‘ప్రేమించాలి’... ‘సీతాకోక చిలుక’ను గుర్తుచేసింది - వందేమాతరం
‘ప్రేమించాలి’... ‘సీతాకోక చిలుక’ను గుర్తుచేసింది - వందేమాతరం
Published Sun, Nov 3 2013 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
ప్రేమిస్తే, షాపింగ్మాల్, జర్నీ, నాన్న, పిజ్జా... నిర్మాతగా సురేష్ కొండేటి ఉత్తమాభిరుచికి అద్దం పట్టే సినిమాలు. వాటికి ఏ మాత్రం తగ్గని రీతిలో... ఆయన సంస్థ నుంచి రాబోతున్న ‘ప్రేమించాలి’ సినిమా ఉంది’’ అని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. సంతోష్, మనీషా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్వీర్’. తమిళనాట ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు సురేష్ కొండేటి. ఈ చిత్రంలో కీలక సన్నివేశంలో వచ్చే ఓ పాటను భాస్కరభట్ల రాయగా వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు.
ఈ సందర్భంగా చిత్రాన్ని తిలకించిన వందేమాతరం ‘ప్రేమించాలి’ గురించి మాట్లాడారు. ‘‘చిన్న సినిమాలతో ప్రయోగాలు చేయడంలో తమిళ సినిమా ఎప్పుడూ ముందే ఉంటుంది. చిన్న సినిమాగా విడుదలై 16 కోట్లు వసూలు చేసిందంటే... ఈ సినిమా కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాటి ‘సీతాకోక చిలుక’ చిత్రాన్ని గుర్తుచేసిందీ సినిమా. సుశీంద్రన్ ట్రీట్మెంట్ నిజంగా సూపర్బ్. హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఈ సినిమాలో ఓ మంచి పాట పాడే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది.
యువన్శంకర్రాజా ఆణిముత్యాల్లాంటి పాటలిచ్చారు. సాంకేతికంగా కూడా రిచ్గా ఉందీ సినిమా. భాషా బేదం లేకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ఈ నెల ప్రథమార్ధంలో పాటలను, ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేస్తామని సురేష్ కొండేటి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య వి.ఆర్, కూర్పు: ఆంటోని, సహనిర్మాత: సమన్యరెడ్డి.
Advertisement