తుపాకీ పోగొట్టుకున్న పోలీస్ పాపారావు | 'Police Paparao' audio released | Sakshi
Sakshi News home page

తుపాకీ పోగొట్టుకున్న పోలీస్ పాపారావు

Published Thu, Oct 31 2013 12:25 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

తుపాకీ పోగొట్టుకున్న పోలీస్ పాపారావు - Sakshi

తుపాకీ పోగొట్టుకున్న పోలీస్ పాపారావు

అరకు ప్రాంతంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ అతను. ప్రమోషన్ వచ్చేసి ఏకంగా ఎస్.ఐ అయిపోయాడు. ఈ పోలీస్‌గారు వృత్తిలో భాగంగా తన తుపాకీని పోగొట్టుకుంటాడు. దాన్ని తిరిగి ఎలా సంపాదించుకున్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘పోలీస్ పాపారావు’. నటుడు శివాజీరాజా ఇందులో కథానాయకుడు. నిర్దేశ్ నెర్స్ దర్శకుడు. సునీతా శ్రీనివాసరావు బొమ్మి నిర్మాత. తారకరామారావు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కేఎస్ రామారావు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరో శ్రీకాంత్‌కి అందించారు.
 
వీరితో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న పరుచూరి బ్రదర్స్, మురళీమోహన్, ముత్యాల సుబ్బయ్య, సి.కల్యాణ్, సాయికుమార్, తరుణ్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ తయారు చేసుకోగానే మేం ముందు కలిసింది రావికొండలరావుగారిని. ఆయన కథ విని కథానాయకునిగా శివాజీరాజా పేరును సూచించారు. శివాజీరాజాగారు కూడా ‘ఓకే’ అనడం, ముప్ఫై రోజుల్లో షూటింగ్ చేసేయడం అంతా చకచకా జరిగిపోయింది. 
 
 ఇందులో రెండే పాటలుంటాయి. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. వినోదంతో పాటు ఉత్కంఠను కూడా కలిగించే ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని శివాజీరాజా నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో నిర్మాతగా మారడం పట్ల సునీతా శ్రీనివాసరావు సంతోషం వెలిబుచ్చారు. నవీనా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: రావికొండలరావు, కెమెరా: చంద్రశేఖర్, ఎడిటింగ్: విజయానంద్ వడిగి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement