
ప్రభుదేవా కొత్త స్టెప్!
హిందీ సినీ రంగంలో దర్శకత్వంతో తెగ బిజీగా ఉన్న ప్రభుదేవా ఇప్పుడు తమిళంలో ఒక సినిమా నిర్మించనున్నారట! లక్ష్మణ్ దర్శకత్వంలో ‘జయం’ రవి నటించిన తాజా తమిళ హిట్ ‘రోమియో - జూలియట్’ చూసి, తెగ ఇంప్రెస్ అయిన ప్రభుదేవా అదే దర్శక - హీరోల కాంబినేషన్‌లో తమిళంలో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారట! ‘జయం’ రవి, విజయ్ సేతుపతి ఆ సినిమాలో నటించనున్నారు. ‘‘ప్రభుదేవా కోసం ‘రోమియో-జూలియట్’ స్పెషల్ షో వేశాం. ఆ సినిమా, అందులో దర్శకత్వ ప్రతిభ చూసి, దాన్ని వేరే భాషలో రీమేక్ చేయడానికి ప్రభుదేవా ముందుకొచ్చారు. ఇంతలో దర్శకుడు లక్ష్మణ్ కొత్త స్క్రిప్ట్ చెప్పారు. అది బాగా నచ్చి, వెంటనే ఆ స్క్రిప్ట్‌ను తానే వెండితెరపై నిర్మిస్తానని ప్రభుదేవా చెప్పారు’’అని కోడంబాకమ్ వర్గాల కథనం. మొత్తానికి, మంచి కథలు దర్శకుల్ని కూడా నిర్మాతలుగా మారుస్తాయి కదూ!