వారిపైన పగ తీర్చుకుంటా
నేను హీరో అనగానే చాలా మంది హీరోయిన్లు జారుకున్నారు. నేను పెద్ద హీరో అయిన తరువాత వారిపై రివెంజ్ తీసుకుంటాను అంటున్నారు హాస్య నటుడు ప్రేమ్‌జీ. కామెడీ నటులు కథాయకులవుతున్న కాలం ఇది. ఆ వరుసలో సంగీత దర్శకుడు, హాస్యనటుడు ప్రేమ్‌జీ కథానాయకుడిగా అవతారమెత్తారు. ఈయన హీరోగా నటించిన చిత్రం మాంగా. డ్రీమ్ చోన్ మూవీస్ పతాకంపై పీసీకే.శక్తివేల్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని ఆర్‌ఎస్.రాజా నిర్వహించారు.
అద్వైత,లీలా హీరోయిన్లుగా నటించారు. ప్రేమ్‌జీ నే సంగీతాన్ని అందించిన మాంగా చిత్రం ఈ నెల 11న తెరపైకి రానుంది. శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలో గల ఆర్‌కేవీ.స్టూడియోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రేమ్‌జీ మాట్లాడుతూ 2006లో చెన్నై-28 చిత్రం ద్వారా తాను,జయ్, శివ, విజయ్ వసంతన్, వైభవ్ నటులుగా పరిచయం అయ్యాం అన్నారు. అప్పుడు తమలో ఎవరు ముందుగా సోలో హీరోగా పరిచయం అవుతామని పందెం వేసుకున్నామని చెప్పారు.అయితే అంద రిలో చివరిగా హీరో అయ్యింది తానేనని అన్నారు.
అలా తాను సోలో హీరోగా నటించిన చిత్రం మాంగా అని తెలిపారు.తనను ప్రముఖ హీరోలతో నటింపజేసి ఇంతవాడ్ని చేసింది తన అన్నయ్య వెంకట్‌ప్రభునేనని అన్నారు.అన్నయ్య లేకపోతే తాను జీరోనేనన్నారు. మాంగా చిత్రంలో 2015 కాలపు విజ్ఞానిగానూ,1950 నాటి భాగవతార్‌గానూ తాను నటించానని వెల్లడించారు. ఈ చిత్ర కథ బాగుందని నటించడానికి సమ్మతించిన హీరోయిన్లు తాను హీరో అనగానే నటించడానికి నిరాకరించారని తాను పెద్ద హీరో అయిన తరువాత వారందరినీ తనకు అక్కగానో,అమ్మగానో నటింపజేసి పగ తీర్చుకుంటానని ప్రేమ్‌జీ అన్నారు. త్వరలో తన అన్నయ్య దర్శకత్వంలో హీరోగా నటించనున్నట్లు ఆయన వెల్లడించారు. నిర్మాత పీసీకే.శక్తివేల్,దర్శకుడు ఆర్‌ఎస్.రాజా చిత్ర యూనిట్ పాల్గొన్నారు.