
సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిపై కొనసాగుతున్న వివాదం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. చిత్ర విడుదలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై నటి అలీయాభట్ స్పందించారు. బహిరంగంగా చేస్తున్న బెదిరింపులపై ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ఆమె గట్టిగా ప్రశ్నించారు. '' శిక్షలు లేకుండా బహిరంగంగా బెదిరింపులు చేయడానికి అనుమతి ఇస్తే, ఇలాంటి ఘటనలే జరుగుతాయి. అసలేం జరుగుతుంది? నిజంగా షాక్!'' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పద్మావతి వివాదంపై కొనసాగుతున్న ఆందోళనలపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని అలియా ప్రశ్నించారు.
నహర్‌గఢ్ కోట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి చేతన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కోట గోడలపై, దగ్గరల్లోని రాళ్ల మీద చిత్ర బృందాన్ని హెచ్చరించిన రాతలు కనిపించాయి. దీంతో ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టు మార్టం నివేదిక తర్వాతే స్పందిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే రాజ్‌పుత్ కర్ణి సేన నుంచి చిత్ర విడుదలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న సమయంలో ఈ ఘటన మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ చిత్ర విడుదలను నిషేధించాయి. ఈ ఘటన సర్వత్రా విస్మయానికి గురిచేసింది. సినిమా తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి చాలా మత గ్రూపులు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. రోజురోజుకు ఆందోళనకారులు తమ నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకునే, భన్సాలీ తలలకు రూ.10 కోట్లు ఇస్తామంటూ కొందరు బహిరంగంగానే కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment