ఒక్క చెప్పుతో వస్తానంటున్న పార్తీపన్‌ | Parthiepan New Movie Poster Released | Sakshi
Sakshi News home page

ఒక్క చెప్పుతో వస్తానంటున్న పార్తీపన్‌

Published Tue, Mar 12 2019 7:23 AM | Last Updated on Tue, Mar 12 2019 7:23 AM

Parthiepan New Movie Poster Released - Sakshi

ఒత్త సెరుప్పు చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

సినిమా: నటుడు, దర్శకుడు పార్తీపన్‌ చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే జయాపజయాలను పక్కన పెడితే ఆయన చిత్రాల్లో కథ, కథనాల్లో  కచ్చితంగా కొత్తదనం ఉంటుంది. అంతే కాదు పార్తీపన్‌ చిత్రాల పేర్లు కొత్తగా ఉంటాయి. ఇంతకుముందు కోడిట్ట ఇడంగళ్‌ నిరంబుగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పార్తీపన్‌ చిన్న గ్యాప్‌ తరువాత ఇప్పుడు ఒత్త సెరుప్పు (ఒంటి చెప్పు) అంటూ వస్తానంటున్నారు. ఈ తాజా చిత్రం గురించి ఆయన తెలుపుతూ సాధారణ, విభిన్నం అంటూ తన చిత్రాల గురించి తారుమారుగా తానూ ఊహించని విధంగా అంచనాలు ఏర్పడుతున్నాయన్నారు. అలాంటి అంచనాలను పూర్తి చేయడానికి తానూ శ్రమిస్తున్నానన్నారు.

కాపీ కొట్టకుండా సొంత ఆలోచనలతో ప్రేక్షకులను అలరించే విధంగా విభిన్నంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఒత్త సెరుప్పు సైజ్‌–7 అని చెప్పారు. ఈ ఒక్క చెప్పు అందరి ప్రశంసలు అందుకునేలా ఉంటుందని అన్నారు. ఇకపోతే ఈ చెప్పుకు జోడీ చెప్పు ఏదీ? అది ఎవరు? సైజ్‌–7 ఏమిటీ? లాంటి వివరాలను తెలిపే తరుణం త్వరలోనే వస్తుందని అన్నారు. ఇది చాలా తక్కువ సమయంలో రూపొందిస్తున్న చిత్రం అని చెప్పారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాగైనా ఓట్లు పొందాలన్న కాంక్షతో స్వగౌరవాన్ని పక్కన పెట్టి, మర్యాద వంటి వాటికి నీళ్లొదిలి కూటమి ఏర్పరచుకుంటున్న వారి మాదిరిగా కాకుండా ఈ చిత్రానికి తాను ఏర్పాటు చేసుకున్న కూటమి విజయం సాధించడం ఖాయం అన్నారు. దీనికి సంగీతాన్ని సంతోష్‌నారాయణన్, ఛాయాగ్రహణను రాంజీ అందిస్తున్నారని చెప్పారు. 39 సెకన్ల నిడివితో కూడిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్, టీజర్‌లను ఇటీవలే నటుడు విజయ్‌సేతుపతి చేతుల మీదగా ఆవిష్కరించగా మంచి స్పందన వస్తోందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలోనే మీ ముందుకు వస్తానని పార్తీపన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement