Mohalla Assi
-
సినిమా విడుదలపై ఆగస్టు 25 వరకు స్టే పొడిగింపు
బాలీవుడ్ సినిమా 'మొహల్లా అస్సీ' విడుదలపై ఉన్న స్టేను ఆగస్టు 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సన్నీ డియోల్ నటించిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమా విషయంలో తలెత్తిన అభ్యంతరాల గురించి ఏమంటారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అభిప్రాయాన్ని కోర్టు కోరింది. ఈ సినిమా గానీ, దాని ట్రైలర్ గానీ ఆన్లైన్లో కూడా విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. మతపరమైన సెంటిమెంట్లను ఈ సినిమా దెబ్బతీస్తోందని పిటిషన్లో ఆరోపించారు. వాస్తవానికి సినిమా ఈనెల 3వ తేదీనే విడుదల కావల్సి ఉంది. వారణాసిలో గంగానది ఒడ్డున గల అస్సీ ఘాట్ పరిసరాల చుట్టూనే ఈ సినిమా ఉంటుందన్న విషయాన్ని ట్రైలర్లో చూపించారు. అయితే ఈ ట్రైలర్లో పాత్రలు ఉపయోగించిన భాష అత్యంత అసభ్యంగా ఉందని కోర్టు భావించింది. ఒక సన్నివేశంలో శివుడి పాత్ర ధరించిన వ్యక్తి కూడా ఇలాంటి అసభ్య భాష ఉపయోగిస్తారు. -
హీరోపై మరో కేసు నమోదు
పాట్నా: బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్పై తాజాగా మరో కేసు నమోదైంది. దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మోహల్లా అస్సీ' చిత్రంలో సన్నివేశాలు హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది ఓజా బీహార్లోని పాట్నా అడిషినల్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ చిత్రంలోని హీరో, దర్శకుడు, కథ రచయితతోపాటు ఇతర పాత్రధారులపై కూడా కేసులు నమోదు చేయాలని పాట్నా అడిషినల్ చీఫ్ మేజిస్ట్రేట్ రామచంద్ర ప్రసాద్ పోలీసులను శనివారం ఆదేశించారు. దాంతో సన్నీడియోల్, చిత్ర దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేదితోపాటు కథ రచయిత కాశీనాథ్ సింగ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే మోహల్లా అస్సీ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ సామాజిక స్వచ్ఛంద సంస్థ సర్వజన్ జాగృతి సంతష్ట గత నెల జూన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పోలీసులు దర్శకుడితో పాటు సన్నీ డియోల్ పై కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ చిత్రం కాశీ కా అస్సీ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ సంప్రదాయ మత పెద్దగా కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి భార్యగా సాక్షి తన్వర్ నటిస్తోంది. -
'మొహల్లా అస్సీ' విడుదలపై స్టే
న్యూఢిల్లీ:కాశీ కా అస్సీ నవల ఆధారంగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రూపొందుతున్న 'మొహల్లా అస్సీ' చిత్రం విడుదలపై సివిల్ కోర్టు స్టే విధించింది. ఆ చిత్రంలో అసభ్యకరమైన సన్నివేశాలున్నాయన్న ఢిల్లీకి చెందిన గుల్షన్ కుమార్ కోర్టులో పిటిషన్ తో ఏకీభవించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం ఆ చిత్ర విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు చిత్ర ట్ర్రైలర్ ను చూసిన అనంతరం జడ్జి కిషోర్ కుమార్ తన తీర్పును వెలువరించారు. ఒక మతాన్ని కించపరుస్తూ చిత్రంలోని సన్నివేశాలపై కోర్టు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలు తొలగించే వరకూ విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు పేర్కొంది. పరమశివుడ్ని కించపరుస్తూ చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పిటిషనర్ సలహాదారు సచిన్ మిశ్రా తెలిపారు. వారణాసిలో ఉన్న అస్సి ఘాట్ రూపొందిన ఈ చిత్రం జూలై 3 వ తేదీన విడుదల కావాల్సి ఉంది. -
సన్నీ డియోల్ పై కేసు నమోదు
లక్నో: బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్ పై తాజాగా కేసు నమోదైంది. దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రూపొందుతున్న 'మోహల్లా అస్సీ' చిత్రంలో కొన్ని అభ్యంతకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ సామాజిక స్వచ్ఛంద సంస్థ సర్వజన్ జాగృతి సంతష్ట ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారణాసి పోలీసులు దర్శకుడితో పాటు సన్నీ డియోల్ పై కేసు నమోదు చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు కొన్ని మతాల సెంటిమెంట్లను ప్రభావితం చేసేవిగా ఉండటమే కాకుండా, నైతిక విలువలకు తీవ్ర విఘాతం కల్గిస్తుందంటూ ఆ సంస్థ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తరహా సినిమాలు విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరారు. 'కాశీ కా అస్సీ' నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు ఆరోపణలు ఎదుర్కోవడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్ ఆర్థడాక్స్ మత పెద్దగా కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి భార్యగా సాక్షి తన్వర్ నటిస్తోంది.