
పూజా హెగ్డే
ఆ రోజు చిట్టిబాబు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఓ పాట పాడాలనుకున్నాడు. రెచ్చిపోయి స్టెప్పులు వేయాలనుకున్నాడు. చిట్టిబాబుకి ‘సై’ చెప్పింది అందాల భామ. ఈ ఇద్దరూ చిందులేస్తుంటే ఊరుకోలేక మరికొంతమంది కాలు కదిపారు. ‘రంగస్థలం’ సినిమాకి ఈ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్. ఇంతకీ చిట్టిబాబు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో రామ్‌చరణ్ క్యారెక్టర్ పేరిది. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్, పూజా హెగ్డే పాల్గొనగా ఓ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు.
ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేశారు. సోమవారం మొదలైన ఈ పాట చిత్రీకరణకు మొత్తం ఐదు రోజులు పడుతుంది. రామ్‌చరణ్, పూజా హెగ్డేలతో పాటు 200 మంది డ్యాన్సర్లు ఈ పాటకు స్టెప్స్ వేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ జానీ స్టెప్స్ సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కోసం రాజమండ్రిలో రెండు పాటలు చిత్రీకరించారు. ఒక్కో పాటకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. ఇప్పుడు తీస్తున్న స్పెషల్ సాంగ్‌కి కూడా అంతే అవుతుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ పాటతో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. 1985 నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్‌చరణ్ లుక్, టీజర్‌కి మంచి స్పందన లభించింది. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment