‘దయచేసి ఆయన ఫొటోలను పోస్ట్ చేయకండి’
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంపై మరో నటుడు టీవీ యాక్టర్ కిరణ్ కర్మాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయవద్దని, వాటి వల్ల ఆయన బాధపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆన్‌లైన్‌లో ఆస్పత్రిలో ఉన్న వినోద్ ఖన్నా ఫొటో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యం క్షీణించి, సన్నబడిపోయిన దేహంతో ఆస్పత్రి దుస్తులతోనే కుమారుడు, భార్యతో ఆ ఫొటో దర్శనం ఇస్తోంది.
ఈ ఫొటో చూసినవారికి ఆయనపై జాలి కలిగేలా ఉంది. దీంతో కిరణ్ కర్మాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘దయచేసి ఖన్నా ఫొటోలను పోస్టింగ్ చేయడం ఆపండి. ఆయనను అభిమానులు దయచేసి బాధపెట్టవద్దు. ఆయన మనందరికి ప్రియమైన హీరో. ఆయనను అలా ఉండనివ్వండి. వైద్య సేవలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన ఫొటోలను పెట్టకండి’ అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.