ప్రగతి యాధాటి (ఇన్ట్‌స్టాగ్రామ్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ తెర మీద తెలుగు అమ్మాయిలు అరుదే. దీనికి తెలుగు సినిమాలో హీరోయిన్లకు, వారి పాత్రలకు ఉన్న ప్రాధాన్యత కూడా ఒక కారణం. అయితే కొంత కాలంగా తెలుగులో సందేశాత్మక చిత్రాల నిర్మాణం పెరిగింది. దీంతో ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలు వెండితెర వైపు చూస్తున్నారు. నగరంలో పుట్టి పెరిగిన ప్రగతి యాధాటి... విమర్శకుల ప్రశంసలకు నోచుకున్న స్క్రీన్‌ప్లే సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.
టాలీవుడ్ తెరపై సందేశాత్మక చిత్రాల వెల్లువలో భాగంగా ‘స్క్రీన్ ప్లే’ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటికే 5 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైంది. జైపూర్‌లో నిర్వహించిన ఫిలింఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. కొన్ని అవార్డులూ దక్కించుకున్న ఈ సినిమాను మహిళా దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటిసారి హీరోయిన్‌గా చేస్తూనే నటనలో సహజత్వంతో అందరి ప్రశంసలు పొందింది ప్రగతి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన గురించిన విశేషాలు పంచుకున్నారు. ఆమె మాటల్లోనే...
న్యూయార్క్‌లో నటిగా..
చిన్నప్పటి నుంచి నటన ఇష్టం. 4 సంవత్సరాల వయసులో బాగా డాన్స్ చేసేదాన్ని. సమాజంలో ఏదైనా మార్పు కోసం ప్రయత్నించాలంటే దానికి రచన లేదా నటన ద్వారానే సాధ్యం అని నా నమ్మకం. అందుకే సినిమా రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత న్యూయార్క్‌లోని లీస్ట్ రాస్ట్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ స్కూల్‌లో 2 సంవత్సరాలు కన్సర్వేటరీ ప్రోగ్రామ్ చేశాను. దానికి ముందే ఎమ్‌సీఎస్ థియేటర్‌లో మైసినల్ టెక్నిక్‌లో శిక్షణ పొందాను. అక్కడే కొన్ని శక్తివంతమైన పాత్రల్లో నటించాను. ‘సెవన్’ అనే అవార్డ్ విన్నింగ్ డాక్యూమెంట్రీ ప్లేలో ముక్తాన్ మహి అనే పాకిస్తానీ మహిళ పాత్రలో నటించాను. అదొక సామూహిక అత్యాచారానికి గురైన మహిళ నిజ జీవిత కథ. తను ఇప్పుడు చదువు నేర్చుకొని ఒక స్కూల్ ప్రారంభించి, మహిళా విద్యకు కృషి చేస్తోంది.
ఇండియాకి తిరిగి వచ్చి..
నాన్న చనిపోవడంతో ఇండియా వచ్చేశా.. నాన్న (యాధాటి కాశీపతి) మొదటి నుంచి అభ్యుదయవాది. ఆలోచనా విధానం మార్పు కోసం తన పోరాటం, తపన నాపై చాలా ప్రభావం చూపింది. ఇండియా వచ్చాక సినిమాల్లో కొన్ని అవకాశాలుగా వచ్చినా నా ఆలోచనా విధానానికి దగ్గరగా ఉండే ఒక మంచి బలమైన కథాంశం కోసం కొన్ని కమర్షియల్ సినిమాలను రిజెక్ట్ చేశా. గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడివెడైన నేమి కరము పాలు అన్నట్టు, మంచి పాత్ర ఒక్కటి చేసినా చాలు అనుకుంటాను. అందుకే ఈ సినిమాను ఒప్పకున్నా. ఈ సినిమా అర్థం పర్థం లేని చెత్త ఆలోచనలు జనాల మీద రుద్దదు. ఈ సినిమాలో రాధికగా నా పాత్ర ప్రేమ, కోపం, బాధ, అమాయకత్వం ఇలా పలు రకాల భావోద్వేగాలు ప్రదర్శించాలి. ఈ పాత్రకి న్యాయం చేయడం కోసం బాగా రీసెర్చ్ చేశా. నా నటనను చాలా మంది మెచ్చుకున్నారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో పడ్డ కష్టం తాలూకు ప్రతిఫలం ఇక్కడ ఆవిష్కృతమైంది. నిజానికి నా మొదటి సినిమా ఒక పెద్ద దర్శకుడితో చేయాల్సింది, తన గురుంచి తెలిశాక వద్దనుకున్నా. ఏదేమైనా కమర్షియల్ సినిమాలైనా సరే.. అర్ధవంతమైన పాత్రలు అయితే చేయాలనుంది. (చదవండి: కాజల్ అగర్వాల్‌కు సమన్లు?)
మార్పు అంటే అదే..
గాంధీజీ అన్నట్టుగా అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా తిరగగలిగే రోజు వస్తుందా? మానసికంగా, శారీరకంగా అమ్మాయిలపైన జరిగే దాడులు ఆగుతాయా? ఇలాంటి సినిమాలు వస్తే జనంలో ఆలోచన పెరుగుతుంది. వినోదం కంటే ఆలోచనే ముఖ్యం అని నా అభిప్రాయం. అన్ని విషయాల్లో సామాజిక సృహ పెరగాలి. అది సినిమాలు, సోషల్ మీడియా ద్వారా జరిగినప్పుడే మార్పు మొదలవుతుంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా సమాజంలో అశ్లీలత, ఉమెన్‌ని ఒక ఆబ్జెక్ట్‌గా చూపించడం లాంటివి పోవాలి. ఆమె మనసులోని ఆలోచనకు విలువ ఇవ్వాలి. ఎంతసేపు శారీరక అందాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన మాకు తెలీకుండానే మాపై ఒత్తిడి పెరుగుతుంది. అందం కావాలంటే తెల్లగా మారిపోవచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం కృత్రిమంగా ఏర్పర్చలేం. (నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది)
Comments
Please login to add a commentAdd a comment