భర్తే కాలయముడు
వేధించి చంపిన వైనం!
నిందితునికి గ్రామస్తుల దేహశుద్ధి
వివిధ కోణాల్లో పోలీసుల విచారణ
గుడ్డిప(రావికమతం): భర్త వేధింపులు భరించలేకున్నాను.. రక్షించండంటూ నెల క్రితం పోలీసులను ఆశ్రయించింది. మారిపోయానంటూ భర్త నమ్మబలకడంతో కేసు వాపస్ తీసుకుంది. అయితే తీరుమారని భర్త చేతిలో గురువారం రాత్రి ఆమె హతమైంది. జులాయి తిరుగుళ్లు, ఆపై మద్యానికి బానిసైన భర్తే కాలయముడై కడతేర్చిన సంఘటన మండలంలోని గుడ్డిపలో చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు నిందితునికి దేహశుద్ధి చేసి, తాళ్లతో కట్టి ఆపై పోలీసులకు అప్పగించారు. నర్సీపట్నం ఏఎస్పీ సత్యఏసుబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. మృతురాలు మంగ తల్లిదండ్రులు అద్దెపల్లి వరహాలమ్మ, అప్పారావు ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి. టి.అర్జాపురానికి చెందిన మంగ(25)కు గుడ్డిప గ్రామానికి చెందిన పిల్లా సత్తిబాబుతో ఏడాది క్రితం వివాహం చేశారు. సత్తిబాబుకు అంతకు ముందు పెళ్లయింది. ఆమె కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. దగ్గర బంధువు కావడంతో రెండో వివాహమైనా సత్తిబాబుకు తమ తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేశామని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. అప్పట్లో కట్నంగా నగదు, లాంఛనాలు బాగానే ముట్టజెప్పామన్నారు.
కట్నంగా మరికొంత మొత్తం తేవాలని, బైక్ కొనివ్వాలంటూ తమ కుమార్తెను వేధించేవాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తమ కుమార్తె పొలీసులను ఆశ్రయించగా పెద్దల కౌన్సెలింగ్‌తో మారినట్టు నటించడంతో కేసు వాపస్ చేసుకుందన్నారు. గురువారం రాత్రి పూటుగా తాగివచ్చి, కొట్టి హింసించి ఉరివేసి చంపేశాడని వాపోయారు. ఆతని తల్లితండ్రులు, అన్నను సైతం తరచూ కొట్టడంతో వారంతా తలోదిక్కుకు పోయారని తెలిపారు. నిందితుడ్ని ఏఎస్పీ విచారించగా..తానే ఉరివేసి చంపానని ఒకమారు చెప్పాడు, గణేష్ సంబరం అనంతరం రాత్రి ఇంటికి వచ్చానని తలుపులు వేసి ఉండటంతో బయటనే నిద్రపోయానని, ఉదయం లేచి చూడగా వంటగదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్న భార్యను దించి అందరికీ కబురు చేశానని మరొకసారి చెప్పాడు. దీంతో చంపాక ఉరివేయబడిందా, ఉరివేయడం వల్ల చనిపోయిందా అనే కోణాల్లో విచారిస్తున్నామని ఏఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. నిందితుడు సత్తిబాబును అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తహశీల్దార్ ఉమామహేశ్వరరావు, కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.