నేనే(మి) చేశాను నేరం!
ఏ బిడ్డనైనా తల్లి నవమాసాలే మోస్తుంది. ఆడపిల్ల అని ఎనిమిది నెలలు, మగపిల్లాడని తొమ్మిది నెలలు మోసి వివక్ష చూపదు. కానీ, సమాజానికి వివక్ష ఉంది. ఆడపిల్ల అని తక్కువగా చూసి ఆడపిల్లని నష్టదాయనిగా చూసి ఆడపిల్లతో ఏ లాభమూ లేదని తలచి అది తన మీద తానే ఒత్తిడి పెంచుకుంటోంది. బిడ్డ పుడుతున్నందుకు ఏ తల్లయినా సంతోషించాలి. కానీ, ఎక్కడ ఆడపిల్ల పుడుతుందోనని బెంగటిల్లడం విషాదం. పుట్టాక ఆ ఆడపిల్లను కన్న చేతులతోనే వదిలించుకోవాలనుకోవడం మహా విషాదం. కడతేర్చాలనుకోవడం పెను విషాదం. అమ్మకు ప్రాణం పోయడమే తెలుసు. మరి ప్రాణం తీసేలా చేస్తున్నది ఎవరు?
ఆడపిల్లకు స్వేచ్ఛగా జన్మనివ్వలేని తల్లి... జన్మించాక స్వేచ్ఛగా జీవించలేని బుజ్జాయి... బంగారంలాంటి ఆడపిల్ల కళ్లెదుటే కనిపిస్తున్నా మగబిడ్డే కావాలనే మంకుతనంతో పసిబిడ్డ గొంతును నులిమేసే బంధువులు... తనకేం జరిగినా ఫర్వాలేదు తన వాళ్లకేమీ కాకూడదనే ఉద్దేశంతో నేరాన్ని తమ మీద వేసుకునే పిచ్చితల్లులు... ‘నిర్భయ’భారతంలో ఆడపిల్లలు అడుగడుగునా నిర్దయనే ఎదుర్కొంటున్నారనేందుకు ఉదాహరణలు. అయినా, మన సమాజం ఇలాంటి దారుణాలపై మొద్దునిద్ర నటిస్తూనే ఉంటుంది. ఇటీవల అనంతపురం జిల్లాలో ఒక తల్లి కన్నబిడ్డను కడతేర్చినట్లు వచ్చిన వార్త అలాంటిదే. ఇంతకీ ఏం జరిగిందంటే..?
మార్చి 6, ఆదివారం తెల్లవారు జామున అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని ముద్దిరెడ్డిపల్లెలో కళావతి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇంట్లోనే ప్రసవం కావడంతో తల్లీ బిడ్డలను వైద్య పరీక్షల కోసం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ తల్లిని, బిడ్డను వేరు చేసి చికిత్స ప్రారంభించారు. కొద్దిసేపటికి శిశువు వద్దకు వెళ్లిన వైద్య సిబ్బందికి అటు నుంచి వెళుతూ ఎవరో ఒక మహిళ తారసపడింది. రెండడుగులు వేశాక వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. శిశువు ముక్కు, నోటి వెంట రక్తం చూసి ఏం జరిగిందో తెలియక వెంటనే వైద్యులను పిలిచారు. మధ్యాహ్నం వరకు చికిత్స చేసినా ప్రయోజనం లేకపోవడంతో అనంతపురం తీసుకువచ్చారు. అక్కడి నుంచి కర్నూలు తరలించారు. మూడు రోజులకు ఆ శిశువు కన్నుమూసింది.
ఆ తల్లి గాథ
కళావతిది అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కేతగానిచెరువు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో సమీప బంధువుల ఇంట్లో పెరిగింది. పెళ్లీడుకొచ్చాక ఆమెను కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా గ్యాదికుంటకు చెందిన గంగాధర్‌తో పెళ్లి జరిపించారు. అయితే, గంగాధర్‌కు అప్పటికే వివాహమైంది. మొదటి భార్య ద్వారా పిల్లలు కలగలేదు. ఈ విషయం తెలిసినా, ఇన్నాళ్లూ తనను పెంచి పెద్దచేసిన వారి మాట కాదనకుండా కళావతి పెళ్లికి సిద్ధపడింది.
పెళ్లయిన ఏడాదిలోగానే ఆడబిడ్డకు (జ్యోతి, 5వ తరగతి) జన్మనిచ్చింది. తర్వాత మళ్లీ ఆడబిడ్డే (అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతోంది) పుట్టింది. బిడ్డలిద్దరినీ గంగాధర్ మొదటి భార్య వద్దే ఉంచాడు. కొడుకు కావాలని పరితపించేవాడు. కొన్నాళ్లకు కళావతి గర్భం దాల్చి, మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. బిడ్డ అనారోగ్యంతో మృతిచెందాడు. మళ్లీ రెండేళ్లకు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం భర్త, ఆడపడుచుకు తెలియడంతో వారు సూటిపోటి మాటలతో ఆమెను మానసికంగా హింసించారు. ఇంట్లో ప్రసవమై, ఆస్పత్రికి చేరిన వేళ బిడ్డ మృతిచెందితే, ఆ పాపం తనపై వేసుకుంది. ఆ బిడ్డను ‘నువ్వు చంపలేదు’ అని మనస్సాక్షి చెబుతున్నా, ఎందుకో ఆ తల్లి ఆ నేరం తనదేనని పోలీసుల ఎదుట ఒప్పుకుంది.
వైద్యసిబ్బంది చెబుతున్న కథనం
ఆస్పత్రిలోని బిడ్డను ఒక మహిళ చంపడానికి ప్రయత్నించిందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆ మహిళ కళావతి ఆడపడుచే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళావతి మాత్రం ‘లేదులేదు... మా వాళ్ల తప్పేమీ లేదు. నా బిడ్డను నేనే చంపుకున్నాను’ అని చెబుతోంది. నిజానిజాలను పక్కనపెడితే, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే బంధువుల ఇంట్లో పెరగడం... పెళ్లి జరిగి పిల్లలు పుట్టాక తనకంటూ ఒక కుటుంబం ఏర్పడిందని భావించిన ఆ తల్లి తన వాళ్లకు ఏమీ కాకూడదనే ఉద్దేశంతోనే నేరాన్ని తనపై వేసుకుంటోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
కారణమేదైనా.. ఈ పాపకు ఒక్క పుట్టినరోజు కూడా జరగకుండా రోజులు నిండాయి అన్నప్రాశన కాకుండానే నూకలు చెల్లాయి కారకులెవరైనా... ఓ చిన్నారి చుక్క ఆకాశం నుంచి రాలింది రక్త సంబంధీకుల చేతుల్లోనే ఊపిరి వదిలింది కనీసం మనమైనా... ఈ నిర్భయ భారతంలో ‘నిర్దయుల’ను నిలదీద్దామా? నిర్లక్ష్యమా! వర్ధిల్లు అని నినదిద్దామా?
- మహమ్మద్ మున్వర్‌బాషా
తంగేటుకుంట హెబ్బార్ చక్రపాణి, అనంతపురం