
విశాల్ ఇంటి ముందు పోలీసులు
తమిళనాడు, పెరంబూరు: నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇంటికి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే విధంగా నగరంలో ఇరుంబుతిరై చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వివరాలు.. నటుడు విశాల్ కథానాయకుడిగా నటించి, సొంతంగా నిర్మించిన చిత్రం ఇరుంబుతిరై. నటి సమంత కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి పీఎస్.మిత్రన్ దర్శకుడు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.
ఈ చిత్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా పథకాన్ని, జీఎస్టీ పన్ను విధానాన్ని విమర్శించే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, వెంటనే ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలని హిందూ మరుమలర్చి మున్నేట్ర మున్నాని తరఫున చిత్ర వర్గాలను కోరారు. అయితే ఆ సన్నివేశాలను తొలగించకుండానే ఇరుంబుతిరై చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర వర్గాలు సిద్ధంకావడంతో విశాల్ ఇంటిని చుట్టు ముట్టి ఆందోళన చేస్తామని, అదేవిధంగా చిత్రం పదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని హిందూ మరుమలర్చి మన్నేట్ర మన్నాని నిర్వాహకులు హెచ్చరించారు. వారి హెచ్చరికలను భేఖాతరు చేసి ఇరుంబతిరై చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. దీంతో హిందూ సంఘాల కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా నటుడు విశాల్ ఇంటి వద్ద, ఇరంబుతిరై చిత్రం ప్రదర్శిస్తున్న స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్, ఇనాక్స్, అభిరామి, ఉదయం, దేవీ, సంగం తదితర థియేటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment