
సన్నీ డియోల్ పై కేసు నమోదు
లక్నో: బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్ పై తాజాగా కేసు నమోదైంది. దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రూపొందుతున్న 'మోహల్లా అస్సీ' చిత్రంలో కొన్ని అభ్యంతకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ సామాజిక స్వచ్ఛంద సంస్థ సర్వజన్ జాగృతి సంతష్ట ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారణాసి పోలీసులు దర్శకుడితో పాటు సన్నీ డియోల్ పై కేసు నమోదు చేశారు.
ఈ చిత్రంలోని సన్నివేశాలు కొన్ని మతాల సెంటిమెంట్లను ప్రభావితం చేసేవిగా ఉండటమే కాకుండా, నైతిక విలువలకు తీవ్ర విఘాతం కల్గిస్తుందంటూ ఆ సంస్థ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తరహా సినిమాలు విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరారు. 'కాశీ కా అస్సీ' నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు ఆరోపణలు ఎదుర్కోవడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్ ఆర్థడాక్స్ మత పెద్దగా కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి భార్యగా సాక్షి తన్వర్ నటిస్తోంది.