మరోసారి ఖుషీ ఖుషీగా...
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు ఎస్‌జె సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో ‘కొమరం పులి’ వంటి డిఫరెంట్ చిత్రం వచ్చింది. 2001 ఏప్రిల్ 27న ‘ఖుషి’ విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత, ‘ఖుషి’ విడుదలైన రోజునే వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా ప్రారంభమైంది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా హైదరాబాద్‌లోని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కార్యాలయంలో బుధవారం ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిపారు. ముహూర్తపు సన్నివేశానికి ఎడిటర్ గౌతమ్‌రాజు కెమేరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకుడు ఎస్‌జె సూర్య గౌరవ దర్శకత్వం వహించారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు.
నాలుగు నెలలుగా వర్క్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారాయన. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తి చేశారు. ‘బిల్లా’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాలకు పనిచేసిన సౌందర్ రాజన్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఫ్యాక్షన్ లీడర్ లవ్‌స్టోరీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ జూన్‌లో ప్రారంభించనున్నాం. హీరోయిన్, చిత్రం టైటిల్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని తెలిపారు.