అలాంటి పాత్రల వల్ల హీరోయిన్లకు లాభం లేదు!
‘‘నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామరస్ రోల్ చేయడానికి నేను రెడీ. కానీ, తెలుగు పరిశ్రమలో నాకు ఎక్కువగా ఆఫ్ బీట్ పాత్రలే వస్తున్నాయి. ఒకటీ, రెండు అయితే అలాంటివి చేయొచ్చు. అలాగే ఐటమ్ సాంగ్స్ కూడా ఒకటీ, రెండైతే ఫర్వాలేదు కానీ.. వరుసగా చేయలేను’’ అని పూనమ్ బజ్వా అన్నారు. సిద్ధార్థ్, త్రిష, హన్సిక కాంబినేషన్‌లో ఆమె నటించిన ‘కళావతి’ ఈ నెల 29న విడుదల కానుంది. సుందర్ సి. దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్‌మణై 2’ని ‘కళావతి’ పేరుతో గుడ్ సినిమా గ్రూప్ అనువదించింది. ఈ చిత్రం గురించి, ఇతర విశేషాలను పూనమ్ ఈ విధంగా పంచుకున్నారు.
♦ నాలుగు పాటలు, రెండు రొమాంటిక్ సన్నివేశాలు, ఓ లవ్ ట్రాక్ ఉన్న సినిమాల్లో నటించడం వల్ల హీరోయిన్లకు ఎటువంటి లాభం లేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తేనే గుర్తింపు ఉంటుంది. అటువంటి పాత్రలే నేను అంగీకరిస్తున్నా. ‘కళావతి’లో నా పాత్ర ఆ కోవకి చెందినదే. ఇందులో నాది నర్సు పాత్ర. హీరోయిన్‌గా మంచి మార్కులు పడాలంటే సుందర్.సి దర్శకత్వంలో నటించాల్సిందే. ఇందులో సిద్ధార్థ్‌కి, నాకూ మంచి సీన్లు, ఓ పాట ఉన్నాయి. నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో ఉన్నప్పటికీ ఎవరి ప్రాధాన్యం వారికి ఉంటుంది.
నాకు చీకటన్నా, దెయ్యాలన్నా భయం. చిత్రీకరణలో పాల్గొన్నప్పుడు యూనిట్ సభ్యులు ఉంటారు కాబట్టి, ధైర్యంగా చేసేశా. భయపెడతూ నవ్వించే చిత్రం ఇది. కాజల్, నేనూ ఒకేసారి కెరియర్ ప్రారంభించాం. కథానాయికగా ఆమెతో పోలిస్తే నేనంత కష్టపడలేదు. అయినా దక్షిణాది చిత్రాలతో నేనూ బిజీగానే ఉన్నా. నాతో పాటు కెరియర్ ప్రారంభించిన చాలామంది ఇప్పుడు కనిపించడం లేదు. తెలుగు సినిమాతో నా కెరియర్ ప్రారంభమైంది. అందుకే తెలుగంటే నాకు సెంటిమెంట్. మంచి పాత్రలొస్తే చేయడానికి రెడీ!