Kalavit
-
పాత ఇళ్లు కూలి ముగ్గురి మృతి
- ముగ్గురికి గాయాలు మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆగకుండా కురుస్తున్న వర్షానికి పలు పాత భవనాలు, ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేరు వేరు ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కొలిగడ్డవీధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో కళావతి(35), తులసి(7) అనే ఇద్దరు మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సదాశివపేట మండలంలోని ముబారక్‌పూర్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న నడ్డిమెట్టి శ్యామమ్మ(65) అనే వృద్ధురాలు మృతిచెందింది. శ్యామమ్మ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరో వైపు.. జిల్లాలోని జిన్నారం మండలం కనుకుంట గ్రామంలో ఇల్లు కూలి ఇద్దరు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. -
‘టర్కీలో మాదిరిగానే ఉద్యమిద్దాం’
ప్రభుత్వాలు తమ తప్పుల్ని కప్పి పుచ్చుకుంటూ, ఇతరులు చేసిన చిన్నపాటి తప్పుల్ని పెద్దగా చూపిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నాయని పలు సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటే అదే మద్యంపై వస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వం ఆస్వాదిస్తోందని మండిపడ్డారు. టర్కీలో మాదిరిగా ఏకతాటిపైకి వచ్చి మద్యంపై ఉద్యమం చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్థూం భవన్లో భారతజాతీయ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ), బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో ‘ప్రాణాంతక మద్యపానం, ప్రభుత్వ చర్యలు-ప్రజల బాధ్యత’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి, ర్యాపిడ్ ప్రజామార్చ్ ఛైర్మన్, ప్రముఖ న్యాయవాది జి.శారదాగౌడ్, బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు, ఎ.ఐ.పి.ఎస్.ఒ. రాష్ట్ర కార్యదర్శి కె.వి.ఎల్ మాట్లాడుతూ మద్యం మహమ్మారి వల్ల ఏటా వంద మందిలో 30మంది మహిళలు భర్తలను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 242 మద్యం దుకాణాలకు ఎవరూ టెండర్లు వేయలేదని ఆ దుకాణాల మద్యాన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లకు ఇచ్చిన దౌర్భాగ్యపు ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ ప్రొద్బలంతో నేడు పెన్నుల ద్వారా హుక్కాను సేవించి చిన్నారులు మద్యానికి బానిసలవుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా మద్యాన్ని నిషేధించేలా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడో ఒకసారి కాకుండా నిరంతరం ఉద్యమాలు, ధర్నాలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించి మద్యం దుకాణాలను మూసివేలా ఉద్యమం చేయాలన్నారు. ఖమ్మం జిల్లా ముత్తగూడెంలో ఏ విధంగా సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించారో అలాగ, రాష్ట్రమంతటా చేసేందుకు ఒక్కటై పోరాడాలని తీర్మానించారు. -
నేనే(మి) చేశాను నేరం!
ఏ బిడ్డనైనా తల్లి నవమాసాలే మోస్తుంది. ఆడపిల్ల అని ఎనిమిది నెలలు, మగపిల్లాడని తొమ్మిది నెలలు మోసి వివక్ష చూపదు. కానీ, సమాజానికి వివక్ష ఉంది. ఆడపిల్ల అని తక్కువగా చూసి ఆడపిల్లని నష్టదాయనిగా చూసి ఆడపిల్లతో ఏ లాభమూ లేదని తలచి అది తన మీద తానే ఒత్తిడి పెంచుకుంటోంది. బిడ్డ పుడుతున్నందుకు ఏ తల్లయినా సంతోషించాలి. కానీ, ఎక్కడ ఆడపిల్ల పుడుతుందోనని బెంగటిల్లడం విషాదం. పుట్టాక ఆ ఆడపిల్లను కన్న చేతులతోనే వదిలించుకోవాలనుకోవడం మహా విషాదం. కడతేర్చాలనుకోవడం పెను విషాదం. అమ్మకు ప్రాణం పోయడమే తెలుసు. మరి ప్రాణం తీసేలా చేస్తున్నది ఎవరు? ఆడపిల్లకు స్వేచ్ఛగా జన్మనివ్వలేని తల్లి... జన్మించాక స్వేచ్ఛగా జీవించలేని బుజ్జాయి... బంగారంలాంటి ఆడపిల్ల కళ్లెదుటే కనిపిస్తున్నా మగబిడ్డే కావాలనే మంకుతనంతో పసిబిడ్డ గొంతును నులిమేసే బంధువులు... తనకేం జరిగినా ఫర్వాలేదు తన వాళ్లకేమీ కాకూడదనే ఉద్దేశంతో నేరాన్ని తమ మీద వేసుకునే పిచ్చితల్లులు... ‘నిర్భయ’భారతంలో ఆడపిల్లలు అడుగడుగునా నిర్దయనే ఎదుర్కొంటున్నారనేందుకు ఉదాహరణలు. అయినా, మన సమాజం ఇలాంటి దారుణాలపై మొద్దునిద్ర నటిస్తూనే ఉంటుంది. ఇటీవల అనంతపురం జిల్లాలో ఒక తల్లి కన్నబిడ్డను కడతేర్చినట్లు వచ్చిన వార్త అలాంటిదే. ఇంతకీ ఏం జరిగిందంటే..? మార్చి 6, ఆదివారం తెల్లవారు జామున అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని ముద్దిరెడ్డిపల్లెలో కళావతి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇంట్లోనే ప్రసవం కావడంతో తల్లీ బిడ్డలను వైద్య పరీక్షల కోసం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ తల్లిని, బిడ్డను వేరు చేసి చికిత్స ప్రారంభించారు. కొద్దిసేపటికి శిశువు వద్దకు వెళ్లిన వైద్య సిబ్బందికి అటు నుంచి వెళుతూ ఎవరో ఒక మహిళ తారసపడింది. రెండడుగులు వేశాక వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. శిశువు ముక్కు, నోటి వెంట రక్తం చూసి ఏం జరిగిందో తెలియక వెంటనే వైద్యులను పిలిచారు. మధ్యాహ్నం వరకు చికిత్స చేసినా ప్రయోజనం లేకపోవడంతో అనంతపురం తీసుకువచ్చారు. అక్కడి నుంచి కర్నూలు తరలించారు. మూడు రోజులకు ఆ శిశువు కన్నుమూసింది. ఆ తల్లి గాథ కళావతిది అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కేతగానిచెరువు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో సమీప బంధువుల ఇంట్లో పెరిగింది. పెళ్లీడుకొచ్చాక ఆమెను కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా గ్యాదికుంటకు చెందిన గంగాధర్‌తో పెళ్లి జరిపించారు. అయితే, గంగాధర్‌కు అప్పటికే వివాహమైంది. మొదటి భార్య ద్వారా పిల్లలు కలగలేదు. ఈ విషయం తెలిసినా, ఇన్నాళ్లూ తనను పెంచి పెద్దచేసిన వారి మాట కాదనకుండా కళావతి పెళ్లికి సిద్ధపడింది. పెళ్లయిన ఏడాదిలోగానే ఆడబిడ్డకు (జ్యోతి, 5వ తరగతి) జన్మనిచ్చింది. తర్వాత మళ్లీ ఆడబిడ్డే (అంగన్వాడీ కేంద్రానికి వెళుతోంది) పుట్టింది. బిడ్డలిద్దరినీ గంగాధర్ మొదటి భార్య వద్దే ఉంచాడు. కొడుకు కావాలని పరితపించేవాడు. కొన్నాళ్లకు కళావతి గర్భం దాల్చి, మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. బిడ్డ అనారోగ్యంతో మృతిచెందాడు. మళ్లీ రెండేళ్లకు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం భర్త, ఆడపడుచుకు తెలియడంతో వారు సూటిపోటి మాటలతో ఆమెను మానసికంగా హింసించారు. ఇంట్లో ప్రసవమై, ఆస్పత్రికి చేరిన వేళ బిడ్డ మృతిచెందితే, ఆ పాపం తనపై వేసుకుంది. ఆ బిడ్డను ‘నువ్వు చంపలేదు’ అని మనస్సాక్షి చెబుతున్నా, ఎందుకో ఆ తల్లి ఆ నేరం తనదేనని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. వైద్యసిబ్బంది చెబుతున్న కథనం ఆస్పత్రిలోని బిడ్డను ఒక మహిళ చంపడానికి ప్రయత్నించిందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆ మహిళ కళావతి ఆడపడుచే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళావతి మాత్రం ‘లేదులేదు... మా వాళ్ల తప్పేమీ లేదు. నా బిడ్డను నేనే చంపుకున్నాను’ అని చెబుతోంది. నిజానిజాలను పక్కనపెడితే, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే బంధువుల ఇంట్లో పెరగడం... పెళ్లి జరిగి పిల్లలు పుట్టాక తనకంటూ ఒక కుటుంబం ఏర్పడిందని భావించిన ఆ తల్లి తన వాళ్లకు ఏమీ కాకూడదనే ఉద్దేశంతోనే నేరాన్ని తనపై వేసుకుంటోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కారణమేదైనా.. ఈ పాపకు ఒక్క పుట్టినరోజు కూడా జరగకుండా రోజులు నిండాయి అన్నప్రాశన కాకుండానే నూకలు చెల్లాయి కారకులెవరైనా... ఓ చిన్నారి చుక్క ఆకాశం నుంచి రాలింది రక్త సంబంధీకుల చేతుల్లోనే ఊపిరి వదిలింది కనీసం మనమైనా... ఈ నిర్భయ భారతంలో ‘నిర్దయుల’ను నిలదీద్దామా? నిర్లక్ష్యమా! వర్ధిల్లు అని నినదిద్దామా? - మహమ్మద్ మున్వర్‌బాషా తంగేటుకుంట హెబ్బార్ చక్రపాణి, అనంతపురం -
అలాంటి పాత్రల వల్ల హీరోయిన్లకు లాభం లేదు!
‘‘నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామరస్ రోల్ చేయడానికి నేను రెడీ. కానీ, తెలుగు పరిశ్రమలో నాకు ఎక్కువగా ఆఫ్ బీట్ పాత్రలే వస్తున్నాయి. ఒకటీ, రెండు అయితే అలాంటివి చేయొచ్చు. అలాగే ఐటమ్ సాంగ్స్ కూడా ఒకటీ, రెండైతే ఫర్వాలేదు కానీ.. వరుసగా చేయలేను’’ అని పూనమ్ బజ్వా అన్నారు. సిద్ధార్థ్, త్రిష, హన్సిక కాంబినేషన్లో ఆమె నటించిన ‘కళావతి’ ఈ నెల 29న విడుదల కానుంది. సుందర్ సి. దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 2’ని ‘కళావతి’ పేరుతో గుడ్ సినిమా గ్రూప్ అనువదించింది. ఈ చిత్రం గురించి, ఇతర విశేషాలను పూనమ్ ఈ విధంగా పంచుకున్నారు. ♦ నాలుగు పాటలు, రెండు రొమాంటిక్ సన్నివేశాలు, ఓ లవ్ ట్రాక్ ఉన్న సినిమాల్లో నటించడం వల్ల హీరోయిన్లకు ఎటువంటి లాభం లేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తేనే గుర్తింపు ఉంటుంది. అటువంటి పాత్రలే నేను అంగీకరిస్తున్నా. ‘కళావతి’లో నా పాత్ర ఆ కోవకి చెందినదే. ఇందులో నాది నర్సు పాత్ర. హీరోయిన్గా మంచి మార్కులు పడాలంటే సుందర్.సి దర్శకత్వంలో నటించాల్సిందే. ఇందులో సిద్ధార్థ్‌కి, నాకూ మంచి సీన్లు, ఓ పాట ఉన్నాయి. నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో ఉన్నప్పటికీ ఎవరి ప్రాధాన్యం వారికి ఉంటుంది. నాకు చీకటన్నా, దెయ్యాలన్నా భయం. చిత్రీకరణలో పాల్గొన్నప్పుడు యూనిట్ సభ్యులు ఉంటారు కాబట్టి, ధైర్యంగా చేసేశా. భయపెడతూ నవ్వించే చిత్రం ఇది. కాజల్, నేనూ ఒకేసారి కెరియర్ ప్రారంభించాం. కథానాయికగా ఆమెతో పోలిస్తే నేనంత కష్టపడలేదు. అయినా దక్షిణాది చిత్రాలతో నేనూ బిజీగానే ఉన్నా. నాతో పాటు కెరియర్ ప్రారంభించిన చాలామంది ఇప్పుడు కనిపించడం లేదు. తెలుగు సినిమాతో నా కెరియర్ ప్రారంభమైంది. అందుకే తెలుగంటే నాకు సెంటిమెంట్. మంచి పాత్రలొస్తే చేయడానికి రెడీ! -
వైద్యం అందక నిండు గర్భిణి మృతి
తూర్పుగోదావరి జిలా రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ నిండు గర్భిణి వైద్యం అందక కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కళావతికి నెలలు నిండాయి. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయం నొప్పులు వస్తుండటంతో ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో.. శనివారం ఒక్కరు కూడా లేరు.. దీంతో స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ చేసింది. అనంతరం కళావతి చనిపోయినట్టు ఆమె భర్త, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందక పోవడం వల్లే కళావతి చనిపోయిందని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
బాక్సైట్ ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఐక్య కార్యచారణ కమిటీ ఏర్పాటైంది. ఆదివారం విశాఖలోని ఎంవీపీ కాలనీ ప్రాంతంలోని గిరిజన భవన్లో వివిధ ఆదివాసీ సంఘాలు, గిరిజన మేథావులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కెడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, పి.రాజన్నదొర, రాజేశ్వరి, కళావతి తదితరులు సమావేశమయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు గ్రామసభ ఆమోదాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని తీర్మానించారు. తవ్వకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని తీర్మానించారు.