Sivajiraja
-
ఆఖరి ఓటు వేసిన అల్లరి నరేష్
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు (మా) పోలింగ్ ముగిసింది. ‘మా’ లో మొత్తం 745 మంది సభ్యులు ఉండగా, కేవలం 472 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా... హీరో అల్లరి నరేష్ ఆఖరిగా ఓటు వేయడంతో పోలింగ్ ముగిసింది. రాత్రి 8గంటలకల్లా ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి ‘మా’ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీనియర్ నటులు శివాజీరాజా, నరేశ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సవాళ్లు.. ప్రతిసవాళ్లు, ఆరోపణలు.. ప్రత్యారోపణలతో పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. చదవండి...(‘మా’ హీరో ఎవరు?) -
అలా డైరెక్టర్ అయ్యాను
‘‘ప్రసాద్‌గారికి ‘నటన’ కథ చెప్పాను. నచ్చింది కానీ, నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నారు. అలా నేను డైరెక్టర్ అయ్యాను. లీడ్ క్యారెక్టర్‌కి భానుచందర్‌గారి పేరుని నిర్మాతగారే చెప్పారు. ఆయన్ని కలవగానే సినిమా చేయడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్. జీవితం గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అని డైరెక్టర్ భారతీబాబు పెనుపాత్రుని అన్నారు. మహిధర్, శ్రావ్యారావు జంటగా భవిరిశెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మీ సమర్పణలో గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నటన’. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నటులు శివాజీరాజా, భానుచందర్ విడుదల చేశారు. కుబేర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నటన’ గురించి విడుదల తర్వాత ప్రేక్షకులు మాట్లాడితే బావుంటుందని నా అభిప్రాయం. భారతీబాబు చక్కగా తెరకెక్కించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఓ పాటని పాడి, సంగీతం అందించాను. మంచి స్పందన వస్తోంది’’ అన్నారు ఎం.ఎం.శ్రీలేఖ. ‘‘చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు భానుచందర్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు ప్రవీణ్, నటుడు కాశీ విశ్వనాథ్, గురుచరణ్, రఘు, మహిధర్, శ్రావ్యారావు తదితరులు పాల్గొన్నారు. -
తుపాకీ పోగొట్టుకున్న పోలీస్ పాపారావు
అరకు ప్రాంతంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ అతను. ప్రమోషన్ వచ్చేసి ఏకంగా ఎస్.ఐ అయిపోయాడు. ఈ పోలీస్గారు వృత్తిలో భాగంగా తన తుపాకీని పోగొట్టుకుంటాడు. దాన్ని తిరిగి ఎలా సంపాదించుకున్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘పోలీస్ పాపారావు’. నటుడు శివాజీరాజా ఇందులో కథానాయకుడు. నిర్దేశ్ నెర్స్ దర్శకుడు. సునీతా శ్రీనివాసరావు బొమ్మి నిర్మాత. తారకరామారావు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కేఎస్ రామారావు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరో శ్రీకాంత్‌కి అందించారు. వీరితో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న పరుచూరి బ్రదర్స్, మురళీమోహన్, ముత్యాల సుబ్బయ్య, సి.కల్యాణ్, సాయికుమార్, తరుణ్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ తయారు చేసుకోగానే మేం ముందు కలిసింది రావికొండలరావుగారిని. ఆయన కథ విని కథానాయకునిగా శివాజీరాజా పేరును సూచించారు. శివాజీరాజాగారు కూడా ‘ఓకే’ అనడం, ముప్ఫై రోజుల్లో షూటింగ్ చేసేయడం అంతా చకచకా జరిగిపోయింది. ఇందులో రెండే పాటలుంటాయి. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. వినోదంతో పాటు ఉత్కంఠను కూడా కలిగించే ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని శివాజీరాజా నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో నిర్మాతగా మారడం పట్ల సునీతా శ్రీనివాసరావు సంతోషం వెలిబుచ్చారు. నవీనా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: రావికొండలరావు, కెమెరా: చంద్రశేఖర్, ఎడిటింగ్: విజయానంద్ వడిగి.