'ప్రేమ ఒక మైకం' సినిమా రివ్యూ!
'ప్రేమ ఒక మైకం' సినిమా రివ్యూ!
Published Fri, Aug 30 2013 4:33 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
గ్లామర్ పాత్రలతో రాణించి, స్టార్ హోదాను సంపాదించుకున్న హీరోయిన్లు తమలోని అదనపు టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి ప్రస్తుతం వేశ్య పాత్రలపై కన్నేశారు. వేదంలో అనుష్క, పవిత్రలో శ్రీయలు వేశ్య పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనుష్క, శ్రీయల దారినే ఛార్మి ఎంచుకున్నట్టు కనిపించింది, ఇక టాప్ హీరోయిన్ రేసులో వెనుకబడిన ఛార్మి, టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఓ ప్రయత్నం చేసింది. ఇక టెన్త్ క్లాస్, నోట్ బుక్ విజయాల తర్వాత మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు దర్శకుడు చందు ‘ప్రేమ ఒక మైకం’ ద్వారా మరోసారి ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మల్లిక ఓ ప్రొఫెషనల్ వేశ్య. ఎప్పుడూ మద్యం మత్తులో జీవితాన్ని గడుపుతూ నచ్చిన కస్టమర్‌తోనే వ్యాపారం చేస్తూ.. వేశ్య జీవితాన్ని గడుపుతుంటుంది. విలాసవంతమైన జీవితాన్ని మల్లిక అనుకోని పరిస్థితులో ఓ యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్‌లో లలిత్ చూపు కోల్పోతాడు. కొన్ని సంఘటనల ద్వారా జీవితానికి అర్ధం తెలుసుకున్న మల్లిక.. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది. లలిత్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటి. లలిత్ ఎదురైన సమస్యలకు పరిష్కారం దొరికిందా అనే ప్రశ్నలకు సమాధానమే ’ప్రేమ ఒక మైకం’.
మల్లిక పాత్ర ద్వారా వేశ్యగా కనిపించిన చార్మి పాత్ర పరిధిమేరకు పర్వాలేదనిపించింది. తన గ్లామర్ ద్వారా అభిమానులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. వేశ్య పాత్రలో పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మల్లిక పాత్ర ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్ర కథ మల్లిక పాత్ర చుట్టే తిరిగినా ఓ ప్యాకేజ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం చార్మికి పూర్వవైభవం తెచ్చిపెడుతుందా అనే ప్రశ్నకు సమాధానం కష్టమే.
ఈ చిత్రంలో మిగితా పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే లలిత్ (రాహుల్, హ్యపీడేస్ ఫేం) పాత్ర. చాలా రోజులుగా తెరపై కనిపించని రాహుల్‌ను లలిత్ పాత్ర వెతుక్కుంటూ వచ్చిందనే చెప్పాలి. మల్లిక పాత్ర తర్వాత ఎక్కువ నిడివి, ప్రాధాన్యత ఉన్న పాత్ర లలిత్‌దే అని చెప్పవచ్చు. లలిత్ పాత్రను రాహుల్ సద్వినియోగం చేసుకోలేదని చెప్పవచ్చు. లలిత్ ప్రేయసిగా, గాయనిగా నటించిన స్వాతి (శరణ్య) పాత్రపై కూడా ప్రేక్షకుల్లో రిజిస్టర్ కాలేకపోయింది. రావు రమేష్, చంద్రమోహన్, రవిబాబుల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందేమిలేదు.
టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాలతో దర్శకుడు చందు టాలీవుడ్‌లో తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్నారు. 'ప్రేమ ఒక మైకం' కథలో క్లారిటీ ఉన్నా.. తెరకెక్కించడంలో తడబాటుకు గురైనట్టు కనిపించింది. ఈ చిత్రంలో చార్మి తప్ప.. మిగితా ప్రాతలకు నటీనటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు శ్రద్ద వహించలేదనే చెప్పుకోవచ్చు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ప్రేమకథలో మరో ప్రేమకథను జొప్పించి కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేశారు. రాంగోపాల్ వర్మ డూప్ కారెక్టర్, తాగుబోతు రమేష్, బామ్మ కామెడీతో పూర్తిస్థాయిలో వినోదం పండించలేకపోయారు. పాత్రికేయుడు పులగం చిన్నారాయణ తొలిసారి ఈ చిత్రానికి మాటలు రాశారు. తొలి చిత్రంతోనే పులగం తన మాటలతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం విజయం సాధించడం అనేది ప్రేక్షకులు ఆదరించడం మీదే ఆధారపడి ఉంటుంది.
Advertisement
Advertisement