
'మొహల్లా అస్సీ' విడుదలపై స్టే
న్యూఢిల్లీ:కాశీ కా అస్సీ నవల ఆధారంగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రూపొందుతున్న 'మొహల్లా అస్సీ' చిత్రం విడుదలపై సివిల్ కోర్టు స్టే విధించింది. ఆ చిత్రంలో అసభ్యకరమైన సన్నివేశాలున్నాయన్న ఢిల్లీకి చెందిన గుల్షన్ కుమార్ కోర్టులో పిటిషన్ తో ఏకీభవించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం ఆ చిత్ర విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు చిత్ర ట్ర్రైలర్ ను చూసిన అనంతరం జడ్జి కిషోర్ కుమార్ తన తీర్పును వెలువరించారు. ఒక మతాన్ని కించపరుస్తూ చిత్రంలోని సన్నివేశాలపై కోర్టు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలు తొలగించే వరకూ విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు పేర్కొంది. పరమశివుడ్ని కించపరుస్తూ చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పిటిషనర్ సలహాదారు సచిన్ మిశ్రా తెలిపారు. వారణాసిలో ఉన్న అస్సి ఘాట్ రూపొందిన ఈ చిత్రం జూలై 3 వ తేదీన విడుదల కావాల్సి ఉంది.