
లక్ష్మీదేవి కనకాల
రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్‌కి నటనలో మెళకువలు నేర్పించిన లక్ష్మీదేవి కనకాల ఇక లేరు. శనివారం హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. కళలంటే లక్ష్మీదేవికి అభిమానం. ప్రముఖ నాటకోద్యమ కర్త ఎ.ఆర్. కృష్ణ వద్ద శిక్షణ పొందారామె. ఎ.ఆర్. కృష్ణ ఆమెతో ‘కన్యాశుల్కం’ నాటకంలో బుచ్చమ్మ పాత్ర చేయించారు. అనంతరం సాంగ్ మరియు డ్రామా డివిజన్‌లో పని చేసిన లక్ష్మీదేవికి దేవదాస్ కనకాల పరిచయమయ్యారు. 1971లో దేవదాస్‌ను పెళ్లాడారామె.
వివాహం తర్వాత లక్ష్మీ దేవి కూడా నటీనటులకు శిక్షణ ఇచ్చే లñ క్చరర్‌గా దేవదాస్ శిక్షణ ఇస్తున్న మద్రాస్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాపించిన ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఆ సమయానికి నటుడు రాజేంద్రప్రసాద్ మొదటి సంవత్సరం, రజనీకాంత్ రెండో బ్యాచ్‌లో శిక్షణ పొందుతున్నారు. చిరంజీవి ఆమెకు ఐదో బ్యాచ్ విద్యార్థి. ఆ తర్వాత కొంత కాలానికి భర్త దేవదాస్ కనకాల స్థాపించిన ఇన్‌స్టిట్యూట్ ద్వారా నటీనటులు కావాలనుకునే అనేక మందికి శిక్షణ ఇచ్చారామె. లక్ష్మీదేవి కొన్ని సినిమాల్లోనూ నటించారు.
‘ప్రేమ బంధం’ చిత్రంలో జయప్రదకు తల్లిగా నటించారు.ఆ తర్వాత ‘ఒక ఊరి ప్రేమకథ’, ‘మాస్టారి కాపురం’, ‘పోలీస్ లాకప్’, ‘కొబ్బరి బోండాం’ చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. లక్ష్మీదేవికి ఇద్దరు సంతానం. రాజీవ్ కనకాల. శ్రీలక్ష్మీ కనకాల. రాజీవ్ కనకాల టీవీల్లో, సినిమాల్లో నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. కోడలు సుమ తిరుగు లేని యాంకర్. కుమార్తె లక్ష్మీ కనకాల టీవీ సీరియల్స్ చేస్తున్నారు. అల్లుడు పెద్ది రామారావు కూడా నాటక రంగంలో పేరున్నవారే. సినీ రచయితగా కూడా ఆయన సుపరిచితులు. లక్ష్మీదేవి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆమె నాకు సరస్వతి – చిరంజీవి
లక్ష్మీదేవి మరణం పై చిరంజీవి స్పందిస్తూ– ‘‘ఆవిడ పేరుకు లక్ష్మీదేవి అయినా నాకు సరస్వతి. ఆమె పాఠాలే నా పాఠవాలకు మూలం. ఆమె నేర్పిన మెళకువలే నటుడిగా నాకు మెలుకువలు. ఇంతమంది అభిమానుల అభిమాన కథానాయకుడిగా ఎంత గర్వపడుతున్నానో, ఆవిడ శిష్యుడిగా కూడా అంతే గర్వపడుతున్నాను. తెలుగు సినిమాతో అనుబంధం ఉన్న ప్రతి మనసుకి బరువైన క్షణాలు ఇవి. అలా బరువెక్కిన మనసుతో నా చదువులమ్మకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాను. ఆవిడ మరణం మనందరికి తీరని లోటు. కనకాల కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment