
సినిమా విడుదలపై ఆగస్టు 25 వరకు స్టే పొడిగింపు
బాలీవుడ్ సినిమా 'మొహల్లా అస్సీ' విడుదలపై ఉన్న స్టేను ఆగస్టు 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సన్నీ డియోల్ నటించిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమా విషయంలో తలెత్తిన అభ్యంతరాల గురించి ఏమంటారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అభిప్రాయాన్ని కోర్టు కోరింది.
ఈ సినిమా గానీ, దాని ట్రైలర్ గానీ ఆన్లైన్లో కూడా విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. మతపరమైన సెంటిమెంట్లను ఈ సినిమా దెబ్బతీస్తోందని పిటిషన్లో ఆరోపించారు. వాస్తవానికి సినిమా ఈనెల 3వ తేదీనే విడుదల కావల్సి ఉంది. వారణాసిలో గంగానది ఒడ్డున గల అస్సీ ఘాట్ పరిసరాల చుట్టూనే ఈ సినిమా ఉంటుందన్న విషయాన్ని ట్రైలర్లో చూపించారు. అయితే ఈ ట్రైలర్లో పాత్రలు ఉపయోగించిన భాష అత్యంత అసభ్యంగా ఉందని కోర్టు భావించింది. ఒక సన్నివేశంలో శివుడి పాత్ర ధరించిన వ్యక్తి కూడా ఇలాంటి అసభ్య భాష ఉపయోగిస్తారు.