పైరసీ చట్టబద్ధం చేయాలి
చిత్ర పరిశ్రమను కృంగదీస్తున్న వాటిలో పైరసీ ప్రధానమైంది. అలాంటి పైరసీని చట్టబద్ధం చేయాలంటున్నారు యువ నిర్మాత సురేశ్ కామాక్షి. లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం పకిరి. ప్రభురణవీరన్, శార్వియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇసక్కీకార్వన్నర్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు, శాసనసభ సభ్యుడు కరుణాస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ఆర్‌కేవీ.స్టూడియోలో జరిగింది.ఈ చిత్ర ఆడియోను దర్శకుడు వసంతబాలన్ ఆవిష్కరించగా చాయాగ్రాహకుడు చెళియన్ తొలి సీడీని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న యువ నిర్మాత సురేశ్‌కామాక్షీ మాట్లాడుతూ ఇవాళ చిత్ర పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. చిన్న చిత్రాలకు ఏకైక నమ్మకం ప్రచార మాధ్యమాలన్నారు. అయితే అలాంటి పత్రికల్లో రివ్యూలు ప్రచారమయ్యే వరకు కూడా థియేటర్లలో చిత్రాలు ఉండడం లేదన్నారు. థియేటర్ల యాజమాన్యం ప్రేక్షకులు సినిమాలు చూడడానికి రావడం లేదంటున్నారన్నారు. ఇవాళ ఒక కుటుంబం థియేటర్‌లో చిత్రం చూడాలంటే కనీసం రూ.2వేలు ఖర్చు అవుతుందన్నారు.
సినిమా టికెట్ వెల కంటే పార్కింగ్ ధర అధికం అవుతుందని పేర్కొన్నారు.ఉదయం,మధ్యాహ్నం క్యాంటీన్లలో వ్యాపారం లేక పోతే చిత్రాలను తీసేస్తున్నారని ఆరోపించారు. క్యాంటీన్ల వ్యాపారం కోసం నిర్మాత కష్టపడి సినిమాలు తీయాలా అని ప్రశ్నించారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు ఎలా వస్తారని ప్రశ్నించారు. నిజానికి ప్రేక్షకులు సినిమాలు చూడకుండా ఉండటం లేదన్నారు.పైరసీ సీడీలను కొనుక్కుని,ఇంటర్నెట్‌లో డబ్బు వెచ్చించి సినిమాలు చూస్తున్నారన్నారు.ఆ ఆదాయాన్ని నిర్మాతలు ఎందుకు కోల్పోవాలి అని ప్రశ్నించారు. దొంగ సారాను అరికట్టడానికి టాస్మాక్‌ను తీసుకొచ్చినట్లు పైరసీని అరికట్టడానికి దాన్ని చట్టబద్ధం చేయాలనే అభిప్రాయాన్ని సురేశ్‌కామాక్షి వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే విడుదలైన చిత్రాలకు థియేటర్లలో మార్నింగ్‌షో కూడా ఫుల్ కావడం లేదని, అందులో నటించిన కథానాయకులు మాత్రం కోట్ల రూపాయల పారితోషికాలను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విధానాల్లో మార్పు రావాలని ఆయన అన్నారు.