంట్ లక్ష్మీగా రాధికగారు నటించారు. నాన్నగా నరేశ్‌గారు చేశారు. వినోద ప్రధానంగా సాగే విలువలున్న చిత్రం ఇది.
బేసిక్‌గా నాకు ఆర్ట్ అంటే ఇష్టం. అది డాన్స్, ఫొటోగ్రఫీ.. ఇలా ఏదైనా. అందుకే, సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ డిప్లొమా ఇన్ డాన్స్ చేశాను. ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో అది కూడా నేర్చుకున్నాను. ఈ చిత్రదర్శకుడు అరుణ్, నేను స్కూల్ ఫ్రెండ్స్. నేను ఫొటోగ్రఫీ చేయడానికి యూఎస్ వెళ్లిపోయాను. అరుణేమో ఇక్కడ అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసేవాడు. శేఖర్ కమ్ములగారు నన్ను యూఎస్ నుంచి పిలిపించి, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో మంచి పాత్ర ఇచ్చారు. ఆ సమయంలోనే అరుణ్ ఈ సినిమా అనుకున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత కరెక్ట్ సినిమా చేశాననిపించింది.
అది అదృష్టమో దురదృష్టమో చెప్పలేను కానీ హుద్ హుద్ ముందు సుందర నగరం వైజాగ్‌ని అద్భుతంగా చూపించిన చివరి చిత్రం మాదే అవుతుంది. ఈ సినిమా కోసం వైజాగ్‌లో కీలక సన్నివేశాలు తీశాం. ఆ తర్వాత హుద్ హుద్ రావడం, వైజాగ్ పరిస్థితి దారుణంగా మారడం తెలిసిందే.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో నన్నందరూ తమ ఇంటి అబ్బాయి అనుకుంటున్నారు. ఒకే రకం కాకుండా వినూత్న తరహా పాత్రలు చేయాలన్నది నా కోరిక. ముఖ్యంగా స్పోర్ట్స్‌మేన్‌గా చేయాలనే ఆకాంక్ష ఉంది. అలాగే, కథకు కీలకంగా ఉంటే.. నెగటివ్ రోల్ అయినా చేస్తాను.
నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మా, నాన్న. ఆ తర్వాత నా భార్య హారిక. నాకు మంచి సినీ జీవితాన్నిచ్చిన శేఖర్ కమ్ములగారు. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు పెళ్లయిన విషయం చాలామందికి తెలీదు. మాది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం. మై వైఫ్ ఈజ్ సో బెస్ట్.